ఐఎఎస్ శ్రీలక్ష్మి దారెటు? OMC ఎందుకు వెంటాడుతోంది?

రాజకీయ విధేయత శ్రీలక్ష్మిని కాపాడలేకపోయిందా!?;

Update: 2025-05-13 02:10 GMT
ఐ.ఎ.ఎస్. అధికారి యర్రా శ్రీలక్ష్మి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఓబుళాపురం కేసు వెంటాడుతోంది. సీబీఐ ఈ కేసును ముగించినా సుప్రీంకోర్టు శ్రీలక్ష్మిని వదల్లేదు. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురికి సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన 48 గంటల్లోపే సుప్రీంకోర్టు - శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరిపించాలని- తాజాగా ఆదేశించింది. 3 నెలల్లో ముగించాలని పేర్కొంది. 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా సుప్రీంకోర్టు శ్రీలక్షికి ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
తాజా ఉత్తర్వుల నేపథ్యంలో చాలా ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్లకు మధ్య అనుబంధం ఎందుకుంటుందీ? రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించడానికి గల కారణాలు ఏమిటీ? స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు తలొగ్గుతుందీ? వంటివనేకం చర్చకు వచ్చాయి.
అసలు ఎవరీ శ్రీలక్ష్మీ?
యర్రా శ్రీలక్ష్మి. తల్లిదండ్రులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 1988లో ఐఏఎస్ టాపర్. ఆంధ్రప్రదేశ్ కేడర్‌. పట్టుదల, విధేయతకు మారుపేరు. పలు కీలక శాఖల్లో పని చేశారు. ఖనిజ శాఖ డైరెక్టర్‌గా, హైదరాబాద్ కలెక్టర్‌గా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.

