ఏపీలో వాట్సప్ గవర్నెన్స్..ఎన్ని సేవలంటే
ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించారు.;
By : The Federal
Update: 2025-01-30 09:18 GMT
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో వాట్సప్ గవర్నెన్స్‌ను గురువారం ప్రారంభించారు. ఈ వాట్సప్ గవర్నెన్స్ కోసం ప్రత్యేకంగా 9552300009ను కేటాయించినట్లు లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పొందే ధృవ పత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలు అందుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పౌర సేవలు అందించేందుకు దేశంలోనే వాట్సప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏపీ అని అన్నారు.
ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మొదటి విడతలో 161 పౌర సేవలను అందించనున్నట్లు తెలిపారు. దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్ వంటి శాఖలకు సంబంధించిన సేవలను ప్రజలు పొందొచ్చన్నారు. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, రూమ్స్ బుకింగ్, డోనేషన్ల సేవలు, రెవెన్యూ శాఖలో ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్లు, మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇన్‌కమ్, నో ఎర్నింగ్ ధృవీకరణ పత్రాలు, ఏపీఎస్‌ఆర్‌టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రీఫండ్, ఫీడ్ బ్యాక్ వంటి అనేక సేవలను ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చని వెల్లడించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు వంటి అనేక సేవలు కూడా ఈ వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చన్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని టూరిస్టు ప్రదేశాల వివరాలు, వాటి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. నచ్చిన టూరిస్టు ప్రదేశం ఎంపిక చేసుకున్న తార్వాత అక్కడకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు, టికెట్లు, వసతి వంటి సేవలు కూడా పొందొచ్చు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వినతి పత్రాలు, ఫిర్యాదులు కూడా ఈ వాట్సప్ నంబరుకు మెసేజ్ పంపడం ద్వారా పొందొచ్చు. వాట్సప్‌కు మెసేజ్ పంపిన వెంటనే ఒక లింక్ వస్తుంది. దానిలో పేరు, ఫోన్ నంబరు, అడ్రెస్, వంటి వివరాలను పొందుపరచి, వారి వినతిని సమర్పిస్తే, వెంటనే వారికి ఓ రిఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా వినతుల పరిష్కారం ఎంత వరకు వచ్చింది, ఎవరి వద్ద వినతి ఉందనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్‌స్టేషన్‌ల మరమ్మతులు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఎమెర్జెన్సీ, టూరిజం, మౌలిక వసతుల డెవలప్‌మెంట్ వంటి సమాచారాన్ని ప్రజలకు చేర వేస్తుందని వెల్లడించారు.
వాట్సప్ గవర్నెన్స్ ఆలోచన తన యువగళం పాదయాత్ర నుంచే మొదలైందని లోకేష్ వెల్లడించారు. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది.. ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం.. ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది.. కానీ ఒక బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రావడం లేదనే చాలెంజ్‌ను ఆ రోజే స్వీకరించాలనని, దానిని సాకారం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో పని చేశామన్నారు. మన మిత్ర.. ప్రజల చేతుల్లోనే ప్రభుత్వం.. ప్రజల చేతుల్లో పాలన.. మాది ప్రజా ప్రభుత్వం నినాదంతో దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు లోకేష్ వెల్లడించారు.