సరస్వతీ పవర్ ప్రాజెక్టు భూములపై రెవెన్యూ నివేదిక ఏమి తేల్చింది..

జగన్, షర్మిల పోరు ప్రభుత్వానికి ఆయుధాన్ని ఇచ్చింది. వారిచ్చిన ఆయుధంతో సరస్వతీ పవర్ కు చెక్ పెడుతోంది.;

Update: 2024-12-21 07:09 GMT

ఇంటిలోన పోరు ఇంతింత కాదయా.. విశ్వదాభిరామ వినుర వేమ కవి అన్న మాటలు ఊహా జనితంగా రాసినవి కాదు. అనుభవంతో రాసినవని చెప్పొచ్చు. అందుకే వేమారెడ్డి వేమనగా మారిన తరువాత ఆయన రాసిన కవితలు, పథ్యాలు ఎన్నో జీవిత సత్యాలను చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల సరస్వతీ పవర్ లో తనకు వాటా ఇవ్వాలని జగన్ ను కోరటం, అందుకు జగన్ నిరాకరించడం ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామెత కూడా ఉంది. (దీని అర్థం పిట్టలు కొట్టుకు చస్తుంటే పిల్లి కి అవకాశం దొరికింది. దీంతో ఆ పిట్టలను పిల్లి పట్టుకుని మింగేసింది) రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ ప్రాజెక్టుకు ఉన్న భూములు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో పొంచి ఉన్న సమయంలో వీరి పోరు వారికి మంచి అవకాశంగా మారింది.

అసైన్డ్ భూములుగా తేల్చారు

పవర్ ప్రాజెక్టుకు పల్నాడు జిల్లాలో యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ భూములు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 2015లో కొనుగోలు చేయడం విశేషం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని, పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు కొనుగోలు చేశారని నాటి ప్రభుత్వానికి ఎందుకు తెలియలేదు అనేది కూడా ప్రశ్నార్థకమే. అయినా ఈ భూముల గురించి కానీ, అన్నా చెల్లెలు ఆస్తుల తగాదాల గురించి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ప్రభుత్వ పరంగా జరగాల్సినవి అన్నీ జరిగి పోతున్నాయి. జగన్ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ లో లెక్క తేల్చే పనిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పవర్ ప్రాజెక్టులు, సిమెంట్ పరిశ్రమలు, ఇతర సంస్థల ఆస్తుల్లో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణలు మొదలయ్యాయి.

సరస్వతీ పవర్ ప్రాజెక్టును తవ్వుతున్న పవన్

ప్రభుత్వ భూములతో పాటు ఫారెస్ట్ భూములు కూడా సరస్వతీ పవర్ ప్రాజెక్టులో ఉన్నట్లు ప్రచారం సాగింది. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మాచవరం, సత్తెనపల్లి మండలాల పరిధిలో ఉన్న సరస్వతీ పవర్ ప్రాజెక్టు భూములను నవంబరు 5న స్వయంగా వెళ్లి పరిశీలించారు. వెంటనే సర్వేచేసి ప్రభుత్వ, అటవీ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ శాఖ కదిలింది. రిపోర్టు తయారు చేసి శుక్రవారం ప్రభుత్వానికి పల్నాడు కలెక్టర్ అందించారు. అందులో అటవీ భూములు లేవు. ప్రభుత్వ బంజరు భూములు ఉన్నట్లు తేలింది.

Delete Edit

ఎన్ని ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు

ప్రభుత్వం విచారణ జరిపి ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమి ఎంత ఉందనేది లెక్క లేల్చారు. వేమవరం మండలంలో మొత్తం 28.64 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. ఎస్సీ రైతులకు ప్రభుత్వం పూర్వం 19.80 ఎకరాల భూమిని అసైన్ మెంట్ పట్టాలు ఇచ్చింది. కొందరు సాగు చేసుకుంటుండగా మరికొందరు సాగు చేసుకోవడం లేదు. ఇదంతా మెట్ట భూమి కావడం వల్ల వర్షాకాలంలోనే సాగు చేస్తారు. ఈ భూమి మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 19 మంది రైతులు 13.6 ఎకరాల భూమిని సరస్వతీ పవర్ ప్రాజెక్టుకు అమ్మారు. 6.20 ఎకరాల భూమి ఎస్సీ రైతుల స్వాధీనంలోనే ఉంది. ఈ 6.20 ఎకరాల భూమి పట్టాలు కూడా రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో 8.84 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ప్రస్తుతానికి 0.75 సెంట్లు మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 3.1 ఎకరా భూమి సరస్వతీ పవర్ ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒక రైతు 0.95 సెంట్ల భూమిలో సాగులో ఉన్నారు. అయితే ఆ రైతు పేరు రెవెన్యూ రికార్డుల్లో లేదు. వేరే రైతు పేరు రికార్డుల్లో ఉండటంతో ఆ రైతుకు నోటీసులు జారీ చేశారు. భూమిపై ఒకరు, వెబ్ ల్యాండ్ రికార్డుల్లో మరొకరి పేరు ఉండటం కూడా రెవెన్యూ రికార్డుల తప్పిదాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. మాచవరం మండలంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల వద్ద ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది.

రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్స్.

సరస్వతీ పవర్ ప్రాజెక్టు కు ఎస్సీల నుంచి కొనుగోలు చేసిన అసైన్డ్ పట్టా భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేయించినట్లు విచారణలో తేలింది. సరస్వతీ పవర్ ప్రాజెక్టుకు మాచవరం, దాచేపల్లి మండలాల్లో రిజిస్టర్ చేసిన భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాచవరం మండలంలో స్వాధీనం చేసుకున్న భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తూ బోర్డులు రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వం తరపున పెట్టారు. తమకు నిబంధనల ప్రకారం రిజిస్టర్ అయిన భూములను ఎలా రద్దు చేస్తారంటూ పవర్ ప్రాజెక్టు యాజమాన్యం న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News