మూతకు దగ్గర్లో విశాఖ ఉక్కు, కార్మికుల జీతాలకూ ఇక్కట్లే!

విశాఖ ఉక్కులో ఇప్పటికీ రానీ జీతాలు. కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? దీనంతటి వెనక కేంద్రం హస్తం ఉందా? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఏం జరుగుతోంది.

Update: 2024-04-20 13:52 GMT
Source: Twitter

విశాఖ స్టీల్ ప్లాంట్ పనైపోయిందా? ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వలేకుందా? విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం నీళ్లపాలేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే చెప్తున్నాయి. ఉత్పత్తి 30 శాతం తగ్గిపోయింది. ఆఖరికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కర్మాగారం ఉందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల ఇవ్వాల్సిన జీతాల్లో కేవలం 50 శాతం మాత్రమే చెల్లించింది. ‘‘మేము ప్రస్తుతానికి 50 శాతం మాత్రమే ఇవ్వగలం. మిగిలిన మొత్తాన్ని త్వరలో సర్దుబాటు చేస్తాం’’అని కార్మికులకు ఈ నెల 8న విశాఖ ఉక్కు యాజమాన్యం వివరించింది. చెప్పినట్లే కార్మికుల ఖాతాల్లో 50 శాతం జీతాన్ని జమ చేసింది. అయితే తమకు మిగిలిన జీతాన్ని కూడా వారం రోజుల్లో చెల్లించాలని ఉద్యోగులు పట్టుబట్టారు. అయినా ఇప్పటివరకు మిగిలిన జీతాన్ని ఇచ్చిన దాఖలాలు లేవు.

ఉత్పత్తి కూడా అంతంత మాత్రమే

విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయింది. సాధారణంగా అయ్యే ఉత్పత్తిలో ప్రస్తుతం 30 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ఇది కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి తీవ్ర దెబ్బ కానుందని నిపుణులు చెప్తున్నారు. కోకింగ్ కోల్ సరఫరా క్షీణించడంతోనే ఉత్పత్తి పడిపోయిందని విశాఖ ఉక్కు యాజమాన్యం చెప్తోంది. కోకింగ్ కోల్ సరఫరాను మామూలు స్థాయికి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఇప్పటికే దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అతి త్వరలోనే విశాఖ ఉక్కు మళ్ళీ తన సాధారణ స్థితికి చేరుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అసలేంటి సమస్య..

గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం విశాఖ ఉక్కుపైన కూడా పడుతుంది. దాని కారణంగానే ఇప్పుడు విశాఖ ఉక్కు ఉత్పత్తి తీవ్రంగా క్షీణించింది. ఈ సమ్మె వల్ల విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సిన కోకింగ్ కోల్ అందడం లేదు. దాంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కావాల్సిన బొగ్గును సమకూర్చుకోవడానికి విశాఖ ఉక్కు నానాతంటాలు పడుతోంది. అందువల్లే కీలకమైన రెండు ఫర్నేస్‌‌లను నిలిపివేశారు. దీని ప్రభావం ఉత్పత్తిపై తీవ్రంగా ఉందని, 70 శాతం ఉత్పత్తిని నిలిచిపోవడంతో సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని యాజమాన్యం వివరించింది.

గంగవరం పోర్టులో సమస్యేంటి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆనుకుని ఉన్న గంగవరం పోర్టు ప్రస్తుతం అదానీ ఆధీనంలో ఉంది. అక్కడి అన్ని కార్యకలాపాలను అదానీ సంస్థలే చూసుకుంటున్నాయి. ఈ పోర్టును ప్రభుత్వం నిర్మించినా దీనిని అదానీ గ్రూప్ హస్తగతం చేసుకుంది. అక్కడ తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ అక్కడి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు పూర్తి చేసే వరకు పోర్టు కార్యకలాపాలేవీ జరగవని వెల్లడించారు. వారి సమ్మే కారణంగా పోర్టు కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. దాంతో విశాఖ ఉక్కుకు అందాల్సిన కోకింగ్ కోల్ ఉత్పత్తులు కూడా పోర్టులోనే నిలిచిపోయాయి.

నౌకలను మళ్ళించడానికి ప్రయత్నాలు

ఈ సమ్మె ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలుగా ఆస్ట్రేలియా నుంచి 1.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ తీసుకువచ్చి గంగవరం పోర్టులో నిలిచిపోయిన నౌకలను విశాఖ పోర్టుకు మళ్లించాలని విశాఖ ఉక్కు యాజమాన్యం ఆలోచించింది. అందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నౌకలకు కావాల్సిన బెర్త్‌లను విశాఖ పోర్ట్‌లో బుక్ చేస్తున్నామని, దాంతో పాటుగా ఇతర పోర్టులకు మళ్లించడానికి కూడా చర్యలు తీసుకున్నామని యాజమాన్యం స్పష్టం చేసింది.

