‘విశాఖ' గుండెల్లో పేలుళ్లు.. కునుకు లేకుండా చేస్తున్న ప్రమాదాలు

నిన్నటికి నిన్న ఎసైన్షియాలో 17 మంది మృత్యువాత. తాజాగా ‘సినర్జీస్’లోనూ మరో దుర్ఘటన. ఈ పాపం ఎవరిది? యాజమాన్యాలదా? సర్కారుదా?

Update: 2024-08-23 13:33 GMT

(బొల్లం కోటేశ్వరరావు- విశాఖపట్నం)

ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరు విశాఖ. ఇక్కడి ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణం, ఈ ప్రాంతీయుల సౌమ్య గుణం వెరసి విశాఖకు ఆ పేరు తెచ్చిపెట్టింది. మరోపక్క ప్రఖ్యాత కర్మాగారాలు, భారీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు కూడా అదనపు గుర్తింపును, ఉపాధి అవకాశాలనూ తెచ్చాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ, ఉపాధిని ఇస్తున్న ఈ పరిశ్రమలే కొన్నాళ్లుగా వాటిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో పాటు స్థానికుల ఉసురు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో వీటిలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఒక దుర్ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో దుర్ఘటన జరగడం పరిపాటి అయింది.

గతంలో ఎప్పుడైనా ఓ ప్రమాదం జరిగితే మళ్లీ చాన్నాళ్లకే అలాంటి ఘటన జరిగేది. కానీ ఇప్పుడలా కాదు.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమై ప్రజల ప్రాణాలను హరించేస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో? ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఇతర పరిశ్రమల్లోకంటే ఫార్మా పరిశ్రమల్లో రియాక్టర్లు, బాయిలర్ల పేలుళ్లు, గ్యాస్ లేకేజి ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సెజ్, నాన్ సెజ్లో వెరసి 298 కంపెనీలున్నాయి. వీటిలో 130 వరకు రెడ్ కేటగిరీని కలిగి ఉన్నాయి.

గడచిన.. 27 ఏళ్లలో హెచ్పీసీఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్యార్డు, ఎల్జీ పాలిమార్స్ సహా విశాఖ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలు/పేలుళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 120 మందికి పైగా దుర్మరణం పాలయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటికి అనేక రెట్ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఇంకా లెక్కల్లోకి రాని ఘటనల్లో మరెందరో అసువులు బాశారు. రెండు రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియాలో రియాక్టరు పేలుడు దుర్ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు.

ఆ ప్రమాద ఘటన మరువక ముందే శుక్రవారం వేకువజామున పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ (జేఎన్పీసీ)లోని సినర్జీస్ యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్లో మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా పరిశ్రమల్లో వరస ప్రమాదాలు విశాఖ గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు, విశాఖపట్నానివే అత్యధికంగా ఉంటుండడం విశేషం!

ఏ ప్రమాదంలో ఎంతమంది మృత్యువాత? (మచ్చుకు కొన్ని)

 

ఈ పాపం ఎవరిది?

తిలా పాపం తలా పిడికెడు.. అన్నట్టు విశాఖ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాద ఘటనల పాపం ఎవరిది? అంటే మాది కాదంటే మాది కాదని ఎవరికి వారే తప్పించుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో దుర్ఘటనలు జరిగిన వెంటనే ప్రభుత్వం హడావుడి చేయడం, అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నట్టు కనిపించడం, బాధిత కుటుంబాలకు పరిహారం అందించడం, కొన్నాళ్లకు అంతా మరిచిపోవడం, మళ్లీ ఏదో ప్రమాదం జరగడం, మళ్లీ మరణాలు సంభవించడం, అంతా ఉలిక్కి పడటం ఇక్కడ సర్వసాధారణమై పోయింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి. అధికారంలో ఉన్న వారు మునుపటి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని బాధ్యతల

నుంచి తప్పించుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతే తప్ప ప్రమాదాల నివారణకు సంబంధిత యాజమాన్యాలు, అధికారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న దాఖలాల్లేవు. పరిశ్రమల్లో యంత్రాల పనితీరును తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలడం కూడా వరస ప్రమాదాలకు హేతువవుతోంది. దీంతో పొట్ట కూటి కోసం పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు బలైపోతున్నారు. వారి కుటుంబాలు అన్యాయంగా రోడ్డున పడుతున్నాయి. 'ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల వల్ల తరచూ పరిశ్రమల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ఎస్ఈజెడ్లు, వీఈపీజెడ్లలో తనిఖీలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులివ్వడం, తమ పరిశ్రమ/సంస్థలో అంతా బాగానే ఉందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందని మినహాయింపులివ్వడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో యాజమాన్యం పక్షాన నిలవడం వంటివి ప్రమాదాలు తగ్గకపోగా పెరుగుతున్నాయి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయడం లేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కూడా జరగడం లేదు. ప్రమాదాలకు కారకులపై కఠిన చర్యలు ఉండడం లేదు. ఇవన్నీ పరిశ్రమల్లో ప్రమాదాలకు దోహదం చేస్తూ అక్కడ పనిచేసే వారి ఉసురు తీస్తున్నాయి' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు చెప్పారు.

Tags:    

Similar News