మాడుగుల నాగఫణి శర్మ ఇరుక్కున్న సెక్స్ స్కాండల్ ఏమిటీ? ఈ పద్మశ్రీ ఏంటీ?

సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు నాగఫణిశర్మ. పద్మశ్రీ అవార్డు ప్రకటించిన మర్నాడు జనవరి 26న విజయవాడలో దర్శనం ఇచ్చారు.;

Update: 2025-01-27 02:24 GMT
ఫోటో సౌజన్యం.. వికీపీడియా
సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు 2025 జనవరి 25న పద్మశ్రీ అవార్డును ప్రకటించడంతో ఇప్పుడాయన తెరపైకి వచ్చారు. దశాబ్దం కిందట అమెరికాలో సెక్స్ కుంభకోణంలో ఇరుకున్న ఆయనకు ఇప్పుడు దేశ అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడమేమిటనే దానిపై వివాదం ముసిరింది. ప్రతిష్టాత్మక అవార్డును ఇచ్చేముందు ఆయన క్యారెక్టర్ ను చూడాల్సిన పని లేదా అని కొందరు, ప్రతిభ ఉన్నప్పుడు అవార్డు ఇస్తే తప్పేమిటని మరికొందరు వాదులాడుకుంటున్నారు. సరిగ్గా ఈ దశలో ఆయన జనవరి 26న విజయవాడలో దర్శనం ఇచ్చారు. అయితే ఆయన మీడియాకు కనిపించకుండా సమావేశమందిరం నుంచి బయటకు రాకుండానే గడిపారు. కొందరితో సెల్ఫీలకు మాత్రం అనుమతి ఇచ్చారు.
ఇంతకీ ఏమిటీ సెక్స్ కుంభకోణం?
2006 జూలై లో మాడుగుల నాగఫణి శర్మ అమెరికా వెళ్లారు. లాస్ ఏంజిల్స్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడాయన ఓ తెలుగు మహిళను లైంగిక వేధింపులకు గురిచేశారన్నది ఆరోపణ. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు అమెరికాలో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు తర్వాత అనేక మంది ఎన్నారై మహిళలు కూడా ముందుకు వచ్చి శర్మపై అనేక ఆరోపణలు చేశారు. శర్మ స్త్రీలోలుడని, స్త్రీలంటే చిన్న చూపని ఇత్యాధి ఫిర్యాదులు కూడా చేశారు.

