48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు.. మొత్తం బకాయిలు ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి మొత్తం బకాయిలను చెల్లించే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Update: 2024-08-12 13:32 GMT

ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి మొత్తం బకాయిలను చెల్లించే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటికే రైతుల బకాయిలపై అన్ని వివరాలు సేకరిస్తున్నామని, వారికి చెల్లించినాల్సిన మొత్తానికి సంబంధించి నివేదికలు అందుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ క్రమంలో పలు విస్తుబోయే వాస్తవాలు తెలియాని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 84,724 మంది రైతులకు రూ.1674.47 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. వీటిని నేటితో చెల్లించేశామని ఆయన వెల్లడించారు. రెండు విడతల్లోనే రైతన్నలకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలను అందించేశామని తెలిపారు. తొలి విడతలో రూ.1000 కోట్లు జారీ చేయగా, సోమవారం రెండో విడతలో భాగంగా రూ.674.47 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇవ్వాల్సిన బకాయిలను మొత్తం చెల్లించి రైతులను కూటమి సర్కార్ ఆదుకుందని, ఇకపై ఇలాంటి బకాయి బాధలు రైతులకు ఉండవని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వం రైతున్నలను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బిల్లులు చెల్లించే సమయంలో ఏకాడికి తమకు ఐనవాళ్లకు, వాళ్ల కాంట్రాక్టర్లకు, సొంత ప్రాజెక్ట్‌లు నిర్మించిన కాంట్రాక్టర్లకే గత ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదని, రైతుల సమస్యల పరిస్కారానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. అదే విధంగా రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు

రైతులకు ఉన్న బకాయిలను చెల్లించేశామని, ఇందులో ఉమ్మడి గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో రూ.472 కోట్ల బకాయిలు జమ చేశామని ఆయన వెల్లడించారు. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి రైతన్నలకు ఈ బకాయిల బాధలు ఉండవని హామీ ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోయేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని, కౌలు రైతులకు కూడా సంక్షేమం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులతో ఆదుకున్నారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా ఎనకాడమని, చిట్టచివరి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేస్తామని అన్నారు.

రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి

రైతాంగాన్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందుకోసం ఆర్బీకేలను రైతు సహాయక కేంద్రాలుగా మార్చాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ-క్రాప్ ద్వారా కౌలు రైతులను వందకు వందశాతం ఆదుకుంటామని, ఇప్పటికే వారి బకాయిలు చెల్లించి అండగా నిలిచామని అన్నారు. రైతులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి టార్పాలిన్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కందిపప్పు ధరను తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రూ.180గా ఉన్న కందిపప్పును రూ.150కే విక్రయించేలా వ్యాపారస్తులను ఒప్పించగలిగామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కావాలంటే ప్రైవేట్ వ్యక్తులతో దందా నడిపారంటూ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News