సేఫ్టీ ఆడిట్‌ అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ప్రమాదాల నివారణలో సేఫ్టీ ఆడిట్‌ అనేది కీలకమైంది. అసలు సేఫ్టీ ఆడిట్‌ అంటే ఏమిటి? దానిని ఎందుకు చేయించుకోవాలి? ఎవరు చేస్తారు?

Update: 2024-08-26 07:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వరుస పరిశ్రమ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్‌ అనే అంశం తెరపైకి వచ్చింది. ప్రమాదాల బారిన పడి పదుల పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలో పోగొట్టుకుంటున్నారు. దీంతో సేఫ్టీ ఆడిటింగ్‌ అనేది ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.

పరిశ్రమల్లో ప్రమాదాలు జరక్కుండా, ప్రాణాపాయం లేకుండా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలను క్షేత్ర స్థాయికి వెళ్లి ఆయా పరిశ్రమలను పరిశీలించి, తనిఖీలు చేపట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపై ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయడాన్నే సేఫ్డీ ఆడిట్‌ అంటారు.
పరిశ్రమల్లో ప్రమాదకరమైన ఏరియాలను గుర్తించారా. ప్రమాదకరమైన రా మెటీరియల్స్‌ను, తయారీ ప్రోసెస్‌లో వాటిని ఉపయోగించే విధానాలు, వాటి రియాక్షన్ల ఐడెంటిఫై చేశారా. తయారైన ప్రోడెక్ట్స్‌ ప్రోపర్టీస్‌ను అధ్యయనం చేయడం, ఒక వేళ ఇలాంటి వాటివల్ల జరిగే ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పరిశ్రమల నిర్మాణాలు, వాటి డిజైన్‌లు, ఇన్‌స్టాలేషన్‌లు, ఆపరేషన్లు, మెయింటెనెన్స్, ఫెసిలిటీలు వంటివి ప్రమాదాల నివారణకు సంబంధించిన నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా, థర్డ్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సేఫ్టీ ఆడిట్‌లు నిర్థేశించిన టైమ్‌ ప్రకారం జరుగుతున్నాయా వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సేఫ్టీ ఆడిట్‌ చేస్తారు. అంతేకాకుండా పరిశ్రమల్లో కెమికల్‌ నిల్వలు, వాటిని ఉపయోగించే విధానాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అనే అంశాలను కూడా పరిశీలిస్తారు. కెమికల్‌ స్టోరేజీ పరికరాలకు లేబిలింగ్, కలర్‌ కోడింగ్‌ల అరేంజ్‌మెంట్స్‌ ఎలా ఉన్నాయి, ఉపయోగించే ముడి సరుకులకు ఐఎస్‌ఐ కోడ్‌లు ఉంటున్నాయా, వాటిపైన అవగాహన, అనుభవం కలిగిన వారి చేత కంటెయినర్లను హ్యాండిల్‌ చేస్తున్నారా లేదా, పేలుడు, విషపూరిత పదార్థాల నిల్వలు ఎలా చేస్తున్నారు, భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా వంటి అంశాలను కూడా అంచనా వేస్తారు. అంతేకాకుండా ఫైర్‌ అండ్‌ పేలుడు పదార్థాల రిస్క్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సేఫ్టీ ట్యాంకుల ద్వారా ఫ్లేమబుల్‌ లిక్విడ్స్‌ను సప్లై చేస్తున్నారా లేదా, ఫ్లేమబుల్‌ ద్రావకాలు, ఇతర మెటీరియల్స్‌ను పైపులు, గొట్టాల ద్వారా సప్లై చేస్తున్నారా లేదా, నిల్వలు, సరఫరా సమయాల్లో ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు సరిపడిన వ్యవస్థను ఏర్పాటు చేశారా లేదా వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు.
వీటితో పాటుగా సుశిక్షుతులైన వర్కర్లు ఉన్నారా లేదా, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రక్షణ పరికరాలను కలిగి ఉన్నారా లేదా, పరికరాలు సేఫ్టీ మెషర్స్‌ ప్రకారం ఉన్నాయా లేదా మెయింటెనెన్స్‌ సేఫ్టీ ఎలా ఉంది, నిర్థేశించిన సమయం ప్రకారం వాటిని టెస్టులు చేస్తున్నారా లేదా, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో వర్కర్లు భాగస్వాములు అవుతున్నారా లేదా, సేఫ్టీ కమిటీలు ఉన్నాయా లేదా, పరిశ్రమలో ఎన్ని ప్రమాదకర ఏరియాలు ఉన్నాయి ఇలా అనేక అంశాలను పరగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ ఆయా పరిశ్రమల యజమానులు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే అంశాలను ఆధారంగా చేసుకొని సేఫ్టీ ఆడిట్‌ను నిర్వహిస్తారని గుంటూరు రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ బి రాంబాబు ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు తెలిపారు.
మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్‌ అండ్‌ ఇంపోర్ట్‌ ఆఫ్‌ హజార్డస్‌ కెమికల్‌ రూల్స్‌ 1989 ప్రకారం, ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ చట్టం 1986 ప్రకారం పరిశ్రమల్లో ఈ సేఫ్టీ ఆడిటింగ్‌ నిర్వహిస్తారని, సవంత్సరానికి ఒక సారి ఈ సేఫ్టీ చేయాల్సి ఉంటుందని కృష్ణా రీజియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాజు తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఇవి ఎంతగానో ఉపయోగ పడుతాయని ఆయన చెప్పారు. థర్డ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ సేఫ్టీ ఆడిట్‌ చేపడుతారు. థర్డ్‌ పార్టీ కింద ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణత కలిగి ఉంటారు. అలాంటి వారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నుంచే సర్టిఫికేట్లు జారీ చేస్తారు. వీరు థర్ట్‌ పార్టీ కింద పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ను నిర్వహిస్తారు.
ఏడాదికి ఒక సారి తప్పని సరిగా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ చేయించుకోవలసిన బాధ్యత ఆయా పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుంది. యాజమాన్యాలు దీని కోసం ముందుకు రావలసి ఉంటుంది. ఇలా పూర్తి చేసిన సేఫ్టీ ఆడిట్‌ను ఆయా పరిశ్రమల యజమానులకు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌కు కూడా అందజేస్తారు. ఈ నివేదిక ప్రకారం పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించడంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో, ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపైన రెకమెండేషన్లు చేస్తారు. వీటిని పరిశ్రమల యజమానులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఒక వేళ వాటిని పాటించకుండ ఉంటే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా ఈ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని, ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేస్తుంది. దాని ప్రకారం సేఫ్టీ ఆడిట్‌ను చేయించుకోవలసిన బాధ్యత ఆయా పరిశ్రమల యజమానులపై ఉంటుంది. దీనికి తగిన చర్యలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ తీసుకుంటుంది. అయితే కొన్ని పరిశ్రమలు ప్రభుత్వ ఆదేశాను సారం సేఫ్టీ ఆడిటింగ్‌లు చేయించుకోవడంలో ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.
Tags:    

Similar News