ప్రశ్నలు అడిగితే రాజకీయాలు మాట్లాడుతున్నారు
మండలిలో ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. ఇది మంచి సంప్రదాయం కాదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో శాసన సభ కంటే శాసన మండలే ప్రాధాన్యత సంతరించుకుంది. శాసన సభలో ప్రతిపక్షం లేక పోవడం, శాసన మండలిలో బలమైన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటంతో అటు కూటమి ప్రభుత్వం దృష్టి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి శాసన మండలి మీద పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన చర్చలు కూడా శాసన సభలో కంటే శాసన మండలిలోనే వాడీ వేడీగా జరుగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం చేస్తుండగా.. తాము అధికారంలో ఉన్నామనే దర్పాన్ని ప్రదర్శించేందుకు, ఈ నేపథ్యంలో ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెట్టేందుకు అధికార పక్షం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో సారి చర్చలు పక్క దారి పట్టి రాజకీయాల వైపునకు మళ్లుతున్నాయి. దీంతో చర్చలు ఫలించడం లేదు. పరస్పరం విమర్శలు చేసుకోవడం, వాగ్వాదాలకు చేసుకోవడానికే సభా సమయం సరిపోతోంది.