ఎన్నికల్లో పోటీ చేసిన సమయాల్లో ఆయన సన్నిహితులు, సమకాలికులు ఎంతో మంది ఆర్థికంగా ఆదుకున్నారు. ఒక దశలో తన వద్ద డబ్బులు లేవని, బాగా ఇబ్బంది పడుతున్నానని ప్రముఖ క్రిష్టియన్ యాక్టివిస్ట్ కెఎ పాల్ వద్ద రూ. 25లక్షలు వైఎస్సార్ తీసుకున్నట్లు పాల్ ఆరోపించారు. అది కూడా వైఎస్సార్‌కు డబ్బులు ఇచ్చిన చాలా ఏళ్ల తరువాత చెప్పారు. రాజకీయంగా వైఎస్సార్‌ను దెబ్బతీసేందుకు ఈ విధంగా చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఎన్నికల అఫిడవిట్లలోనూ తన ఆస్తులు కోట్లలోనే వైఎస్సార్ చూపించారు. అయితే చాలా కంపెనీల్లో తన వాటాలు వేరే వారి పేర్లపై ఉన్నట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వైఎస్ జగన్ చదువు పూర్తి చేసుకుని వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. వ్యాపారంలో మెళుకువలు తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్ జగన్‌కు కొందరిని అటాచ్ చేసి వ్యాపారంలో బాగా పెరిగేలా చేశారు. ఆ తరువాత జగన్ రాజకీయాల్లోకి రావాలని భావించారు. గొప్ప వ్యాపార వేత్తగా జగన్‌ను చూడాలనుకున్న వైఎస్‌ఆర్ కలలు కాస్త దెబ్బతిన్నాయి. కొడుకు అడుగుతున్నాడు కాబట్టి కాదనలేక కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయించి గెలిపించారు. అప్పటికే తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని కొడుకు చాలా వరకు డబ్బు సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను అసెంబ్లీలో సైతం వైఎస్‌ఆర్ తిప్పికొట్టారు. కావాలంటే తన కొడుకుపై విచారణ జరిపించుకోవచ్చని ఛాలెంజ్ కూడా విసిరారు.
వైఎస్సార్ మరణంతో కుటుంబం, రాష్ట్రం ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప తండ్రిని కోల్పోయింది. అప్పటికే రాజకీయాల్లో ఉన్న వైఎస్ జగన్ కాంగ్రెస్ పెద్దలతో పోరాడలేక సొంత పార్టీ పెట్టారు. తండ్రి పోటీ చేసిన పులివెందుల నుంచి తాను పోటీ చేసి విజయం సాధించి తండ్రి బాటలోనే సీఎం కాగలిగారు. అప్పటికే ఆయనకు వేల కోట్లలో ఆస్తులు ఉన్నాయి. సాక్షి దిన పత్రిక పారంభమైంది. సాక్షి టీవీ కూడా ప్రారంభమైంది. సాక్షి గ్రూప్ పెట్టుబడులు వేల కోట్లలో ఉండటం గమనార్హం. ఇవే కాకుండా చాలా పవర్ ప్రాజెక్టులు, సిమెంట్, ఇతర కంపెనీలు ఉన్నాయి.
పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారనే విమర్శలు వచ్చాయి. వివిధ సంస్థల్లో వాటాలు చూపినా, ఆ సంస్థలకున్న వాస్తవ విలువలను అందులో పేర్కొనలేదనేది ఒక అంశం. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇల్లు, బెంగళూరులో అతిపెద్ద వాణిజ్య భవనం ఉన్నా వాటి ఊసెత్తలేదు. సొంతగా కుటుంబానికి వాహనం లేదని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తులు రూ. 757.65 కోట్లుగా చూపించారు. వాస్తవ విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని అంచనా.
వైఎస్ జగన్ తన అఫిడవిట్‌లో సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్‌ను తమ ఆస్తులుగా పేర్కొన లేదు. కానీ వాస్తవానికి ఈ రెండు సంస్థల్లో మెజారిటీ వాటా ఆయనదే. సాక్షి దినపత్రిక ప్రచురించే జగతి పబ్లికేషన్స్‌లో 69.05 శాతం వాటా కార్మెల్ ఏషియా హోల్డింగ్ సంస్థకు ఉంది. జగతి పబ్లికేషన్ ప్రారంభ పెట్టుబడి రూ. 73.56 కోట్లు. వాస్తవానికి కార్మెల్‌లో గన్ పెట్టుబడి రూ. 8 లక్షలు. మిగతాదంతా వైఎస్ అధికారిలో ఉన్నపుడు కొందరికి చేసిన మేళ్లకు ప్రతిఫలమేననే వాదన ఉంది.
