కైకలూరు కథేంటి?

కైకలూరు కిరీటం కోసం హేమా హేమీలు పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరిని ఆదరిస్తారు. ఒక మాజీ మంత్రి.. మరోకరు రెండో సారి బరిలో నిలచిన వారు.

Update: 2024-04-05 08:41 GMT
kamineni srinivas, dulam nageswararao

జి విజయ కుమార్ 

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గం భిన్న దృక్పథాలకు నిలయం. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పునిస్తుంటారు. అన్ని కులాల వారిని ఓటర్లు ఇక్కడ ఆదరించారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు మొదటి సారి గెలుపొందారు. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ ఓటమి పాలయ్యారు. ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన బి వెంకటేశ్వరరావుకు 16,700 ఓట్లు వచ్చాయి. 2014లో బిజెపి కూటమి తరఫున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్‌ విజయం సాధించి చంద్రబాబు తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చివరిలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కామినేని గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈయన గతంలో ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం బిజెపీ కూటమి తరఫున బిజెపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్‌ పోటీ చేస్తుండగా వైఎస్‌ఆర్‌సీపీ తరఫున దూలం నాగేశ్వరరావు రెండో సారి పోటీలోకి దిగారు.
కమ్మ.. కాపు
కామినేని శ్రీనివాస్‌ కమ్మ వర్గం నేత కాగా.. దూలం నాగేశ్వరరావు కాపు వర్గం నేత. నియోజక వర్గంలో కాపుల ఓట్లు సుమారు 34500 వరకు ఉన్నాయి. ఈ ఓట్లల్లో కనీసం 80 శాతం దూలం నాగేశ్వరరావు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు సుమారు 10వేల వరకు ఉన్నాయి. వీరి ఓట్లు ఎక్కువుగా కామినేని శ్రీనివాస్‌కే వచ్చే అవకాశం ఉన్నట్లు కమ్మ సామాజిక వర్గంలోని కొందరు ముఖ్య నాయకులు చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్‌ 2014లో మంత్రిగా పని చేయడం వల్ల పాత పరిచయాలు.. ప్రజలను కలవడం.. జనసేన సపోర్టు ఉండటం, స్థానికుడు కావడం కలిసొచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు.
ఐదేళ్లల్లో ముఖం చూడని కామినేని
2014 ఎన్నికల తర్వాత కామినేని ఒక్క సారి కూడా నియోజక వర్గంలో కనిపించ లేదని స్థానిక ఓటర్లంటున్నారు. ఇప్పుడు బిజెపీ కూటమి అభ్యర్థిగా సీటు దక్కడంతో తిరిగి ప్రజల వద్దకు వచ్చారని, ఐదేళ్లుగా ప్రజల ముఖం కూడా చూడని కామినేనిని ఎలా ఆదరించాలనే ఆలోచనలు కూడా చాలా మంది నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కామినేని హైదరబాబులోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు కాగా వారిలో ఇద్దరు ఫారిన్‌లోను.. ఒకరు హైదరాబాద్‌లోను వైద్యుడుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థితిమండు కూడా. మీరు నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ మధ్యే ఉండాలని.. నా సొంతూరైన వరహాపట్నం వదిలి పోనని ఓటర్ల వద్ద నమ్మబలుకుతున్నారు.
ప్రజల మ«««ధ్యనే దూలం
దూలం నాగేశ్వరరావు గడిచిన ఐదేళ్లల్లో ప్రజల మ«ధ్యే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. అడుగులు వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నాగేశ్వరరావుకు బలమైన కాపు వర్గం ఉందని.. పవన్‌ కల్యాణ్‌ మాటలు నమ్మే స్థితిలో వారు లేరని.. నియోజక వర్గం ప్రజలు వ్యాఖ్యానించడం విశేషం. అయితే గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన బి వెంకటేశ్వరరావుకు సుమారు 17,500 ఓట్లు రావడం విశేషం. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారని అక్కడి ఓటర్లను కదిలిస్తే.. అప్పుడు జనసేన పార్టీ నుంచే అభ్యర్థి పోటీ చేశారని, అందువల్లే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్‌ బిజెపి తరఫున పోటీ చేస్తున్నారని, జనసేన నుంచి ప్రత్యేకంగా అభ్యర్థి లేనందున దూలం నాగేశ్వరరావును కాపు సామాజిక వర్గం తప్పకుండా ఓన్‌ చేసుకుంటుందనే అభిప్రాయంలో నియోజక వర్గ ప్రజలున్నారు. నాగేశ్వరరావు కూడా స్థానికుడు కావడం, గత ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల ఈ సారి ఓటర్లు చాన్స్‌ ఇవ్వక పోతారా అన్న ధీమాలో ఉన్నారు.
ఎస్సీ ఓటర్లే ఎక్కువ
ఈ నియోజక వర్గంలో మరో ప్రత్యేకతేంటంటే.. మొత్తం ఓటర్లలో సుమారు నాలుగో వంతు ఓటర్లు ఎస్సీ.. ఎస్టీలే ఉన్నారు. వీరిలో సామాజి వర్గాల వారీగా పరిశీలిస్తే.. మాల సామాజిక వర్గం నుంచి అత్యధికంగా 39,300 మంది ఓటర్లున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి 5,469 మంది ఓటర్లున్నారు. ఇక ఎస్టీలు అంటే ఎరుకల, యానాది సామాజిక వర్గాల నుంచి సుమారు 800 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మాల సామాజిక వర్గం ఓటర్లు డిసైడెడ్‌ ఫ్యాక్టర్‌గా ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గౌడ్స్‌ సామాజిక వర్గం వారు కూడా సుమారు 24,900 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం కూడా ఎక్కువుగానే ఉన్నారు. వీరు 22,300 మంది ఓటర్లున్నారు. ఇక కొల్లేరు ప్రాంతంలో వడ్డీలు సామాజి వర్గం కూడా ప్రత్యేకమైంది. వీరి ఓట్లు సుమారు 18,400 వరకు ఉన్నాయి. ఇక మిగిలిన సామాజిక వర్గాల వారు 5వేల నుంచి 7వేల లోపు ఓటర్లు ఉంటే ఆ సామాజిక వర్గాలు నాయకుల దృష్టిలో ఉంటున్నారు.
వ్యక్తులను బట్టి ఓటర్ల తీర్పు
సామాజిక వర్గాల కంటే కూడా నాయకులను బట్టి ఓటర్లు తీర్పునివ్వడం ఇక్కడి ప్రత్యేకత. కనుమూరి బాపిరాజు వంటి సీనియర్‌ నాయకుడిని నాలుగు సార్లు వరుసగా గెలిపించిన ఘనత కూడా ఈ నియోజక వారికి దక్కుతుంది. ఇక్కడ రాజులు 6,200 ఓట్లకు మించి లేదు. అయినా వారి ప్రభావం ఓటర్లపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడి వారు కులాల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. 2024 ఎన్నికల్లో ఏ వ్యక్తిని గౌరవించి ఆదరిస్తారో అనేది మే 13న తేలిపోతుంది.
Tags:    

Similar News