తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో
ఎన్నికల ఫలితాల అనంతరం ఇరువురు సీఎంలు సమావేశం అయ్యారు. తాజాగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయి, విభజన చట్టంలోని సమస్యల పరిష్కారానికి ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మిల్లియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సరిగ్గ జూన్2 నాటికి పదేళ్ల విలువైన సమయం కాల గర్భంలో కలిసి పోయింది. ప్రస్తుతం 11వ సంవత్సరం జరుగుతోంది. మూడు సార్లు సార్వత్రి ఎన్నికలు జరిగాయి. మూడు ప్రభుత్వాలు మారాయి. కానీ విభజన సమస్యలు నేటికీ కొలిక్కి రాలేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీనికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ అలసత్వం కూడా ఉంది. సమస్యలు పరిష్కరించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చొరవ తీసుకోక పోవడంతో ఈ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు.