భువనేశ్వరి వల్ల 25ఏళ్లుగా అదే చేస్తున్నాం
సీఎం చంద్రబాబు శనివారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.;
By : The Federal
Update: 2025-01-11 09:23 GMT
నాలుగో సారి ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత సీఎం చంద్రబాబు నోట మానవ విలువలు, కుటుంబ సంబంధాలు, నైతికత వంటి మాటలు జాలువారడం పెరిగింది. సమాజంలో నైతిక విలువలు తగ్గి పోతున్నాయని, కుటుంబ సంబంధాలు బలంగా ఉండాలనే ఉద్బోధనలు పెరిగాయి. ఇదే నేపథ్యంలో తమ కుటుంబం అంతా కలిసి సంక్రాంతికి తమ సొంతూరు నారావారిపల్లెకు ఎందుకు వెళ్తారు.. దానికి ప్రేరణ ఎవరు..కుటుంబమంతా కలిసి వెళ్లాలని ఎవరు పట్టుబట్టారు.. ఎప్పటి నుంచి సంక్రాంతికి సొంతూరు వెళ్తున్నారు వంటి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. శనివారం ఆయన మీడియా చిట్ చాట్‌లో ఈ విషయాలను వెల్లడించారు.
ప్రతి సంక్రాంతికి తమ కుటుంబం అంతా కలిసి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లడానికి తన సతీమణి భువనేశ్వరి కారణమని.. సంక్రాంతికి కుటుంబం అంతా కలిసి నారావారిపల్లె వెళ్లాల్సిందే అని భువనేశ్వరి పట్టుబట్టారని.. ఆమె అలా గట్టిగా పట్టుబట్టడం వల్ల గత పాతికేళ్లుగా ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా సొంతూరుకు వెళ్తున్నామని..అలా సంక్రాంతికి సొంతూరు వెళ్లడమనే సంప్రాదాయానికి భువనేశ్వరే కారణమంటూ తన సతీమణి గురించి.. ఆమె గొప్పతనాన్ని గురించి సీఎం చంద్రబాబు చెప్పొకొచ్చారు.
మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు తగ్గి పోతున్న ఈ రోజుల్లో కుటుంబం అంతా ఒక చోట కలవడం, మాట్లాడుకోవడం, సరదాగా గడపడం చాలా అవసరమని చెప్పారు. సీఎం చంద్రబాబు తన టాక్‌ను అలా మొదలు పెట్టి చివరకు పేదల వద్దకు తీసుకొచ్చారు. కుటుంబం అంతా ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. అదే ఊరిలో పేదలు కూడా ఉంటారు..వారిని కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పొకొచ్చారు. అంతేకాకుండా పేదలకు చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత తక్కిన వారిపైన ఉందన్నారు. అలా పేదల టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే.. రేపు ఆదివారం నాడు పి4 కాన్‌సెప్ట్‌ను ఆయన ప్రారంభించబోతున్నారు. దీని గురించి ప్రజలకు చెప్పడానికి చిట్ చాట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ పీ4 కాన్‌సెప్ట్ మీద అన్ని స్థాయిల్లో చర్చ జరగాలని, ఆ తర్వాతనే దీనిని అమల్లోకి తెస్తామని, ఈ విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పొకొచ్చారు.