ఆయా శాఖల్లో చాలా డేటా ఉన్నప్పటికీ అది ఇప్పటికి కూడా ఒకచోట అనుసంధానం కాలేదు. దాని వల్ల పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేపని లేకుండా పౌరులు వారికి కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఉన్న డేటాను ఈ డేటా లేక్‌తో అనుసంధానం చేస్తామని, తద్వారా పౌరులకు డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందించే సదుపాయం కల్పిస్తామన్నారు.
పౌరులెవ్వరు కూడా తమకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ఏ కార్యాలయానికి, ఏ అధికారి వద్దకు వెళ్లకుండా కేవలం తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారనే సులభంగా పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందన్నారు. దీనికోసం మెటా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు, అన్ని రకాల ధృవీకరణ పత్రాలు దీని ద్వారానే పొందే సదుపాయం కల్పింస్తుందన్నారు.
ఒక పౌరుడు తనకు సంబంధించిన విద్యార్హత, కుల, ఆదాయ, జనన, మరణ వంటి ధృవీకరణ పత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడు చేసుకోవచ్చని, ఎవరి వద్దకు తిరగాల్సిన పని ఉండబోదన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించి సర్టిఫికెట్లను భౌతికంగా తమతో తీసుకెళ్లాల్సిన అసవరం ఉండబోతదని, తమ చేతిలోని మొబైల్ ఫోన్లోనే ఆ సర్టిఫికెట్లను డౌన్‌లోడు చేసుకుని పొందొచ్చన్నారు. ఆ దిశగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం అమలు చేయనున్నదన్నారు. వాట్సాప్ ద్వారానే పౌరుల చెల్లింపులు కూడా నిర్వహించుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వాట్సాప్ ద్వారానే పౌరులు ప్రభుత్వానికి అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చన్నారు.
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందిస్తున్నామని, అయితే సరిహద్దు జిల్లాల్లో ఉన్న ప్రజల సౌకర్యం కోసం ప్రాంతీయ భాషలైన తమిళం, ఒరియా, కన్నడ భాషల్లో కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. చదువు రాని పౌరులు వాయిస్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదు, అర్జీలు సమర్పించే అవకాశం కూడా కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే ఇవన్నీ పౌరులకు మరింత మెరుగ్గా అందించాలంటే శాఖల మధ్య డేటా అనుసంధానం వేగవంతంగా జరగాల్సిన అవసరముందని చెప్పారు.
ఒక చీఫ్ సడీటీఓ..
ప్రతి శాఖలోనూ ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించుకోవాలని భాస్కర్ కాటంనేని అధికారులకు సూచించారు. ఆయా శాఖల్లో పని చేసే వారిని రెండు రోజుల్లోపు గుర్తించి, వారికి ఈ బాధ్యతలు అప్పజెప్పాలన్నారు. అదే విధంగా ఆర్టీజీఎస్ డేటా లేక్‌తో ఆయా శాఖలు తమ వద్ద ఉన్న డేటాను షేర్ చేసుకునే ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి కె దినేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ మాధురి, పౌరసరఫరాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సౌరవ్ గౌర్, ఐజీ టెక్నికల్ సర్వీస్ శ్రీకాంత్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, జీఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.