బెంగళూరులోని జగన్ ఇంటి చిరునామాతో కార్మెల్ సంస్థను 2005 నవంబరు 13న ప్రారంభించారు. తాను రూ. 8 లక్షలు, తనకు సంబంధించిన సండూర్ పవర్ నుంచి రూ. 12 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే సండూర్ పవర్ నుంచి వచ్చిన రూ. 12 కోట్లు వ్యాపారం చేసి సంపాదించారా? లేదా అనేది సందిగ్దమే. మారిషస్‌కు చెందిన ప్లూరీ ఎమర్జింగ్, 2ఐ కేపిటల్ నుంచి వచ్చిన రూ. 124.6 కోట్ల నిధుల నుంచి కార్మెల్‌లోకి మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. కార్మెల్ ఏషియా సంస్థలో ఒక్కోషేరు ముఖ విలువ రూ. 10 రూపాయలు. కానీ తండ్రి వైఎస్సార్ నుంచి సాయం పొందిన వివిధ కంపెనీలు రూ. 252 రూపాయల ప్రీమియం చెల్లించి మొత్తం రూ. 82.14 కోట్లు ఇచ్చాయి. అక్కడి నుంచి ఈ నిధులు కార్మెల్ రూపంలో జగతిలోకి వెళ్లాయని కొందరు చెబుతుంటారు. కార్మెల్ నుంచి జగతిలోకి ప్రారంభ పెట్టుబడి కింద రూ. 73.56 కోట్లు వెళ్లాయి.
సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు. అప్పటికి ఆయన చేతిలో రూ. 7వేలు మాత్రమే ఉన్నాయి. (ఎన్నికల అఫిడవిట్ ప్రకారం) జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్‌లో ప్రారంభ పెట్టుబడి కింద ఒక్కోషేరు రూ. 10 రూపాయల చొప్పున జగన్ తీసుకున్నారు. ఒక్కోషేరు రూ. 360 రూపాయల చొప్పున కొందరు కొనుగోలు చేశారు. ఇలా సాక్షిలోకి మొత్తం రూ. 1,246 కోట్లు వచ్చాయి. తాజా వివరాల ప్రకారం జగతి పబ్లికేషన్స్‌లో మొత్తం షేర్లు రూ. 10,65, 58,481లు ఉన్నాయి. ఇందులో కార్మెల్ ఏషియాకు ఉన్న షేర్లు రూ. 7,35,81,022లు. అంటే జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్ ఏషియా వాటా 69.05 శాతం. వివిధ సంస్థలకు జగతి పబ్లికేషన్స్‌లో రూ. 10 ముఖ విలువ కలిగిన షేరుపై రూ. 350 ప్రీమియం వసూలు చేసి వాటాలు ఇచ్చారు. అంటే ఒక్కోషేరు విలువ రూ. 360గా ఉంది. ఈ లెక్కన జగతి పబ్లికేషన్స్‌లో కార్మెల్ ఏషియా సంస్థకు ఉన్న వాటా విలువ రూ. 2,648 కోట్లు అవుతుంది. అంటే కార్మెల్ ఏషియా సంస్థలో జగన్ సొంతంగా పెట్టింది రూ. 8లక్షలే అయినప్పటికీ వాస్తవ విలువ 2,648.91కోట్లు.
బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులో జగన్‌కు ఐదెకరాల స్థలంలో 7 అంతస్తుల వాణిజ్య భవనం ఉంది. క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న ఈ భవనంలో 99.99 శాతం వాటా జగన్ దంపతులదే. ఈ క్లాసిక్ రియాల్టీలో జగన్ పెట్టుబడి విలువ రూ. 65.19కోట్లు. భారతీరెడ్డి పెట్టుబడి విలువ రూ. 4.55కోట్లు. మొత్తం పెట్టుబడి విలువ రూ. 70 కోట్లు ఉన్నట్లు చూపించారు. ఐతే క్లాసిక్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆదాయ, వ్యయాల తాజా వార్షిక లెక్కల ప్రకారం గడిచిన ఏడాదికి రూ. 52 కోట్లకు పైగా లాభాన్ని చూపారు. దీనిని బట్టి ఈ భవనానికి ఉన్న వాస్తవ విలువ పరిగణలోకి తీసుకోవచ్చు. 2011 నాటికి ఈ భవనం విలువ రూ. 400 కోట్లు ఉంటుందని అంచనా. గడిచిన 13 ఏళ్లలో బెంగళూరులో స్థిరాస్తి ధరలు భారీగా పెరిగాయి. ఈ లెక్కన ఈ భవనం విలువ ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
జగన్ ఆస్తులు 20 ఏళ్లలో బాగా పెరిగాయి. అఫిడవిట్‌లోని అంకెలను పరిగణలోకి తీసుకున్నా 43,405 శాతం పెరిగింది. 2004లో ఆదాయపన్ను శాఖకు సమర్పించిన రిటన్స్‌లో నికర ఆస్తుల విలువ 1.74 కోట్లుగా జగన్ చూపించారు. 2009 ఎన్నికల నాటికి విలువ రూ. 77.39కోట్లుగా చూపారు. 2011 నాటికి ఆస్తుల విలువ రూ. 445 కోట్లకు చేరింది. అనంతరం 2019 నుంచి సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆస్తుల విలువ రూ. 510 కోట్ల నుంచి రూ. 757కోట్లకు పెరిగింది. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఆస్తులు 48.44 శాతం పెరిగాయి.
వ్యాపారాల్లో జగన్ మోహన్‌రెడ్డి ఒక్కరే ఉన్నారా అంటే పైకి అవుననిపిస్తున్నా వెనుక ఆయన చెల్లెలు షర్మిల, బావ అనిల్, ఇతర బంధువుల ప్రోత్సాహం కూడా ఉందని చెప్పాల్సిందే. పలు సంస్థలకు డైరెక్టర్‌లుగా ఉన్న వారు కూడా ఆస్తుల పెరుగుదలకు కారకులు.