బ్యాంకుల కిరికిరీ: గిరిజనుల పేరిట కోట్లు కొల్లగొట్టారిలా?

పేదల ఆధారాలతో కోట్ల రూపాయల మోసం: నెల్లూరులో ‘కుబేర’ గాథ!;

Update: 2025-07-21 07:01 GMT
కోట్ల రూపాయల రుణం వీళ్లకి ఇచ్చారంటూ బ్యాంకులు ఇచ్చిన నోటీసులు చూపుతున్న బాధితుడు
కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకుందామన్నా, దాచిన డబ్బును తీసుకోవాలన్నా సవాలక్ష ఆంక్షలు, లేనిపోని అనుమానాలు వ్యక్తం చేసే ఈ బ్యాంకులు అభం శుభం తెలియని గిరిజనులు- అదీ దరఖాస్తు చేయకుండానే కోట్ల రూపాయల లోన్లు ఇచ్చామని చెబితే ఎలా? ఎవరి డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతోంది? క్రైమ్ థిల్లర్ సినిమాలను తలపించే రీతిలో జరిగిన ఓ బ్యాంకు మోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. బ్యాంకుల్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోస్తున్న మూకల వైనం బయటపడింది నెల్లూరులో..
నెల్లూరులో నిరుపేద గిరిజనులను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూపారు. నకిలీ ధ్రువపత్రాలను బ్యాంక్‌లకు సమర్చించారు. రూ.20 కోట్లు కొల్లగొట్టారు. ఈ జిల్లాకు చెందిన నలుగురు ఓ ముఠాగా ఏర్పడి ఈ నగదు కాజేశారు.
నెల్లూరు, కావలి, విడవలూరు సహా మరికొన్న చోట్ల ఈ ముఠా తన ఏజెంట్లను నియమించింది. వాళ్లు గిరిజనుల నుంచి ఆధార్‌ కార్డులు, ఫొటోలు తీసుకున్నారు. ఆ తరువాత ఆధార్‌ను అడ్డుపెట్టుకుని గిరిజనులకు తెలియకుండానే వారిపేరుతో ప్రత్యేకంగా సిమ్‌ కార్డు, పాన్‌కార్డు సంపాదించారు. ప్రైవేటు బ్యాంక్‌లో ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు తీసుకున్నారు.
బ్యాంక్‌ ఖాతాలు తెరిచిన తరువాత... కొందరు బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది సహకారంతో నగదు కొల్లగొట్టేందుకు నలుగురు నిందితులు పక్కా ప్రణాళిక రూపొందించారు. నాలుగు నకిలీ కంపెనీలు సృష్టించారు. అందులో 56 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు రికార్డులు సృష్టించారు. వాటిని నెల్లూరు, ముత్తుకూరులోని బ్యాంక్‌ల్లో సమర్పించి.. వారి పేర్లతో రూ.20 కోట్ల వరకు రుణాలుగా తీసుకున్నారు. ముత్తుకూరు బ్యాంక్‌లో రూ.10 కోట్లు, నెల్లూరు బ్యాంక్‌లో రూ.10 కోట్లు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా చెక్కేశారు.
ఈ ముఠాయే మూడు, నాలుగు ఇన్స్టాల్మెంట్ల రుణం కట్టింది. ఈలోగా ఆయా బ్యాంక్‌ శాఖల్లోని అధికారులు వేరే శాఖలకు బదిలీ అయ్యారు. కొత్త అధికారులు రుణాల వసూలుకు పూనుకున్నప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాము రుణాలే తీసుకోలేదని ఆ గిరిజనులు చెప్పడంతో బ్యాంక్ అధికారులు నోరెళ్లబెట్టారు.
తాము కూలీలమని, రుణాలు తీసుకోలేదని గిరిజనులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్నే మీడియాకి చెప్పారు. నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరావు బ్యాంక్‌ మేనేజర్‌ను పిలిపించి ఈ వ్యవహారమై విచారించారు. కేసు నమోదు చేశారు.
వాసుదేవనాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే నలుగురు 4ఫేక్‌ కంపెనీలను సృష్టించారు. వాటిలో 56 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటూ.. నకిలీ జీతాల సర్టిఫికెట్లు సమర్పించి ముత్తుకూరు బ్యాంక్‌లో రూ.10 కోట్లు రుణంగా తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
ఇటీవల విడుదలైన కుబేరా సినిమాను ఈ సంఘటన తలపిస్తోంది. అందులో బిచ్చగాళ్ల పేరిట కోట్లు కొల్లగొడితే ఇక్కడ గిరిజనుల పేరిట కోట్లు కొల్లగొట్టారు.
ఈ ఘటన పేద గిరిజనుల బాధకంటే పెద్దగా, దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది. రుణాల కోసం అన్నీ కాగితాలు సమర్పించి, అర్థమై మాట్లాడలేని ప్రజలకు తిరస్కారాలు చెప్పే బ్యాంకులు — వారి పేర్లతో కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం ఆమోదయోగ్యమా? ఇది వ్యవస్థపరమైన వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక నైతికత పతనం. ఎవరి డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్లిందో చెప్పడం కష్టమేమో కాని, ఎవరి బాధ వాస్తవమో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News