రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి? కామెడీ చేసిన పృథ్వీ
ఎన్నికలు వస్తున్నాయి.. ప్రచారానికి వస్తా. ఒక్కొక్కరి దుమ్ము దులుపుతా.. పవన్ పెళ్లిళ్లతో పోలవరం ఆగిందా మంత్రి అంబటి ?;
వైసీపీలో ఓ వెలుగు వెలిగి, ఎస్వీబీసీ చానల్ చైర్మన్ గా పని చేసిన థర్టీ ఇయ్యర్స్ ఇన్ ఇండస్ట్రీగా పేరుగాంచిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్ ఏపీ అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చేరిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. అటు మంత్రి రోజా మొదలు ఇటు మరో మంత్రి అంబటి రాంబాబు వరకు ఎవర్నీ వదలకుండా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ లో చేరిన ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిలను కీర్తించారు. తన గురించి తాను చెప్పుకుంటూ.. నేను చంద్రన్న, పవనన్న వదిలిన బాణాన్ని అన్నారు.
షర్మిల ఇప్పడు జగనన్న బాణం కాదు...
“షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులు. ఇప్పడు షర్మిల స్వతంత్ర వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ బాణం వల్ల వైఎస్సార్‌సీపీకి ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు, పవన్ వదిలిన బాణం పృథ్వీరాజ్. రోజా లాంటి బూతుల మంత్రులు కుప్పకూలి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. డ్యాన్సులు, సినిమాలు, సినిమా కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేవాళ్లు కూడా మంత్రులేనా? తాను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశా. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి”? అంటూ సెటైర్లు పేల్చారు.
పవన్ పెళ్లిళ్ల వల్ల పోలవరం ఆగిందా అంబటి?
ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలన్నారు.
మూడిట్లో ఒక్క రాజధానైనా ఉందా?
ఏపీలో ఒక్క రాజధాని లేదు.. ఇంక మూడు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఎన్నికలు మొదలవుతున్నాయి.. ప్రచారానికి వస్తాను.. ఒక్కొక్కరి దుమ్ము దులుపుతానన్నారు. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకూ తనను ప్రచారానికి వాడుకుని వదిలేసిన అధికార పార్టీ సంగతి చూస్తానన్నారు. ఎవరి జాతకం ఏంటనేది తన దగ్గర ఉందన్నారు. నారా లోకేష్ దగ్గర ఎర్ర డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా ఓపీఆర్ డైరీ ఉందని.. అందరి జాతకాలు బయటపెడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పృథ్వీ ప్రకటించారు.