కోటీశ్వరులకు పెన్షన్లు.. కార్మికులకు కనీస వేతనాల్లేవా అధ్యక్షా?

త్యాగాలు సామాన్యులే చేయాలా, తాజాలు, మాజీలు చేయరా?

Update: 2025-10-03 11:10 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు, పెన్షన్ పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి ప్రజా చర్చకు దారితీసింది. ఇప్పటివరకూ నెలకు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000లకు, పెన్షన్లు ₹30,000 నుంచి ₹50,000కి పెంచే ప్రతిపాదన రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ, కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 175 మంది శాసనసభ్యులు, 58 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న వారిలో 88 మంది మాజీ శాసనమండలి సభ్యులు, 388 మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే వీరిలో ఏ కొద్దిమందో తప్ప ఈ పెన్షన్ పై ఆధారపడి బతుకీడుస్తున్న వాళ్లు లేరు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యాపారమో, కళాశాలలో, ఇతరేతర సంస్థలో, ఫ్యాక్టరీలో ఉన్నాయి. వామపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేళ్లమీద లెక్కించదగ్గ ఇతర పార్టీల వారు మినహా ఎక్కువ మంది ఆర్ధికంగా స్థిరపడిన వాళ్లే. అంతమాత్రాన పెన్షన్ వదులుకోవాల్సిన పని లేకపోయినా పెంచించుకోవాల్సిన పని లేదన్నది ప్రజాసంఘాల వాదనగా ఉంది. సామాన్యులు తప్ప రాజకీయ నాయకులు త్యాగాలు చేయరా అనే విమర్శలు వస్తున్నాయి.
2024 ADR డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ₹65.07 కోట్లు. ADR డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు నాయుడు (కుప్పం) – ₹931 కోట్లు, పొంగురు నారాయణ (నెల్లూరు సిటీ) ₹824 కోట్లు, వైఎస్ జగన్ (పులివెందల) ₹757 కోట్లు, వి. ప్రశాంతి రెడ్డి (కోవూర్) ₹716 కోట్లు.. ఇలా సాగుతుంది జాబితా. గత విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం ఉన్న శాసనసభలో 163 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. పార్లమెంటు సభ్యులైతే మొత్తం 25 మంది ఎంపీలలో 24 మంది కోటీశ్వరులు అని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇక, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలలో (MLCs) 2022లో ADR “Analysis of Criminal Background, Financial … of Sitting MLCs in Andhra Pradesh” అనే నివేదికలో, మొత్తం 58 MLCsలలో 48 మంది తమ ఆస్తి, ఆర్థిక వివరాలు ప్రకటించారు. 75% మంది ఎమ్మెల్సీలు కోటీశ్వరులుగా ఉన్నారు. అందులో అత్యంత ధనిక ఎమ్మెల్సీగా నారా లోకేష్ పేరు ఉంది. అంటే, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలలో దాదాపుగా 3/4 వంతు మంది సభ్యులు కోటీశ్వరులు.
పెన్షన్ ఎలా ఇస్తారంటే..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకసారి పదవిలో ఉంటే, వారు పెన్షన్‌కు అర్హులు అవుతారు. పెన్షన్ ఆర్థిక స్థితి ఆధారంగా ఉండదు. పదవిలో ఉన్న కాలం (5 ఏళ్లు) పూర్తిచేశారా లేదా అన్నదే ప్రమాణం.
అందువల్ల కోటీశ్వరులైనా, నిరుపేదలైనా అందరికీ ఒకే రీతిలో పెన్షన్ లభిస్తుంది.
మరి వివాదం ఏమిటీ?
ఇప్పటికే కోటీశ్వరులైన నేతలు ప్రభుత్వ ఖజానా నుంచి పెన్షన్ పొందడం న్యాయమా? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకి పెన్షన్ అవసరం లేదని సామాజిక కార్యకర్తలు, పారదర్శకత కోరుకునే వారు వాదిస్తున్నారు. ఈ డబ్బును సాధారణ పౌరుల సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తే బాగుంటుందనే వారూ ఉన్నారు. కొన్ని విదేశాలలో “మీ దగ్గర ఇప్పటికే అధిక ఆదాయం ఉంటే, పెన్షన్ తగ్గించబడుతుంది లేదా ఇవ్వబడదు” అనే విధానం అమలు చేస్తున్నారు.
భారత్‌లో మాత్రం “సర్వీస్-బేస్డ్ పెన్షన్” పద్ధతే..
మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేవలం నెలవారీ పెన్షన్ మాత్రమే కాదు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత వైద్యం, మందులు, గెస్ట్ హౌస్ వాడకం, ఉచిత సౌకర్యాలు వంటి ఎన్నో ప్రయోజనాలు పొందే వీలుంది.
- పెన్షన్ – నెలకు ₹50,000 వరకు (సర్వీస్ కాలానికి అనుగుణంగా పెరుగుతుంది)
- ఉచిత ప్రయాణం – APSRTC బస్సుల్లో జీవితకాలం ఉచితం, పరిమిత రైలు రాయితీలు
- వైద్యం – ఉచిత మెడికల్ రీయింబర్స్‌మెంట్, కుటుంబ సభ్యులకు కూడా పరిమిత సాయం
- గృహ సదుపాయం – లెజిస్లేటివ్ క్వార్టర్స్ లేదా గెస్ట్ హౌస్ వాడుకునే హక్కు
- ప్రోటోకాల్ గౌరవం – ప్రభుత్వ కార్యక్రమాల్లో VIP ట్రీట్మెంట్, కొందరికి భద్రతా కవర్
2014 తర్వాత పెన్షన్ల ఖర్చు
రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 2014 నుంచి 2025 వరకు, రాష్ట్ర బడ్జెట్ పత్రాల ప్రకారం మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ల కోసం సుమారు ₹600–700 కోట్ల వరకు ఖర్చు అయ్యింది. ఈ సంఖ్యలు ఒకదానికొకటి కలిపి చెప్పినప్పుడే ప్రజలకు అసలు భారమేమిటో అర్థమవుతుంది. 2014–15లో సుమారు ₹15 కోట్లు ఖర్చయితే, 2024–25 బడ్జెట్ అంచనాల్లో ఈ ఖర్చు ₹35 కోట్లకు పైగా చేరింది. ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చిన ఈ భారమే ఇప్పుడు మళ్లీ రెట్టింపు అవుతోంది.
గణాంకాలకన్నా వాస్తవం
ఈ లెక్కలు కేవలం గణాంకాల్లా కనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే – సాధారణ పౌరులు, ఉద్యోగులు, రైతులు డబ్బు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తుంటే, మాజీ ఎమ్మెల్యేల వర్గానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఒక సాధారణ అంచనా ప్రకారం, రాష్ట్రంలో కనీసం 100 మంది మాజీ ఎమ్మెల్యేలున్నారని తీసుకుంటే, ఒక్కొక్కరికి నెలకు ₹50,000 చెల్లిస్తే, నెలకు ₹50 లక్షలు, సంవత్సరానికి దాదాపు ₹6 కోట్ల ఖర్చు ప్రభుత్వానికి అదనంగా వస్తుంది. దీన్ని 10 సంవత్సరాల గణనలో పెడితే సుమారు ₹60 కోట్లకు పైగా భారమవుతుంది.

