మాజీ మంత్రి కాకాణి... కానరాడేమీ?
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.;
By : The Federal
Update: 2025-04-08 09:50 GMT
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 10 మందిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మరో ముగ్గురిని చేర్చారు. వీరందర్నీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇందులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చేర్చారు. అనంతరం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
అసలేమిటీ కేసు...
పోదలకూరు పోలీసులు మాజీ వైఎస్సార్‌సీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసు విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన కేసు ఇది. నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కు అనుమతులు ఇచ్చిందని, ఇందులో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. ఇప్పటికే పెర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసుల రెడ్డిపై కేసు నమోదు అయింది. ఈకేసులో వీరు ముగ్గురు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు.
తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నెల్లూరులో గోవర్ధన్ రెడ్డి నివాసం గోడలకు నోటీసులు అంటించారు. మంత్రి కాకాణిని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పోలీసులు చెబుతున్నారు.
ఒక పోలీసు అధికారి తెలిపిన ప్రకారం, రుస్తుం మైన్స్ లో భారీ పేలుళ్లకు చట్ట ప్రకారం అనుమతిలేని పేలుడు పదార్థాలను వాడారన్నది గోవర్ధన్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా క్వార్ట్‌జ్ ను రవాణా చేశారనేది అభియోగం. ఈ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయినా వారెవ్వరూ విచారణకు రాలేదు.
దర్యాప్తులో భాగంగా కాకాణితో పాటు మరో ఏడు మందిని కేసులో చేర్చారు. వారిలో ఆరు, ఎనిమిదో నిందితులైన ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
కేసు ముఖ్యాంశాలు...
అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.
పోదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో జరిగిన మైనింగ్ కేసులో కాకాణి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో విస్తృత స్థాయిలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా మరో ముగ్గురికి నోటీసులు
ఈ కేసులో తాజాగా ఊరిబిండి ప్రభాకర్‌రెడ్డి, ఊరిబిండి చైతన్యతో పాటు కాకాణి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డిని చేర్చారు. ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు గ్రామీణ డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. ఆయన తన న్యాయవాదితో హాజరయ్యారు. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసుకు సంబంధించిన పలు అంశాలు ఆరా తీసినట్లు తెలిసింది. గడువు ముగిసిన మైన్‌లో ఇష్టానుసారం జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించడం తదితరాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
రిమాండ్ పొడిగింపు
రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ తరలింపు కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ గూడూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు మార్చి 24వ తేదీ నుంచి 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉండగా.. ఏప్రిల్ 6 తో ఆ గడువు ముగిసింది.
పరారీలో కాకాణి గోవర్ధన్ రెడ్డి...
వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister) కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakanani Govardhan Reddy) ఇంకా పరారీలోనే ఉన్నారు. పదిరోజులుగా పోలీసుల (Police) నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఫిబ్రవరి 16న కేసు నమోదైంది. కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.