ఈ ఆరోపణల పూర్తి వివరాలు ఇప్పటికీ స్పష్టంగా వెల్లడికాలేదు గాని పెద్ద చర్చ అయితే జరిగింది. ఆయన పేరు, ప్రతిష్ఠల్ని ఈ ఘటన తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆరోపణల తర్వాత ఆయన వ్యక్తిగత, సాంస్కృతిక జీవితంలో తీవ్ర మార్పులు వచ్చాయి. జన సామాన్యం నుంచి దూరమయ్యారు. సాహిత్య వర్గాల్లోను ఆయనపై అపనమ్మకం ఏర్పడింది. పబ్లిక్ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. ఆ ఘటన తర్వాత సాంఘిక కార్యక్రమాలు, అవధానాలకు రావడం పూర్తిగా మానేశారనే చెప్పాలి. సరిగ్గా అటువంటి దశలో జనవరి 26న విజయవాడలో దర్శనం ఇచ్చారు.
కమలా హారిస్ సాయపడిందా!
ఈ కేసుపైన న్యాయస్థాన విచారణ లేదా అధికారిక తీర్పు పట్ల స్పష్టమైన సమాచారం కూడా అందుబాటులో లేదు. ఆయన అమెరికా నుంచి క్షేమంగా రావడానికి ఆనాటి అటార్నీ, తాజా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సహాయపడినట్టు చెబుతారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. కమలా హారిస్ ఆ సమయంలో కేవలం సంస్థాగత న్యాయ వ్యవస్థలో భాగంగా కాకుండా, సామాజిక-న్యాయ సంబంధ అంశాలకు సంబంధించిన కేసులపై పనిచేసేవారు. ఈ నేపథ్యంలో, ఆమె తన అధికార పరిధిలో వ్యవహరించివుండవచ్చు. కానీ, దీనిపై ప్రామాణికంగా ధృవీకరించదగ్గ సమాచారం లేదు.
అమెరికా నుంచి ఎలా బయటపడ్డారు?
నాగఫణి శర్మ అమెరికాలో ఎదుర్కొన్న లైంగిక ఆరోపణల కేసు తర్వాత ఆయన అక్కడి నుంచి భద్రంగా ఎలా వచ్చారన్నది ఇప్పటికీ మిస్టరీయే. దీనికి సంబంధించి అనేక కథనాలు ఉన్నాయి. అమెరికాలో లైంగిక వేధింపుల కేసుల్ని చాలా కఠినమైనవిగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో నిందితుడి పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకుని, విచారణ ముగిసేవరకు దేశం విడిచిపోవడానికి అనుమతించరు. కానీ, మాడుగుల విషయంలో ఆయన అమెరికా నుండి ఎలా వెళ్లగలిగారు అన్నది ఎక్కడా బయటకు రాలేదు.
కొన్ని వర్గాల కథనం ప్రకారం, శర్మకు అక్కడ స్థిరపడిన ఎన్నారై న్యాయవాదులు సాయం అందించారు. వారు ఆయనకు తగిన చట్టపరమైన రక్షణను కల్పించి, దేశం విడిచిపోవడంలో సహాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసులు కొన్నిసార్లు బాధితునితో పరస్పర అంగీకారం (settlement) ద్వారా ముగిస్తారు. ఈ కేసులో ఇదే జరిగి ఉండవచ్చని అంచనా.
శర్మకు ఉన్న పలుకుబడి, సంస్థల పరిచయాలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించాయి. ఆయన్ను అమెరికా నుంచి కెనడాకు పంపి అక్కడి నుంచి భారత్ కు రప్పించారని, ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చు అయిందన్న గుసగుసలూ లేకపోలేదు. ఏదైతేనేం నాగఫణి శర్మ ఆ కేసు తర్వాత అమెరికా నుండి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు.
తెహల్కాలో వచ్చిన కథనం...
మాడుగుల నాగఫణి శర్మపై 2006లో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తెహల్కా పత్రికలో 2006 అక్టోబర్‌లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అందులో భారతదేశంలో స్వామీజీలు, అవధానులు,మఠాలు, ఆశ్రమాల్లో జరుగుతున్న లైంగిక వివక్షను, కొందరి పోకడలను విమర్శించారు. దానిలో భాగంగా నాగఫణి శర్మ వ్యవహారాన్ని వివరంగా రాశారు.
2006 సెప్టెంబర్ 14న ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నప్పుడు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మూడు రోజులకు అంటే సెప్టెంబర్ 17, 2006న ఆయన మీడియాతో మాట్లాడి, తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు.
అమెరికా నుండి రాగానే ఆయన్ని అరెస్టు చేయకుండా ఢిల్లీ, హైదరాబాద్‌లోని తన అధికార హోదాను, పలుకుబడిని ఉపయోగించాడని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రవచన కర్తలు’ లేదా దేవుళ్లుగా చెలామణి అయ్యే వాళ్ళు తమ హోదాలను దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారి కాదు.
ఇలాంటి వారి ఆశ్రమాల నుంచి అనేకమంది కనిపించకుండా పోయినట్టు ఫిర్యాదులు సైతం వచ్చాయి. పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆశ్రమం, చిత్తూరులోని కల్కి ఆశ్రమం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని బాబాలు, చిల్లర దేవుళ్ల ఆశ్రమాల నుంచి అనేక మంది అదృశ్యం అయినట్టు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయి. దేశంలో ఇటువంటి దేవుళ్ల ప్రభావం చాలా బలంగా ఉంది. దర్యాప్తులు ఎల్లప్పుడూ ప్రాథమిక దశలోనే నిలిచిపోతాయన్నారు హైదరాబాద్ కి చెందిన ఓ మాజీ పోలీసు అధికారి.
ఎవరీ మాడుగుల, ఏమిటాయన చరిత్ర..
‘సహస్రావధాని’గా ప్రసిద్ధి పొందిన మాడుగుల నాగఫణి శర్మ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడవకోలన గ్రామంలో వేద పండితుల, కవుల కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే ఆయన వేద సాహిత్యం, కవిత్వం, సంగీతంపై మక్కువ చూపారు. తన తండ్రి పర్యవేక్షణలో వేద తత్వం, పురాణాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలో నైపుణ్యం సంపాదించారు. ఆయనకు ఉన్న అపారమైన జ్ఞాన పిపాస వల్ల అవధాన కళను నేర్చుకోవడంలో కృషి చేశారు. 14వ ఏటనే ఆయన తన మొదటి అవధానం ప్రదర్శించి, దేశంలో అతి చిన్న వయసులో అవధానం చేసిన వ్యక్తిగా నిలిచారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో సాహిత్య శిరోమణి కోర్సును పూర్తిచేశారు. ఆ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో మాస్టర్స్ (M.A) పూర్తిచేశారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుండి పీహెచ్.డి పొందారు. సంస్కృతం, తెలుగులో 2,116 ప్రుచ్చకులతో 37 రోజుల పాటు అవధానం చేసి, ‘ద్విసహస్రావధాని’గా అరుదైన గౌరవం పొందారు. ఆయన ప్రదర్శనలు రాజకీయనేతలు, పండితులు, సాధారణ ప్రజలను అలరించాయి.
అంతటి పేరు సంపాయించిన నాగఫణి శర్మ అమెరికాలో లైంగిక వేధింపుల ఆరోపణలతో పదేళ్ల పాటు కనిపించకుండా పోయారు. ఆయన స్థాపించిన విద్యాపీఠం దాదాపు మూతపడింది. అవధాన పీఠం కట్టుకునేందుకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఇచ్చిన స్థలాన్ని సైతం తాకట్టు పెట్టినట్టు చెబుతారు.
ఆయనకు హైదరాబాద్ బర్కత్ పురాలో సొంత ఇల్లు ఉండేది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ ఇంటిని విడిచి ఎక్కడో ఉన్నారు. తన పేరు ప్రతిష్టలు బాగున్న సమయంలో రంగారెడ్డి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాంతంలో కోనుగోలు చేసిన భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు చెబుతారు. ఆయనకు భార్య రేణుక, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.
లైంగిక ఆరోపణల నేపథ్యంలో సుమారు పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాడుగుల నాగఫణి శర్మ 2025 పద్మశ్రీ అవార్డుతో వెలుగులోకి వచ్చారు. మళ్లీ పబ్లిక్ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు.
Tags:    

Similar News