సంస్థకు అదనపు భారం

ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కోకింగ్ కోల్‌ నౌకలను విశాఖ పోర్ట్‌కు తరలించడం వల్ల విశాఖ ఉక్కు సంస్థకు అదనపు భారం కానుంది. తరలింపు చర్యలతో పాటు విశాఖ పోర్ట్ నుంచి సంస్థకు బొగ్గును దిగుమతి చేసుకోవాలంటే 27 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ 27 కిలోమీటర్ల దూరం బొగ్గును తీసుకురావడానికి రైల్వే వ్యాగన్‌లు వాడాల్సి ఉంటుందని, కానీ రైల్వే మాత్రం 100 కిలోమీటర్లకు ఛార్జ్ వేస్తారని సంబంధిత వర్గాలు చెప్పాయి. దానికి తోడు పోర్ట్‌లో హ్యాడ్లింగ్ ఛార్జ్‌లు చెల్లించాల్సి ఉంటుందని, ఇన్ని రోజులు దిగుమతి చేసుకోనందుకు డెమరేజీ ఛార్జీలు అదనంగా ఉంటాయి. దీని వల్ల కోకింగ్ కోల్ నౌకలను విశాఖ పోర్ట్‌కు తరలించడం వల్ల సంస్థకు నష్టమే తప్ప లాభం లేదని అధికారులు చెప్తున్నారు.

పోర్ట్ కార్మికులపై విమర్శల వెల్లువ

గంగవరం పోర్టులో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తూ పోర్ట్ కార్యకలాపాలను నిలిపివేసిన కార్మిలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 30 వేల మంది ఉంటారు. మరో 50 వేల మంది ఈ కర్మాగారంపై పరోక్షంగా ఆధారపడి పని చేస్తుంటారు. అలాంటప్పుడు వంద మంది తమ ప్రయోజనాల కోసం వేల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని విశాఖ ఉక్కు కార్మికులు విమర్శిస్తున్నారు.

స్పందించని అదానీ

గంగవరం పోర్ట్‌లో జరుగుతున్న సమ్మె చుట్టూ ఇంత తతంగం నడుస్తున్నా పోర్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న అదానీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. పోర్ట్ నిర్మాణం తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సిన అన్ని ముడి సరుకులను కన్వీనర్ బెల్ట్ ద్వారా అందించడానికి అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు కార్మికుల సమ్మెను సాకుగా చూపి విశాఖ ఉక్కుకు అందించాల్సిన ముడి సరుకును నిలిపివేసింది. దీనిపై ప్రశ్నించినా అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి స్పందన లేదు.

కర్మాగారాన్ని మూయించడానికి కుట్ర

ఇదిలా ఉంటే గంగవరం ఎయిర్‌పోర్ట్‌లో కార్మికులు సమ్మె చేయడం. దానిని సాకుగా చూపి విశాఖ ఉక్కు ప్లాంట్‌కు ఇవ్వాల్సిన ముడిసరుకు నిలిపివేయడం. ఇదంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూయించడానికి జరుగుతున్న కుట్రేనంటూ పలు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనక కేంద్రం హస్తం ఉందని, విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న తమ సంకల్పాన్ని సాధించడానికే బీజేపీ ఈ పన్నాగాలు పన్నుతుందని, అందులోనివే ఇవన్నీ అని వారు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. అదానీకి గంగవరం పోర్ట్‌ ఒప్పందం రావడం వెనక కూడా బీజేపీ హస్తం ఉందని వారు అనుమానిస్తున్నారు.

ఉక్కు పరిశ్రమ భవిష్యత్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ భవితవ్యం డైలమాలో పడింది. ఇప్పటికే ఉత్పత్తి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో నైకలను విశాఖ పోర్ట్‌కు తరలించడం మరింత అదనపు భారంగా మారనుంది. దీనికి తోడు ఉత్పత్తిని జరుపుతూ ఉండటానికి ఇతర ప్లాంట్స్ నుంచి 50 వేల టన్నుల బొగ్గును అప్పుగా తీసుకోవాలని విశాఖ పరిశ్రమ యోచిస్తోంది. దీంతో రానున్న అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోవయ్యని నిపుణులు భావిస్తున్నారు. నష్టాలు వస్తే పరిశ్రమ మనుగడ కష్టమవుతుందని వారు చెప్తున్నారు. ఇప్పుడు కనుక విశాఖ ఉక్కు పరిశ్రమ వెంటనే పుంజుకోవాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కేంద్రం జోక్యంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకుల రవాణాను పునరుద్ధరించడం సులభతరం అవుతుందని, అలా చేస్తేనే విశాఖ ఉక్కును నష్టాల ఊబిలో కూరుకోకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News