కమెడియన్ అలీ ఎక్కడ?

ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ నేత, ప్రముఖ హాస్య నటుడు అలీ ఏమయ్యారు? ఎక్కడా ఎందుకు కనిపించట్లేదు? ఎన్నికల బరిలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు?

Update: 2024-03-20 05:19 GMT
Source: Facebook


ఆంధ్ర రాజకీయాల్లో కమెడియన్ అలీ ఎక్కడ? ఏమైపోయారు? ఎక్కడా ఎందుకని కనిపించడం లేదు? ప్రస్తుతం తెలుగు ప్రజల గుండెల్లో మెదులుతున్న ప్రశ్నలివి. నటనా రంగంలో దిగ్గజ హాస్యనటుడిగా పేరొందిన అలీ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ.. అలీకి కేటాయించిందన్న వార్తలు కూడా వచ్చాయి. కొంతకాలానికే వాటిలో వాస్తవం లేదని తేలిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలో చేరిన అలీ.. రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు.

కానీ అనూహ్యంగా ఆయన జనసేనకు గుడ్‌బై చెప్పి 11 మార్చి 2019న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పలు చోట్ల వైసీపీ తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్.. ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. కానీ అలీ కోరుకున్న పదవి అది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఈసారైనా ఎన్నికల బరిలో నిల్చోవాలని అలీ భావిస్తున్నట్లు సమాచారం.

అలీ పోటీ ఎక్కడి నుంచి

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి అలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం హాట్‌టాపిక్‌గా మరింది. ఎందుకుంటే గతంలో అలీపై పోటీ చేయడానికి తాను సిద్ధమని పవన్ ప్రకటిస్తే.. అదే తరహాలో పవన్‌పై పోటీకి సై అని అలీ కూడా సంచలన ప్రకటన చేశారు. దాంతో 2024 ఎన్నికల్లో వీరిద్దరూ ప్రత్యర్థులుగా పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారు? అన్న విషయాలు ఆసక్తిగా మారాయి. తాజాగా పవన్ తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి అలీ పోటీ ఎక్కడి నుంచి అన్న అంశంపై తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే అలీ.. హిందూపురం నుంచి పోటీ చేస్తారని, నంద్యాల నుంచే అని ఈ ఏడాది ఆరంభంలో, గుంటూరు ఎన్నికల బరిలో నిల్చోనున్నారని ఈ నెల ప్రారంభంలో కూడా వార్తలు వినిపించాయి.

తాజాగా అలీ పోటీ ఇక్కడి నుంచే అంటూ నెల్లూరు, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాల పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనిపై స్వయంగా అలీ సైతం స్పందించడం లేదు. ఆఖరికి వైసీపీ పార్టీ అధిష్టానం కాదు కదా చిన్నపాటి నేతలు కూడా ఈ ఊసెత్తడం లేదు. దానికి తోడు అలీ కూడా పార్టీ ప్రచారాలకు, కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో అలీ కనిపించలేదు.



ఎంపీగా అలీ పోటీ

హాస్యనటుడు అలీ.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్న వేళ. ఇందులో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. అలీ.. ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీల బరిలో ఉండనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఇటీవల వైసీపీ ప్రకటించిన 175 మంది అభ్యర్థుల జాబితాలో అలీ పేరు లేకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కానీ ఎంపీగా అయినా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం ఇంకా తేలలేదు. దీనిపై వైసీపీ కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

పోటీపై అలీ ఏమన్నారంటే

ఇటీవల 2024 ఫిబ్రవరిలో తన అభ్యర్థిత్వంపై అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది తనకే తెలియదని చెప్పారు. ‘‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తా అన్నది నాకూ తెలీదు. సీఎంఓ నుంచి ఫోన్ రావాలి. సీఎం జగన్ పిలిచి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓ వారంలో ఏ విషయం తెలియొచ్చు. పార్టీ ఏదైనా నిలబడిన వ్యక్తి మంచివారైతే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. ఎవరు ఏంటనేది ప్రజలే నిర్ణయిస్తారు’’అని తెలిపారు. అనంతరం ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా అంతిమ నిర్ణయం ఓటరుదే ఉంటుందని హితవు పలికారు.

ఇప్పుడేంటి పరిస్థితి

ప్రస్తుతం అలీ పోటీపై తీవ్ర సందిగ్ధత నెలకొని ఉంది. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా లేదంటే ఎంపీగా పోటీ చేస్తారా అన్నది ఆంధ్రలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుకు వ్యతిరేకంగా అసమ్మతి సెగలు రేగడమే ఇందుకు కారణం. అసమ్మతి కారణంగా పలు చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎక్కడైనా అలీకి అవకాశం రావొచ్చా అన్న చర్చలు జరుగతున్నాయి. ఇదే నేపథ్యంలో నామినేషన్ల వరకు కూడా అలీ పోటీపై ఏ విషయం చెప్పలేమని, ఆఖరి క్షణంలో ఏదైనా నియోజకవర్గం నుంచి అలీ చేత నామినేషన్ వేయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనిపై అలీ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.



Tags:    

Similar News