చంద్రగిరిలో ఆనాటి అన్నదమ్ముల సవాల్ ఎలాంటిదంటే

అన్న చంద్రబాబుపై రామ్మూర్తి తిరుగుబాటు చేశారు. తనపై పోటీ చేసి గెలవాలని కూడా సవాల్ విసిరారు. ఇలా ఎందుకు జరిగిందంటే...

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-11-16 13:30 GMT
సీఎం చంద్రబాబు. ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు

చంద్రగిరిలో అన్నతమ్ముళ్ల మధ్య కూడా వార్  జరిగింది. సీఎం చంద్రబాబుతో తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు విబేధించారు. రాజకీయంగా కూడా సవాల్ గా నిలిచారు. "దమ్ముంటే తన పైనే పోటీ చేయమని అన్న చంద్రబాబు"ను కూడా ధిక్కరించాడు. ఈ ఆసక్తికర సంఘటన రాజకీయాల్లో చంద్రబాబును ఇబ్బందుల్లో పడేయడమే కాదు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రికి కూడా రామ్మూర్తి నాయుడు కొరుకుడుపడలేదు. ఆ తరువాత కూడా తమ్ముడిని దగ్గరకు చేర్చకున్న చంద్రబాబు తన పెద్దరికాన్ని చాటకున్నారు. ఇదే రాజకీయ విమర్శకుల నోటికి తాళం వేయించారు. ఈ ప్రస్తావన రావడానికి ప్రధానంగా...

అనారోగ్యంతో చికిత్స పొందుతూ నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలమే రాజకీయాల్లో ఉన్నప్పటికీ చంద్రగిరి లో సంచలనమే అయ్యారు. ఆనాటి సంఘటనలు వారి సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
చంద్రగిరి నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మార్చుకున్నారు. దీంతో చంద్రగిరి నియోజకవర్గంలో దీటైన అభ్యర్థి దొరకడం ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో అత్యంత ఉత్సాహం చూపుతున్న తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడికి 1994 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీకి దిగ్గజంగా ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారిని ఓడించారు. ఆ తర్వాత
1999 ఎన్నికల్లో రామ్మూర్తినాయుడు ఓటమి చెందారు.
2004 ఎన్నికలు అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి సవాల్ గా నిలిచాయి. ఈ ఎన్నికల్లో తనకు టికెట్టు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అన్న చంద్రబాబుపై తమ్ముడు రామ్మూర్తి నాయుడు తిరుగుబాటు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి రైతు సంఘం ఆకుపచ్చ కండువా మెడలో వేసుకుని స్వతంత్ర అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. చంద్రబాబు కు విధేయులుగా ఉన్న అనేక మంది నాయకులు ఆయనను బుజ్జగించడానికి విఫల యత్నం చేశారు. ఆయన రామ్మూర్తి ససేమిరా అన్నారు. శ్రీకాళహస్తి నుంచి కూడా అప్పుడు పోటీ చేయమని సంకేతాలు అందినప్పటికీ, అందుకు రామ్మూర్తి వ్యతిరేకించారనేది పార్టీ వర్గాల్లో జరిగిన చర్చ. చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రామ్మూర్తి నాయుడు టిడిపి అభ్యర్థి రామనాథంతో సమానంగా ఓట్లు సాధించగలిగారు. అయితే వీరిద్దరూ గల్లా అరుణ్ కుమార్ చేతిలో ఓటమి చెందక తప్పలేదు.
నాపై పోటీ చెయ్ చూద్దాం...
అంతకుముందు ఓ ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటుచేసుకుంది. 2004 ఎన్నికల సమయంలో అన్న చంద్రబాబు కి రామ్మూర్తి నాయుడు "నాపై పోటీ చేసి గెలవండి చూద్దాం" అని సవాల్ విసిరారు. రాజకీయంగా ఈ వ్యవహారం అప్పట్లో టిడిపికి ప్రధానంగా చంద్రబాబును ఎరకటంలో పడేసింది. దీన్ని అలుసుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబును విపరీతంగా ఓ ఆట ఆడుకున్నారు. అంతటితో ఆగని రామ్మూర్తి..
కాంగ్రెస్లో చేరిక..
స్వయాన అన్న చంద్రబాబుపై విపరీతంగా కోపం పెంచుకున్న రామ్మూర్తి 2003లో ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పక్షాన మాట్లాడడం ప్రారంభించిన రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీకి పంట కింద రాయిలా మారారు. కుటుంబంలో కూడా బేదాభిప్రాయాలు వచ్చాయి అనేది అప్పట్లో జరిగిన ప్రచారం. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తన వ్యాపారాలు వ్యక్తిగత పనులు చూసుకుంటూ నారావారిపల్లె, సమీపంలోని అపార్ట్మెంట్లో ఉండేవారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా తరచూ కనిపించే వారిని చెబుతారు.
సంధి యత్నం
రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన తమ్ముడు రామ్మూర్తితో సీఎం చంద్రబాబుకు కొంతకాలం తర్వాత సంధి కుదిరింది. "నీవు రాజకీయాల్లోకి పనికిరావు. పార్టీ వ్యవహారాల్లోకి వద్దు" అని చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను సీఎం చంద్రబాబు రామ్మూర్తికి సూచించారని సమాచారం. దీంతో తన కొడుకు నారా రోహిత్ కు సినిమా రంగంలో ప్రోత్సాహం అందించడానికి శ్రద్ధ తీసుకోవాలని అన్న చంద్రబాబు వద్ద ప్రతిపాదన ఉంచాడనే విషయం వారి సన్నిహిత వర్గాల్లో చర్చకు వచ్చింది. దీనికి సానుకూరత వ్యక్తం చేసిన చంద్రబాబు నారా రోహిత్ కు మంచి భవిష్యత్ ఇవ్వాలని తలంపుతో అండగా నిలిచినట్లు చెబుతారు. కాగా,
గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు తిరుపతి సమీపంలో ఓ ప్రాంగణంలోని అంగరక్షుల మధ్య ఉండే వారిని చెబుతారు. రాను రాను ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతున్న నారా రామ్మూర్తి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మొత్తం మీద గత పదేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉండడానికి ఆరోగ్య సమస్యలు ఆయన ఒక్కరి బిక్కిరి చేశాయనేది వారి కుటుంబానికి సన్నిహితులుగా ఉండేవారు చెప్పే మాట. ఒక దశలో నారా రామ్మూర్తి పాత స్నేహితులను, నాయకులను కూడా గుర్తించలేని స్టేజికి వెళ్లిపోయారని చెబుతారు. ఈ పరిస్థితుల్లోనే ఆయన నడవలేని స్థితికి వెళ్లి ఆరోగ్యం క్షీణించినట్టు చెబుతున్నారు. గతాన్ని వారి సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News