ఐపీఎస్ అధికారి గోపీకృష్ణను కులాంతర వివాహం చేసుకున్న శ్రీలక్ష్మికి ఇద్దరు పిల్లలు. చంద్రబాబు హయాంలో ఎంత ఆదరణ పొందారో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ అంతకు మించి ఆదరాభిమానాలు పొందారు. నిర్మొహమాటిగా పేరున్న శ్రీలక్ష్మి కెరియర్‌ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణంతో తల్లకిందులైంది.
ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ (OMC)కి చట్టవిరుద్ధంగా మేలు చేసేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణపై 2011 నవంబర్ 30న అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుతో ఆమె జీవితం అల్లకల్లోలమైంది. ఆమె కటకటాలపాలైంది. ఆర్ధికంగా, హార్ధికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన తొలి మహిళా ఐఎఎస్ గా రికార్డులకు ఎక్కింది.
అప్పటి వరకు ఆమెకు అండగా నిలిచిన అధికార బలంగానీ, తన సొంత కాపు సామాజిక వర్గం గాని ఆమెను అరెస్ట్ నుంచి కాపాడలేకపోయాయి. ఆమె పూర్వీకుల్లో ఒకరు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవి (కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి) ఆమె కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేశారని చెబుతుంటారు.
వెంటాడిన లైసెన్సుల వివాదం..
సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ నోట్ ప్రకారం, 2004 నుంచి 2009 మధ్య ఆమె పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో అనేక ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి (ఓఎంసీ) మేలు చేసేందుకు ఇతర 22 కంపెనీల దరఖాస్తులను పునఃపరిశీలించకుండా, OMCకి మినహాయింపు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.
2007 జనవరి 18న కేంద్ర గనుల కార్యదర్శికి ఆమె లేఖ రాస్తూ... కట్-ఆఫ్ డేట్ (2004 ఆగస్టు 28) నాటికి కేవలం రెండు కంపెనీలే మైనింగ్ కి దరఖాస్తు చేశాయనీ, వాటిలో ఒకటి OMC, మరోటి జనార్దన్ రెడ్డి మామకు చెందిన వినాయక మైనింగ్ కంపెనీ అని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను ఆమె తిరస్కరించి, మూడే రోజుల్లో OMCకి లైసెన్సు మంజూరు చేశారు. కేంద్ర గనుల శాఖకు తప్పుదోవ పట్టించేలా లేఖలు రాశారన్నది సీబీఐ ఆరోపణ.
ఆమెకు ఇచ్చిన దిశానిర్దేశాల్లో, దరఖాస్తుదారుల నుండి వివరణలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పినప్పటికీ — వారి వివరణ రాకముందే, 2007 జూన్ 18న రెండు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా (GO నెం. 151, 152), 68.5 హెక్టార్లు, 39 హెక్టార్ల విస్తీర్ణాల్లో మైనింగ్ లైసెన్సులు OMCకి జారీ చేశారు. అదేరోజే గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఫైల్‌పై సంతకం తీసుకున్నారు. మరో దరఖాస్తును కూడా అదేరోజే తిరస్కరించారు.
‘కెప్టివ్ పర్పస్’ క్లాజ్‌ తారుమారు?
OMCకి ఇచ్చిన లైసెన్సులు “కెప్టివ్ పర్పస్” కోసం అని ఉద్దేశించినా, ఆ విషయాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనలేదు. అంటే — బ్రాహ్మణి స్టీల్‌కు ఖనిజాన్ని సరఫరా చేయాలన్న ఉద్దేశ్యాన్ని ప్రస్తావించకపోవడం ద్వారా OMC దాన్ని ఎగుమతులకు కూడా ఉపయోగించగలిగింది.
"Captive mining purpose" అంటే — ఒక కంపెనీ తవ్విన ఖనిజాన్ని (mineral) బయటకు అమ్మకానికి కాకుండా, తానే యాజమానిగా ఉన్న కర్మాగారంలో (factory/plant) ఉపయోగించడానికి మాత్రమే వినియోగించాలన్న ఉద్దేశం. అంటే దానర్థం ఏదైనా కంపెనీ తవ్విన ఖనిజాన్ని ఎగుమతి చేయకుండా, తన సొంత ఉత్పత్తి యూనిట్‌కు సరఫరా చేయాలి.
ఓబుళాపురం కేసులో ఏమి జరిగిందీ?
OMCకి ఇచ్చిన మైనింగ్ లైసెన్సు "captive use only" అనే షరతుతో ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆ షరతును స్పష్టంగా పేర్కొనలేదు. దాంతో ఆ కంపెనీ- ఖనిజాన్ని ఎగుమతులకు ఉపయోగించేందుకు మార్గం దొరికింది. అదే సమయంలో ఇతర కంపెనీల దరఖాస్తులను "వీరి వినియోగం captive purpose కాకపోవచ్చు" అనే నెపంతో తిరస్కరించారు. ఈ తేడా వల్లే శ్రీలక్ష్మిపై ద్వంద్వ ప్రమాణాల ఆరోపణ వచ్చింది.
గెజిట్ నోటిఫికేషన్ లోనూ తారుమారు...
మలపనగుడి ప్రాంతానికే మైనింగ్ అనుమతుల ప్రతిపాదన ఉన్నప్పటికీ, శ్రీలక్ష్మి తన అధికారాన్ని ఉపయోగించి సిద్దాపురం ప్రాంతాన్ని కూడా కలిపారని, దీని వల్ల OMCకి అనేకరెట్లు ప్రయోజనం చేకూరిందని సీబీఐ పేర్కొంది. సీబీఐ కథనం ప్రకారం, "ఆమె (శ్రీలక్ష్మీ) ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి, తనకు లబ్ధి చేకూర్చుకోవాలన్న ఉద్దేశంతో" వ్యవహరించారు. ఈ కేసులో శ్రీలక్ష్మితోపాటు OMC మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస్ రెడ్డి, ఆనాటి గనుల డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ నిందితులుగా ఉండగా ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి. 2011 డిసెంబర్ 2 నుంచి నాలుగు నెలలపాటు ఆమె చర్లపల్లి జైలులో ఉన్నారు.
హైకోర్టు ఊరట – సుప్రీం తిరస్కరణ...
2022లో హైకోర్టు శ్రీలక్ష్మి కేసును కొట్టివేసింది. ఆమెపై ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసును 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది.

