పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పారు?

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం పలు పదనిసలు తొక్కింది. ఇంతకూ ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశం ఏమిటనేది ఇప్పుడు చర్చగా మారింది.;

Update: 2025-03-15 04:08 GMT

కులం, మతం, ప్రాంతం, భాష వంటి వైరుధ్య అంశాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చాయి. 12 ఏళ్ల క్రితం ఏర్పాటైన జనసేన ఆవిర్భావ సభ ఏపీలోని పిఠాపురంలో జరిగింది. సభకు లక్షల మంది ప్రజలను సమీకరించారు. ఈ సభ సాయంత్రం ప్రారంభం అవుతుందనుకుంటే రాత్రి మొదలైంది. పవన్ కల్యాణ్ ప్రసంగం సాగిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకసారి తన జీవిత విశేషాలు చెప్పారు. బాల్యం గడిచిన తీరును వివరించారు. మరికొంత సేపు సినిమాలు, తన వ్యక్తిగత జీవితం, ప్రభావితం, తల్లిదండ్రుల ప్రభావం వంటి అంశాలు ప్రస్తావించారు. చెన్నైలో తెలుగు భాష పట్ల వివక్ష ఉందనే అంశాన్ని ప్రస్తావించారు.

ఉత్తర భారత, దక్షిణ భారతం వంటి అంశాలు ప్రస్తావించారు. దేశం ముక్కలైన సందర్భంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్కడి నేతలు, మతాల వ్యవహారాల గురించి చెప్పుకొచ్చారు. దళిత వ్యక్తులు స్వతంత్రం వచ్చిన కొత్తలో మంత్రులుగా పనిచేసి ఏమయ్యారో చెప్పారు. ముస్లిమ్ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం గురించి ప్రస్తావిస్తూ గోద్రా ఘోరం గురించి కూడా చెప్పారు.

తాను చేగువేరా గురించి చెబుతూ ఆయన ఆలోచనల నుంచి హిందూత్వం వరకు జనసేన అజెండాగా ఉంటుందని పొంతన లేని మాటలు చెప్పారు. కమ్యూనిస్టు బావ జాలం నుంచి హిందూత్వ భావజాలంలోకి వచ్చానని చాలా మంది నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో మంది మేధావుల ఆశయాలతో తమ పార్టీ నిర్మించ బడిందని అన్నారు. లెఫ్ట, రైట్ కాదు ఎంతో మంది మేధావుల గురించి చదివా. వారి ఆలోచనలు నేను ఆచరణలోకి తీసుకొచ్చా అంటూ పార్టీ భావజాలం సమ్మిళితం అనేది చెప్పకనే చెప్పారు.

రాష్ట్రం, ప్రజలు, సమస్యలు, పార్టీల పనితీరు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, అభివృద్ధి ఎలా ఉండాలి, అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రాన్ని ఎలా ఆ ఊబి నుంచి బయట పడేయాలి అనే అంశాలు పెద్దగా ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. నేను వీధి బడి నుంచి వచ్చాను. డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అయితే లోకం గురించి తెలుసుకున్నాను. ఎన్నో పుస్తకాలు చదివాను, మహాను భావుల గురించి చదివాను. భాషలు నేర్చుకున్నాను. నా జీవితంలో జరిగిన వన్నీ యాదృచ్చికంగానే జరిగాయి. సినిమాల్లోకి వస్తాననుకోలేదు. రాజకీయాల్లోకి వచ్చి జాతీయ స్థాయిలో చర్చించే నాయకుడిని అవుతాననుకోలేదు. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగాయి. అందుకే చెబుతున్నా.. నేను దేశం కోసం ప్రాణం ఇస్తా నంటూ చెప్పటం విశేషం.

మోదీ చెప్పించారా?

జరిగింది జనసేన పార్టీ ఆవిర్బావ సభ. ఈ సభలో హిందూ, ముస్లిమ్, క్రిష్టియన్ మతాల గురించిన ప్రస్తావన ఎక్కువగా వచ్చింది. పార్టీ నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పి ప్రజలకు రానున్న నాలుగేళ్లలో ఏమి చేస్తారో వివరిస్తే బాగుండేదనే చర్చ కూడా మొదలైంది. ప్రధాన మంత్రి చెప్పదలుచుకున్న అంశాలు ఎక్కవగా పవన్ కల్యాన్ నోటి నుంచి వచ్చాయని, అవి ప్రధాన మంత్రే ఆయనో పలికించి ఉంటారనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. గోద్రా సంఘటనపై మాట్లాడుతూ తప్పు చేసిన వాడిని అప్పుడే చంపేసి ఉంటే సరిపోయేదనే వ్యాఖ్యలపై కూడా చర్చ మొదలైంది. మనలో మనమే తప్పు చేశాడని నిర్థారించి చంపేస్తే ఇక చట్టాలు, న్యాయస్థానాలు ఎందుకనే చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి స్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడనేదానిపై అంశంపైనా చర్చ ప్రారంభమైంది.

తమిళనాడు ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకించారు

తమిళనాడు ప్రభుత్వం హిందీ భాషకు వ్యతిరేకంగా ఎందుకు ఉంది. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. తమిళనాడు ముఖ్యమంత్రి తీరు సరైంది కాదని పవన్ కల్యాన్ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనేది పలువురి వాదన. సంస్కృతంలో ఉన్న శ్లోకాలు ఆ భాషలోనే అందంగా ఉంటాయి. అంతే కాని సంస్కృతం వద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏ భాషకు ఆభాష గొప్పది. అలాగని హిందీ భాషను ఎందుకు వ్యతిరేకించాలి అంటూ తన ప్రసంగంలో హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు కొనసాగించారు. పెరియార్ గురించి ప్రస్తావిస్తూ రాయల సీమకు చెందిన బలిజ కులస్తుడు పెరియార్ అన్నారు. అంటే తాను కూడా బలిజ కులానికి చెందిన వాడినేనని చెప్పుకోవడమే దీని ఉద్దేశ్యమై ఉంటుందనే అభిప్రాయం ప్రల్లో వ్యక్తమవుతోంది. పెరియార్ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ప్రజలకు తెలుసు.

పవన్ కల్యాణ్ మాటమీద నిలబడే వ్యక్తి కాదు

పవన్ కల్యాన్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని, తాను చెప్పిందే పదేపదే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడు, అక్కడే చదువుకున్నానంటాడు. ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదన్నారు. కులాలు, మతాల గురించి మాట్లాడి మనుషులను వేరు చేసే విధానాలకు ఇకనైనా స్వస్తి చెప్పాలన్నారు.

Tags:    

Similar News