తాళ్లతో తీసే దానికి.. తాత్సారం దేనికో?

ప్రకాశం బ్యారేజీ బోట్లను వెలికి తీయడానికి గ్యాస్‌ బెలూన్‌లు, కట్టర్లు పోయి చివరికి తాళ్లే దిక్కయ్యాయి. ఆ పనే ముందెందుకు చేయలేదు? రహస్యమేంటి?

Update: 2024-09-14 08:30 GMT

టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో నీటిలో నుంచి బోట్లను తొలగించడం పెద్ద సమస్యమే కాదు. ఒక పూట లేదా ఒక రోజు, లేదా మాగ్జిమమ్‌ రెండు రోజుల్లో బోట్లను బయటకు తీసేందుకు అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఇటీవల చోటు చేసుకున్న వరద ప్రవాహంలో ప్రకాశం బ్యాకేజీకి కొట్టొకొచ్చిన బోట్లను తొలగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోజుల తరబడి హైరాన పడుతున్నారు. చివరకు పాత పద్దతికే వచ్చారు.

ఆగస్టు నెలాఖరు శనివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వరద పోటు పెరిగింది. ఆదివారం దాదాపు 11.43లక్షల క్యూసెక్కుల వరద నీరు పెరిగింది. అదే రోజు బోట్లు బ్యారేజీకి కొట్టుకొని వచ్చాయి. అయితే ఇవి కొట్టుకొని రాలేదని, దీని వెనుక కుట్ర కోణం ఉందని, కావాలనే వదిలేశారని, వీటి వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉందని, ఆ మేరకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేపట్టారు. దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, టీడీపీ నేతలు కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేతలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వంలోనే ఈ పడవలకు అనుమతులు ఇచ్చారని, వాటి యజమానులు కూడా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్‌కు సన్నిహితులని, కావాలనే వైఎస్‌ఆర్‌సీపీ మీద విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ రంగు పులుముకుంది.
ఈ వ్యవహారం పక్కన బెట్టితే నీళ్లల్లో కొట్టుకొచ్చిన బోట్లు బయటకు తీయడానికి ఇన్ని రోజులు ఎందుకు డుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి చూపించడంతో పాటు బయటకు తీసేందుకు కావాలనే జాప్యం చేస్తున్నారనే టాక్‌ కూడా ప్రస్తుతం చర్చనీయంగా మారింది. ఎన్ని రోజులు ఆలస్యం జరిగితే అన్ని రోజులు బోట్లు ప్రస్తావన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాన్స్‌ ఉంటుందని, ఈ నెపంతో వైఎస్‌ఆర్‌సీపీని ఆ పార్టీ నేతలను విమర్శిస్తూ వరదల్లో చోటు చేసుకున్న వైఫల్యాల నుంచి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారనే మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. దాదాపు 50లక్షలకుపైగా విలువ చేసే బోట్లను ఏ యజమాని కూడా ఊరికే వదులు కోరనే వాదన కూడా ఉంది. ప్రభుత్వానికి డ్యామేజీ చేయాలనే ఉద్దేశంతో కావాలనే బోట్లను వదిలేసినా.. విపత్తుల సమయంలో అలా చేస్తే ప్రభుత్వానికి కంటే ఆ పార్టీకే ఎక్కువ డ్యామేజే ఎక్కువ అవుతుందనే మరో వాదన కూడా బోట్ల యజమానుల్లో వినిపిస్తోంది.
ఈ రాజకీయ వ్యవహారం.. కుట్ర కోణాలు ఉన్నాయనే అంశాలను పక్కన పెడితే.. వరదల సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇరిగేషన్‌ అధికారులు, నిఘా వ్యవస్థ వీటిపైన పర్యవేక్షణ చేపట్టాలి. ఎప్పటికప్పుడు వాటి వివరాలను సేకరిస్తుండాలి. వరదల సమయంలో ఈ పర్యవేక్షణ అనేది ఇంకా ముమ్మరంగా చేట్టాలి. వరద నీటి ప్రవాహానికి బోట్లు ఏమైనా కొట్టుకొని వస్తున్నాయా? వరద ప్రవాహానికి ఇతర అడ్డంకులేమైనా తలెత్తుతున్నాయా? అలాంటి అవకాశాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒక వేళ ఉంటే వాటిని ఎలా నివారించాలి? వంటి పలు అంశాలపైన ఇరిగేషన్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఆ విషయాలను ఎప్పటికప్పుడు మోనటరింగ్‌ చేపట్టాలి. కానీ ఇటీవల చోటు చేసుకున్న వరదల సమయంలో ఇరిగేషన్‌ అధికారులు, నిఘా విభాగం పర్యవేక్షణలు చేపట్టడంలో వైఫల్యం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బోటు వెలికి తీతలో హై డ్రామా?
ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల వెలకి తీతలో పెద్ద హైడ్రామో చోటు చేసుకుంది. ఈ సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో పూర్తిగా మునిగి పోయిన టూరిస్టు లాంచ్‌ వెలికి తీత అంశం తెరపైకి వచ్చింది. దీంతో నీటిలో మూడు తాళ్ల లోతులు మునిగి పోయిన పడవను తీయడం సులభమా? నీటిపై తేలియాడే పడవను తరలించడం ఈజీనా అనేది తాజాగా చర్చగా మారింది.
2019లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి పాపికొండలు వరకు పర్యాటకలను తీసుకెళ్తున్న భారీ లాంచీ గోదావరి నీటి ఉదృతిలో పూర్తిగా మునిగి పోయింది. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. మూడు తాడి చెట్ల లోతులు మునిగి పోయిన లాంచీని వెలికి తీయడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద సవాలుగానే మారింది. అదే సమయంలో కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ అధినేత ధర్మాడి సత్యం నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు. తనకున్న తెలివితేటలను ఉపయోగించి సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగంతో మునిగిన లాంచీని గట్టుకు చేర్చారు. దీంతో గత ప్రభుత్వం ఆయనకు వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డుతో సత్కరించింది. సీన్‌ కట్‌ చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ వద్ద కొట్టుకొచ్చిన పడవలను ఒడ్డుకు చేర్చడానికి రోజుల తరబడి హైరానా పడుతోంది. నీటిపై ఉన్న ఆ పడవలను వరద ఉదృత్తి తగ్గిన నేపథ్యంలో వేరే పడవలకు లంగరు వేసి సవ్య దిశలో లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చొచ్చున్నది తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఒక పడవ యజమాని చెప్పారు. అన్ని మార్గాల్లోకి ఇదే అత్యుత్తమ మార్గమని చెప్పుకొచ్చారు.
రోజుల తరబడి విఫలయత్నం
పడవలను గట్టుకు చేర్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చెబుతున్న అంశాలు కాలయాపన చేసేందుకేనా అనే అనుమానాలు రేగుతున్నాయి. తొలుత భారీ క్రేన్‌ సాయంతో పడవలను గట్టుకు చేర్చేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించ లేదని చెబుతున్నారు. ఆపై స్కూబా డ్రైవర్స్‌(ఎక్కువ సమయం నీటిలో మునిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించే నైపుణ్యం కలిగిన వారు)ను తీసుకొచ్చి పడవలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం కూడా ఫలించ లేదని చెబుతున్నారు. చివరకు కట్టర్‌ల సాయంతో పడవలను ముక్కలు చేసి ఒడ్డుకు చేర్చడం సులభమని భావించారు. ఆ ప్రయత్నాలను కూడా విరమించుకొని, వేరే పెద్ద పడవలను తెచ్చి వాటికి లంగర్‌ వేసి ప్రమాదానికి కారణమైన పడవలను తరలించే ప్రక్రియ మొదలైంది. శనివారం నాటికి కనక దుర్గమ్మ గుడి వైపు ఒక పడవను తరలించగలిగారు. తక్కిన రెండు బోట్లను కూడా ఇదే పద్దతిలో తేలిగ్గానే తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజాగా పడవలను తరలించిన తీరును గమనించినా.. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాల్లో చెల్లా చెదురైన భారీ బరువు కలిగిన రైలు భోగీలను తొలగించి 24 గంటల్లోనే రైళ్ల రాకపోకలకు అడ్డంకులను తొలగించిన తీరును గమనించినా, ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు వ్యవహారంలో నాన్చుడు ధోరణి వెనుక రాజకీయ రాద్దాంతమే తప్ప వేరొకటి లేదన్నది సుస్పష్టమని పలువురు బోట్ల యజమానులు, నిర్వాహకులు చెబుతున్నారు. తాళ్లతో పోయే దానికి ఇంత రాద్దాంతం ఎందుకని పెదవి విరుస్తున్నారు.
Tags:    

Similar News