గాలి జనార్దన్ రెడ్డి

ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితులకు 2025 మే 6న హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితులైన గాలి జనార్దనరెడ్డితో పాటు బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్‌ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.
రాజకీయ అనుబంధంతోనే ఇలా చేశారా?
ఎంతో ముక్కుసూటిగా ఉండే శ్రీలక్ష్మి లాంటి అధికారులు ఇలా ఎందుకు రాజకీయ పలుకుబడికి లొంగిపోయి ఉంటారన్నది ప్రశ్న. వ్యక్తిగత లబ్ధి ప్రధాన కారణమై ఉండవచ్చుననేది సార్వత్రిక అభిప్రాయం. 1977 Bachకి చెందిన ఐఎఎస్ అధికారి మహమ్మద్ షఫీకుజ్జామ ( Md Sahffiaquzzaman) మాటల్లో "రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల మధ్య నెక్సస్ (అనుబంధం)కి ప్రధాన కారణం– బదిలీలు, నియామకాలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండటమే. ఇంతకుముందు బదిలీలు, పోస్టింగులు ఒక కమిటీ ద్వారా జరిగేలా ప్రతిపాదన వచ్చినా, అది ఎప్పటికీ అమలులోకి రాలేదు" అని అన్నారు. పదే పదే బదిలీలకు భయపడే చాలామంది ఐఎఎస్ లు ఇతర బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకుల చేతుల్లో బందీలుగా మారుతుంటారు. దానికి బదులు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే ఈతిబాధలు తప్పుతాయనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది.
"ఈ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా బహుమతి–శిక్షల మయంగా మారింది. ఒక అధికారి రాజకీయ నాయకుల మాట వినకపోతే బదిలీ వేటు పడుతోంది. వారి మాట వింటే ఆ శిక్ష తప్పుతుంది. విధేయులకు మంచి పోస్టింగులు వస్తాయి. విననివాళ్లకు శిక్షలు పడుతుంటాయి.(Transfers and postings have become an exercise in reward and punishment. If an officer does not listen, he is given punishment posting. And who submit are rewarded)" అన్నారు మహమ్మద్ షఫీకుజ్జామ.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి మరో కొత్త విషయాన్ని కూడా ప్రస్తావించారు."రెండు వర్గాల మధ్య కుమ్మక్కు- నిర్ణయాధికారం నుంచి మొదలు అవుతుంది. నిధులను నిర్ణయించే అధికారం, లబ్దిదారులను ఎంపిక చేసే అధికారం, వగైరా, వగైరా... అయితే ఈ మధ్య రాజకీయ నాయకులు ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత తీసుకున్నారు. రాజకీయ పార్టీల అజమాయిషీ పెరిగింది. పారదర్శకత తగ్గింది. ఇద్దరి మధ్య కుమ్మక్కు ఇదివరకు మీడియా బయటపెట్టేది. ఇప్పుడు ఈ పని చేయడం లేదు. అందుకే ఈ రెండు వర్గాల మధ్య ఉండే ఒప్పందాలను, వ్యవహారాలను వెలికి తీస్తే ఈ అనుబంధం ఏమిటో బయటికి వస్తుంది" అన్నారు నరసింహారెడ్డి.
నిధుల పంపిణీలో కూడా ఈ రెండు వర్గాల మధ్య వాటాలు ఉంటున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఒకరి తప్పులు మరొకరు బయట పెట్టుకోకుండా చీకటి ఒప్పందాలు జరుగుతుంటాయన్నది ప్రభుత్వంలోని అధికారులతో డీల్ చేసే ఓ వ్యాపారవేత్త అభిప్రాయపడ్డారు. "అవినీతి రాజకీయనాయకులకు, అవే గుణాలు కల అధికారులు- గారడి వాడికి డోలు వాయించేవాడిలా- ఒకరికొకరు కుదురుకుంటారు" అని గొర్రెపాటి రమేష్ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పుడేం జరుగుతుంది?
2023లో వయోపరిమితితో పదవీ విరమణ పొందిన శ్రీలక్ష్మి, రిటైర్మెంట్ ప్రయోజనాలను పొందే స్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుతో ఆమెపై మళ్లీ విచారణకు ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఆమె నిర్దోషి అని తేలితే, ఉద్యోగ గౌరవం తిరిగి లభించవచ్చు. లేకపోతే మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.
విధేయతా? వ్యక్తిగత బాధ్యతా?
ఒక ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో నిబద్ధత, పనితీరులో విశ్వాసాన్ని చూరగొన్న శ్రీలక్ష్మి, రాజకీయ ఒత్తిళ్లకి లోనై వ్యవస్థను వక్రీకరించారా? లేక పైనుంచి వచ్చిన ఆదేశాలకు కట్టుబడి తప్పులు చేశారా? అన్నది విచారణలోగాని తేలదు. “చట్టపరమైన ఆదేశాలే కాబట్టి అమలు చేశాను” అని శ్రీలక్ష్మి వాదించగా, “వివేకం వినియోగించి నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్నారు, కాబట్టి బాధ్యత తప్పదు” అంటోంది సీబీఐ.
ఏదిఏమైనా, ఐఎఎస్ లో టాపర్ గా నిలిచి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఓ అధికారి అంతే వేగంగా నేలను తాకడం- ఇప్పటి బ్యూరోక్రాట్లు నేర్చుకోవాల్సిన ఓ చక్కటి జీవితానుభవం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ అనుసరణకంటే చట్టబద్ధత, పారదర్శకత, సమతుల్యత ఉంటే — ప్రభుత్వ సేవలో గౌరవం నిలబడుతుంది. లేకుంటే పతనమవుతుంది అన్నారు పేరు రాయడనికి ఇష్టపడని ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి.
Tags:    

Similar News