నేటి తిరుమల వేడుక ‘ఆణివార ఆస్థానం’
శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ వేడుక వెనుక చరిత్ర ఏమిటి?;
Byline : The Federal
Update: 2025-07-16 05:53 GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు (బుధవారం ఉదయం) 16వ తేదీ ఆణివార ఆస్థానం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తమిళనాడులోని శ్రీరంగం రంగనాథ ఆలయం నుంచి పండితులు పట్టువస్త్రాలు తీసుకుని వచ్చి సమర్పించారు.
తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహణలో ఈస్టిండియా కంపెనీ ఏమి చేసింది? వారి ద్వారా టీటీడ పాలన సాగించిన మహంతులు, ఇప్పుడు పాలక మండలి మధ్య సారూప్యం ఏమిటి? ఆణివార ఆస్థానం, బడ్జెట్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ చరిత్ర వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
తిరుమల అనగానే గుర్తుకు వచ్చేది శ్రీవారి మూలవిరాట్టు. నిత్యకల్యాణం, నిత్యకల్యాణం పచ్చతోరణంగా కనిపించే తిరుమలలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించే సేవలకు కొదవ లేదు. ఏడాది పొడవునా ఈ క్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.
తిరుమల శ్రీవారి ఆలయం బంగారు వాకిలికి సమీపంలో నిర్వహించే ఆణివార ఆస్థానానికి ప్రత్యేకత ఉంది. అసలు తిరుమలలో మాత్రమే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు? దీని వెనుక కథేమిటి?
ఒకమాటలో చెప్పాలంటే..
"తిరుమలలో సాంప్రదాయ వార్షిక బడ్జెట్ పండుగ" అనడంలో సందేహం లేదు.
నేపథ్యం ఇదీ..
తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఇది వందల సంవత్సరాల నుంచి పాటిస్తున్న కార్యక్రమం. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. తమిళుల కాలమాన ప్రకారం ఆణిమాసం చివరి రోజు నిర్వహించే కొలువు కావడం వల్ల ఆణివార ఆస్థానంగా దీనికి పేరు ఉంది. బ్రిటీషర్ల పాలనలో కూడా ఈ ఆచారాలు పాటించారు. వారి కాలంలోనే మహంతులు వచ్చారు. టీటీడీకి పాలక మండలి వచ్చింది. అయినా ఆ నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ కార్యక్రమం ఎలా ప్రారంభం అవుతుందంటే..
తమిళనాడులోని శ్రీరంగం నుంచి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు తీాసుకువచ్చిన అర్చకులతో టీటీడీ ఈఓ బీఆర్. నాయుడు, ఈఓ జె. శ్యామలరావు
బంగారు వాకిలి వద్ద ఉత్సవం
ఇక్కడ ప్రారంభమయ్య ఉత్సవంతో ఆణివార ఆస్థానం ప్రారంభం అవుతుంది.
శ్రీవారి ఆలయం బంగారువాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలోకి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై తీసుకుని వస్తారు. ఈ ప్రదేశంలోని గరుత్మంతునికి అభిముఖంగా కొలువు దీరుతారు. మరోపీఠంపై దక్షిణం వైపు శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుని విగ్రహాన్ని పండితులు ఆశీనులను చేస్తారు. ఇక్కడ కొలువుదీరిన ఉత్సవమూర్తుల తోపాటు గర్భాలయంలోని శ్రీవారి మూలవిరాట్టుకు ఒకేసారి ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించడంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
శ్రీవారి ఆలయ పెద్దజియ్యంగార్ (ఆలయం, ఉత్సవాలను పర్యవేక్షించే పెద్ద) వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలు ఉంచుకుని తలపై పెట్టకుకుని తీసుకువస్తారు. ఆ వస్త్రాల్లో... నాలుగు శ్రీవారి మూలవిరాట్టకు అలంకరించడం ఆనవాయితీ. మిగిలిన రెండు వస్త్రాల్లో ఒకటి మలయప్ప, మరొకటి ఆయన సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులవారి విగ్రహానికి అలంకరిస్తారు.
ప్రధాన అర్చకుడి పాత్ర
శ్రీవారి ఆలయ నలుగురు ప్రధాన అర్చకుల్లో ఒకరు తలకు శ్రీవారి పాదవస్ర్తంతో "పరివట్టం" (చిన్న పట్టు వస్ర్తం) తలకు కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ తీసుకుంటారు. నిత్యైశ్వరోభవ (నిత్యం ఐశ్వర్యంతో వర్ధిల్లు) స్వామీ అని వేదాలు పఠిస్తూ, ఆశీర్చచనం అందిస్తారు. ఇది ముగియగానే..