ప్రభుత్వం తరచూ ఉద్యోగుల DA బకాయిలు, కూలీల కనీస వేతనం పెంపు, పెన్షనర్ల డిమాండ్ల విషయంలో ఆర్థిక ఇబ్బందులను చూపుతుంటుంది. ప్రజా అవసరాలకు మాత్రం “నిధుల కొరత” చెబుతూనే, రాజకీయ వర్గాలకు ప్రత్యేక పింఛన్ ప్యాకేజీలను అందించడం సరైనదేనా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీనివల్ల ప్రజల్లో “ప్రాధాన్యం ఎక్కడ?” అన్న చర్చ మొదలవుతుంది.
కనీస వేతనం vs. మాజీ ఎమ్మెల్యేల పెన్షన్
సాధారణ కార్మికుడు నెలకు కనీసం ₹15,000–20,000 వేతనం కోసం పోరాడుతుంటే, తాజాలు లక్షల్లో మాజీలు నెలకు ₹50,000 పెన్షన్ పొందడం ప్రజా వ్యతిరేకతను చూపుతుంది. కనీస వేతనం కోసం బలహీన వర్గాల పోరాటం మామూలే అయినా, రాజకీయ వర్గాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తాలను ఖర్చు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఆర్. రవీంద్రనాథ్ వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధులకు జీతాలు, పెన్షన్ల పెంపు నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికలపై అనేక మంది ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. “ప్రజలకు వైద్యం, విద్య, వేతనం కోసం కష్టాలు చెబుతున్న ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యేల కోసం కోట్ల ఖర్చు చేయడం న్యాయమా?” అన్న ప్రశ్నలు ట్రెండ్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ప్రజల్లో విభిన్న సంకేతాలను ఇస్తుందని అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ పెంపుపై తీసుకున్న నిర్ణయం కేవలం గణాంకాల వ్యవహారం కాదు. ఇది ప్రజాధన వినియోగ ప్రాధాన్యం గురించి. ఒకవైపు ప్రజలు కనీస అవసరాల కోసం పోరాడుతుంటే, మరోవైపు మాజీ ప్రజాప్రతినిధులు పదవిలో లేకపోయినా సౌకర్యాలను పొందడం ఒక న్యాయమా అనే ప్రశ్న రాష్ట్ర రాజకీయ చర్చలో ముందుకు వచ్చింది.
Tags:    

Similar News