పవన్ కల్యాణ్ రూటే సెపరేటా?
గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పవన్ ఈసారి ఎన్నికలకు ప్రజల్లో బలం పెంచుకుని వెళ్తున్నారు. గత ఓటమి నుంచి ఏమైనా నేర్చుకున్నారా.. పవన్ సరైన రూట్‌లోనే వెళ్తున్నారా..
By : The Federal
Update: 2024-03-08 13:56 GMT
ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్ - తిరుపతి
వెండితెరకు, రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన హీరోలు పార్టీ స్థాపించి, మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ముఖ్యమంత్రులూ అయ్యారు. జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ యువరాజ్యంతో రాజకీయ ప్రవేశం చేసి, ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉంటున్నా చట్టసభల్లోకి అడుగుపెట్టలేక పోతున్నారు. కారణాలు ఏవైనా టిడిపి, బిజెపి ఒరలో కత్తిగానే మారుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ కొదవలేదు! అభిమానులు తక్కువేం లేదు!! గత ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? అనే విషయం పక్కకు ఉంచితే.. ఈసారి ఆయన అసెంబ్లీ కా? పార్లమెంటుకా? అనేది తేలలేదు. సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మంచి ఆలోచనలే ఉన్నా, ఆయన ప్రయాణంలో వైఫల్యాలే. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి 2019లో పోటీ చేశారు. కానీ ఆయన రెండు చోట్లా ఓడిపోవడం పెద్ద మైనస్.
విశాఖ జిల్లా గాజువాకలో యాదవులు, కాపు, రెడ్డిక సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువ. పవన్ కళ్యాణ్ గ్లామర్ తో ఓట్లు చీలడం వల్ల యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస యాదవ్ కూడా ఓటమి చెందారని, రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన తిప్పల నాగిరెడ్డి విజయానికి బాటలు పడ్డాయి అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గాజువాకకు మించిన దెబ్బ భీమవరంలో ఓటమి. సొంత సామాజికవర్గం అండ ఉన్నా ఓట్లు లేని అభిమానులు ఎక్కువగా ఉండడం, ఉన్న కీలకమైన నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికి కొందరు చేసిన ప్రయత్నం వల్ల ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ విజయం పై చూపించిందని అంటున్నారు.
క్యాడర్ పనిచేయకపోవడం, జనసేనకు మద్దతుగా నిలిచిన వ్యాపారులను బెదిరించడం వంటి కారణాలు కూడా లేకపోలేదు.. అనేది పరిశీలకుల మాట. రాజోలు నుంచి గెలిచిన ఒకే ఎమ్మెల్యే జారిపోయారు. ఈ ఎన్నికల ద్వారా జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు ఉన్నట్లుగా తేలింది. పవన్ కళ్యాణ్ అన్న కొణిదల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా సాధించిన ఓట్లతో పోలిస్తే చాలా తక్కువ. సినీ అభిమానులు ప్రధానంగా తన సామాజిక వర్గం ప్రజానీకం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో.. జనసేన భారీగానే ఓట్లు చీల్చింది. ఇది కాస్త, మిగతా పార్టీలోని గెలుపు ఓటములను ప్రభావితం చేసిన్నట్లు స్పష్టమవుతుంది.
పవన్ కల్యాణ్ రూట్ సరైందేనా...
జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు చూస్తే.. చాలావరకు వైఫల్యాలే కనిపిస్తాయి. జనసేనకు పూర్తి స్థాయి నిర్మాణం లేకపోవడం పెద్ద లోటు. నీతి, నిబద్ధత రాజకీయాలను నడుపుతాననే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆర్థిక వనరులు కోసం తన సినిమాలను పెట్టుబడి పెడుతున్నారు. దీనివల్ల ఎక్కువ కాలం ఆయన పార్టీ శ్రేణులతోనూ, ప్రజలతో ఉండలేని పరిస్థితి. ఈ కారణాలు రీత్యా ఆయన అధికారపక్షం నుంచి పార్ట్ టైం పొలిటీషియన్ అనే అపవాదులు ఎదుర్కొన్నారు.
జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా ఈ అభిప్రాయం ఉన్నప్పటికీ, ఏమి చేయలేని నిస్సహాయత. దశలవారీ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ తర్వాత విశ్రాంతి, సినిమాల కోసం హైదరాబాద్ వెళ్లిపోవడం. గత నాలుగు సంవత్సరాల కాలాన్ని అంత ముందు పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. దీనివల్ల ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పు కోవడంలో ఆయన వైఫల్యం చెందారు అనే విషయం సర్వత్రా వినిపించే మాట.
మళ్ళీ పునరావృతం..
ఇప్పుడు పరిస్థితి మారింది. వారాహి యాత్ర, సభలు, సమావేశాలతో తరచూ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జనంలో ఉన్నారు. కాస్త బలం కూడా పెంచుకున్నప్పటికీ, సలహాలు లేఖలు సూచనల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసిన కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య లాంటి వ్యక్తులు పక్కకు తప్పుకున్నారు. ఈ వ్యవహారాలు కోస్తాలోనే కాకుండా, రాయలసీమ జిల్లాల్లో బలిజ సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే కాస్త సానుభూతి పెరిగేందుకు దోహదం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆయన మళ్లీ 10 ఏళ్ల తర్వాత టిడిపి, బిజెపి తో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయి.
అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఆ విషయమేదో త్వరగా తేలిస్తే బాగుంటుందనేది కూడా ఆయన పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఈసారి ఆయన అసెంబ్లీ కా? పార్లమెంట్? అనేది తేల్చుకున్న తర్వాతే ఆయన జయ విజయాల పైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.
చరిత్ర సృష్టించిన తారలు..
ఎన్టీ రామారావు.. పరిచయం అవసరం లేని వ్యక్తి. తిరుపతి సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇచ్చిన ఆయన 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన నెలల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలుపొంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మెగాస్టార్ కొణిదెల చిరంజీవి కూడా 2008 ఆగస్టు 26వ తేదీ ప్రజారాజ్యం పార్టీకి క్లాప్ కొట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలు నుంచి పోటీ చేసిన కొణిదల చిరంజీవి తిరుపతి నుంచి గెలుపొంది, పాలకొల్లులో ఓటమి చెందారు. వారిద్దరూ సినిమాల ద్వారా అభిమానుల సంపాదించుకున్న వారే కాకుండా, ప్రజాకర్షణ కలిగిన సినీ ప్రముఖులే.
రాజకీయ తెరపై మెరిసిన తారలు
సినీ రంగం నుంచి వచ్చిన ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, కమెడియన్స్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నం లోనే విజయం సాధించారు. ఆ కోవలో.. అనంతపురం జిల్లా హిందూపురానికి మకాం మార్చిన ఎన్టీ రామారావు, ఆ తర్వాత ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కూడా విజయం సాధించారు. చిత్తూరు జిల్లా నగిరి నుంచి పోటీ చేసిన ఆర్కే రోజా మొదటి రెండుసార్లు ఓటమి చెందారు. గత రెండు ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగం నుంచి వచ్చిన మాగంటి మురళీమోహన్, ఘట్టమనేని కృష్ణ, జమున, జయసుధ, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, పార్లమెంటు ,శాసనసభ సభ్యులతోపాటు కొందరు మంత్రులుగా సేవలందించారు. సినిమా రంగం నుంచి ఇంతటి చారిత్రక నేపథ్యం సంపాదించుకున్న ఎందరో రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసుకున్నారు. రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కోబోతున్న జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.