పంచాంగ శ్రవణం అంటే ఏంటి.. అది వింటే లాభాలేంటి..

ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం అంటే ఏంటి? దీనిని ఉగాది రోజునే ఎందుకు చదువుతారు? దీని వల్ల లాభాలేంటి? ఇది దేని గురించి వివరిస్తుంది?

Update: 2024-04-09 00:40 GMT
Source: Twitter

ప్రతి ఏడాది ఉగాది పండగ రోజున రాష్ట్ర సీఎంలు కూడా పంచాంగ శ్రవణం తప్పకుండా నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని రంగాలు ఆ ఏడాది ఎలా సాగనున్నాయి. ఏయే రంగాలు లాభాలు పొందుతాయి వంటి విషయాలను పంచాంగం ద్వారా చెప్తారు. ఉగాది పండగ వచ్చిందంటే పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమంగా నిలుస్తుంది. ఇందులో అనేక విషయాలను వెల్లడిస్తారు పండితులు. రేపు అంటే ఏప్రిల్ 9న శ్రీక్రోధి నామ సంవత్సరంగా దేశమంతా ఉగాది పండగను జరుపుకోనుంది. ఈ సందర్భంగా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అయితే అసలు పంచాంగ శ్రవణాన్ని ఎందుకు చేస్తారు? దాని వల్ల లాభాలు ఏంటో చాలా మందికి తెలియదు. మరి అవేంటో తెలుసుకుందామా..


పంచాంగ శ్రవణం అంటే


హిందూ పంచాంగం ప్రకారం పండితులు.. ప్రాథమికంగా పండగలు, శుభ ముహూర్తాలకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని వివరిస్తారు. నక్షత్రాలు, తిథులను కలిపి యోగాల ప్రకారం వాటిని వివరిస్తారు. పంచాంగం అంటే ఐదు అంశాలు ప్రధానంగా కలిగినది అని అర్థం. అవి రాశి, నక్షత్రం, తిథి, యోగం, కరణం. ఈ గణాలను జాతకాలతో పోలిస్తే చాలా మంది ఆసక్తిగా వింటారు. ఈ పంచాంగాలు దృక్, వాక్ అనే రెండు రకాలు. వీటిలో దృక్ పంచాంగం ఖగోళ వాస్తవ స్థితిని నిర్ణయించేటప్పుడు, వాక్ పంచాంగాన్ని గ్రహాల స్థానాలను నిర్ణయించేటప్పుడు వినియోగిస్తారు. ఈ పంచాంగాలను రాశి, నక్షత్రం, తిథి, యోగం, కరణం అనే ఐదు గణాలను అంచనా వేస్తూ సిద్ధం చేస్తారు. ఈ పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని రానున్న ఏడాది కాలం ఎలా ఉండనుంది. శుభాలు, అశుభాలు వంటి వాటిని అంచనా వేసి చెప్పడమే పంచాంగ శ్రవణం.


పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి


మన జీవితంలో మరుక్షణం ఏం జరుగుతుందో అది మన చేతుల్లో ఉండదు. దానిని మనం శాసించలేం కూడా. జరిగిన దాన్ని మార్చలేం.. జరగబోయే దాన్ని నిశ్చయించలేం.. మన చేతుల్లో ఉన్నదంతా ఈ క్షణం మాత్రమే. మన జీవితాలపై ఉండే సమయ ప్రభావాన్ని ఎవరూ తప్పించలేరు. మనం మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురొస్తాయి. ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన మార్గంలో పయనించడం ద్వారా మనం చేసే చర్యలను మనం అదుపు చేయగలం. తద్వారా మనకు ఎదురయ్యే ప్రతిఫలాలను మనం కాస్తోకూస్తో నియంత్రించగలుగుతాం. అందులో భాగంగా మన కర్మ ఫలితాలను శాంతింపజేయడానికి ఆచార ఆరాధన, విధులు, బాధ్యతల పంపిణీ వంటివి ఉంటాయి. కాలాన్ని, కర్మ ఫలాలను ఇచ్చే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పంచాంగ శ్రవణం తోడ్పడుతుంది.


జాతకంలో మన కర్మల గురించి అంతా ఉంటుంది. పూజ మన కర్మయోగం, కర్మ ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉగాది పండగ రోజున చేసుకునే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని పండితులు చెప్తారు. ఆ పచ్చడిలో ఉన్న షడ్రుచుల మాదిరిగానే మన జీవితంలో కూడా అన్ని రకాల కర్మ ఫలితాలు ఉంటాయి. ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకోగానే తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు అన్ని రుచులు ఒకేసారి తెలుస్తాయి. వీటిలో మనకు ఏది ముందు తెలుస్తుందో ప్రస్తుతం మనం జీవితంలో ఆ భావనను కలిగి ఉన్నామని పండితులు అంటుంటారు. ఉగాడి పచ్చడి మనకు జీవిత పాఠాన్ని నేర్పుతుందని చెప్తారు.


ఉగాది రోజునే ఎందుకు పంచాంగ శ్రవణం


ఉగాది అనే పదం ఉగ్, ఆది అనే రెండు పదాల కలయిక. ఉగ్ అంటే నక్షత్రం, ఆది అంటే ప్రారంభం. ఉగాది అంటే నక్షత్ర ప్రారంభం మరోమాటలో చెప్పాలంటే నూతన సంవత్సర ఆరంభం అని. మన భారత పంచాంగం ఉగాది రోజున ప్రారంభమై వచ్చే ఏడాది ఉగాది ముందు రోజున ముగుస్తుంది. అంటే భారతదేశ సంస్కృతి ప్రకారం.. మనకు ఏడాది ఉగాది నుంచి మొదలవుతుంది. ఈ ఏడాది కాలం క్యాలెండరే పంచాంగం. ఐదు గణాలను దృష్టిలో పెట్టుకుని పంచాంగాన్ని రాస్తారు. ఏడాది తొలి రోజు కాబట్టే ఆ రోజునే పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమం చేస్తారు. ఉగాది రోజున పల్లెటూర్లలో రైతులు కూడా తమ గ్రామ ఆలయంలోని పురోహితుడిని పిలిపించి పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వ్యవసాయం కోసం ఏ కార్తెలో వర్షం పడుతుందో, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, వంటి అనేక అంశాలను పంచాంగం చదివి పండితులు వివరిస్తారు. ఈ పంచాంగ శ్రవణాన్ని దక్షిణ ముఖంగా కూర్చుని చేస్తారు.


పంచాంగ శ్రవణం వల్ల ఎన్ని లాభాలో


పంచాంగ శ్రవణం వల్ల అనేక లాభాలు ఉంటాయని పండితులు చెప్తారు. పంచాంగ శ్రవణం వినడం ద్వారా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకం ప్రకారం.. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగ చేస్తారు. ఉగాది రోజున దేవతలతో పాటు పంచాంగాన్ని కూడా పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.



Tags:    

Similar News