బడికెళ్తాం..రోడ్డెయ్యండి
అనకాపల్లి జిల్లా డొంకాడలో చేతులు జోడించి ఆదివాసీ బిడ్డల వేడుకోలు. 15 ఏళ్లుగా పాట్లు పడుతున్నా పట్టించుకునే వారేరి?;
ప్రభుత్వ బడుల్లో చేరండి బాబ్బాబు.. అంటూ ఉపాధ్యాయులు ఊరూ వాడా తిరుగుతున్నా ఫలితం కనిపించని రోజులివి. అలాంటిది మేం సర్కారీ బడికెళ్తాం.. రోడ్డు వేయండి మహాప్రభో అంటూ ఆ ఆదివాసీ బిడ్డలు ప్రాధేయ పడుతున్నా కనికరించే వారే కరువయ్యారు. పాలకులు గాని, అధికారులు గాని వారి గోడు పట్టించుకోవడమే లేదు. అదేదో చీమలు దూరని చిట్టడవీ కాదు.. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం అంతకంటే కాదు. మైదాన ప్రాంతానికి అనుకుని ఉన్న ఊరుకే ఈ దుస్థితి దాపురించింది. సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలోనే ఆ ఊరు ఉంది. అయినా ఆ ఊరి అడవి బిడ్డలు పట్టు వదలని విక్రమార్కుల్లా రోడ్డు కోసం రోడ్డెక్కుతూనే ఉన్నారు. ఆ రోడ్డు కథ, ఆదివాసీ చిన్నారుల దయనీయ వ్యధ కథాకమామిషు ఏమిటంటే?
ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి గ్రామం ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంలో ఉండేది. అప్పట్లో ఆ ఊరులో ఉండే కోందు తెగకు చెందిన ఆదివాసీలు ఎన్నికల్లో ఓటేయడానికి వీల్లేదని మావోయిస్టులు హుకుం జారీ చేశారు. చాన్నాళ్లు మావోయిస్టుల ఆదేశాలను వారు పాటించారు. 15 ఏళ్ల క్రితం ఆ గ్రామస్తులు ఎన్నికల్లో ఓట్లేశారు. ఆ సంగతి తెలిసి మావోయిస్టులు వారిని గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో వారంతా కొన్నాళ్లపాటు గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం సమీపంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారు. మైదాన ప్రాంతానికి ఆనుకుని ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలోని అటవీ ప్రాంతానికి తరలి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమ ఊరికి డొంకాడగా పేరు పెట్టుకున్నారు. అప్పట్నుంచి అక్కడే ఇళ్లు కట్టుకుని, పోడు వ్యవసాయం చేసుకుంటూ పిల్లా పాపలతో జీవిస్తున్నారు. ఇప్పుడా ఊర్లో 180 మంది నివశిస్తున్నారు. అందరిలా తమ పిల్లలను చదివించాలన్న నిర్ణయానికొచ్చారు. తమ ఊరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లేడుబూడి ఎంపీపీ స్కూలుకు పంపుతున్నారు. అయితే ఆ స్కులుకెళ్లడానికి సరైన రోడ్డు లేదు. ఉన్న చిన్నపాటి రోడ్డు తుప్పలు, డొంకలతో నిండిపోయి వెళ్లేందుకు వీలు పడడం లేదు. అయినప్పటికీ గత 15 ఏళ్ల నుంచి ఆ రోడ్డు కాని రోడ్డు మీదుగానే వీరి పిల్లలు బడికెళ్లి వస్తున్నారు. భుజానికి బండెడు పుస్తకాలు తగిలించికుని రానూపోనూ రోజుకు ఆరు కిలోమీటర్లు పడుతూ లేస్తూ బడికెళ్లడం వీరికి పెద్ద ప్రహసనమే అవుతోంది. వర్షాకాలం వస్తే వీరి అవస్థలు చెప్పనలవి కాదు. అయినప్పటికీ చదువు కోవాలన్న పట్టుదల వీరిని బడి మాననీయకుండా చేస్తోంది.
ఏళ్ల తరబడి వేడుకుంటున్నా..