శ్రీవారి ఆలయ అర్చకులు పెద్దజియ్యంగార్, చిన్న జియ్యంగార్ కు టీటీడీ ఈఓ "లచ్చన" అనే తాళాల గుత్తిని వరుసగా జియ్యంగార్ కుడిచేతికి తగిలిస్తారు. ఇక్కడ కొలువైన మలయప్ప స్వామివార్లకు హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు పూర్తి చేయడంలో టీటీడీ అధికారులు, అర్చకులు ప్రధానంగా కనిపిస్తారు. ఆ తరువాత జియ్యంగార్ తాళాల గుత్తిని శ్రీవారి మూలవిరాట్టు వద్ద ఉంచిన తరువాత ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఆలయంలోని బంగారువాకిలి వద్ద అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించి, సంతృప్తి చెందిన తరువాత ఆణివార ఆస్థానం ముగుస్తుంది.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామివారు పల్లకీపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.
మహంతుల వ్యవస్థ
తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది. టీటీడీ మహంతుల పాలన నుంచి టీటీడీ పాలక మండలి ఏర్పడినా, ఆణివార ఆస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు.
పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలన తీసుకున్న రోజే ఆణివార ఆస్థానం నాటి నుంచి టీటీడీ ఆదాయం, వ్యయం, నిల్వలు, లెక్కలు వేశారు. అంటే ఆ రోజు నుంచి టీటీడీ లెక్కలు ప్రారంభం అయ్యేవి. అంటే వార్షిక బడ్డెట్ కు సంబంధించి సమీక్షించడం కింద లెక్క. ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది.
టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది కాస్తా వార్షిక బడ్డెట్ గా మారింది. కానీ, వందల ఏళ్ల నాటి సంస్కృతీ, సంప్రదాయాలు మాత్రం ఆచరిస్తూనే, ఆ నాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆష్థానం ద్వారా లెక్కలు నివేదించడం అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఎప్పుడు? ఎలా వచ్చారు?
ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం అధిపతి అభయ్ ఆనంద్ జీ శిష్యుడు హథీరాంజీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడనేది చరిత్ర . శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకున్నారంట. బావాజీ భక్తికి ముగ్గుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హథీరాంజీ బావాజీతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.
మహంతుల పాలన
తిరుమల ఆలయ పాలన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది. దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హధీరాంజీ మఠం మహంతుల పాలనలో సాగింది.
తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా 1843 జూలై 10వ తేదీ మహంత్ సేవాదాస్ మొదటి హమంతుగా శ్రీవారి ఆలయ బాధ్యతలు స్వీకరించారు.
ఆణివార ఆస్థానం రోజే బ్రిటీషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది. తిరుమల ఆలయ లెక్కల అప్పగింత కార్యక్రమం జరిగిన సందర్భం నేపథ్యంలో ఆణివార ఆష్థానం నిర్వహించే ఆచారం నేటికీ కొనసాగుతోంది.
విష్వక్సేనుడు ఎవరు?
తిరుమలలో శ్రీవారి పేరు తరువాత విష్వక్సేనుడు అని వినిపిస్తూ ఉంటుంది. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించింది. కానీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా, చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (హథీరాంజీ బాబా వారసులు. పీఠాథిపతి) తమ పాలనకుయ విష్వక్సేనుడి అధికార ముద్ర (సీలు)గా వాడారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. ఇదిలావుంటే...
పాలక మండలి వచ్చినా...
తిరుమల ఆలయ నిర్వహణ, టీటీడీ వ్యవహారాల్లో పాలకులు మారుతూ వచ్చారు. కాలం తీసుకువచ్చిన మార్పులు అనేక జరిగాయి. స్వాతంత్ర్యం రాకముందే టీటీడీకి పాలక మండలి ఏర్పాటైంది.
ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి వ్యవస్థ తీసుకుని రావడం వల్త మహంతుల వ్యవస్థ ముగిసింది. ప్రభుత్వం నియమించే రాజకీయ ప్రతినిధులు, నిత్య కార్యక్రమాలు, పాలనా వ్యవహారాలు అధికారులకు దక్కింది. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల, టీటీడీ వ్యవహారాలు పర్యవేక్షించిన మహంతులకు ప్రత్యేక గౌరవం ఈనాటికి కొనసాగుతోంది.
తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయ బద్ధంగా హరతీ అందిస్తున్నారు.
వందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.