జనసేన ఆఫీసులో ఏ రోజు ఏ ఎమ్మెల్యే అర్జీలు తీసుకుంటారంటే..
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆగస్టు 1 నుంచి అర్జీలు తీసుకునే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు అర్జీలు తీసుకుంటారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అక్కడిక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాలలో అది రుజువైంది. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ఉన్నారంటే ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక సమయంలో అర్జీలను తీసుకోవడం పవన్ కళ్యాణ్ చేస్తూనే ఉన్నారు. అర్జీలను తీసుకోవడంతోనే వాటిని క్షుణ్ణంగా చదవి, సమస్యలను తెలుసుకొని, సంబంధత అధికారులతో చర్చించి, అక్కడిక్కడే పరిష్కరించి అర్జీదారులను సంతృప్తితో ఇంటికి పంపిస్తున్నారు. అయితే ప్రతి రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి అర్జీలను తీసుకోవడం పవన్ కళ్యాణ్‌కు సాధ్యం కాదని, పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లోను పవన్ బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎంగాను, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ వంటి పలు కీలక శాఖల మంత్రిగా ఉండటం వల్ల సమీక్షలతో సమయం సరిపోవడం లేదు. అయినా సమయం దొరికినప్పుడుల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు దారులకు కలుస్తున్నారు. తనతో సంబంధం లేకుండా పార్టీ ఆఫీసులో అర్జీలను స్వీకరించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు. జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇక నుంచి అర్జీలను స్వీకరిస్తారు.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 11 వరకు షెడ్యూల్ ఖరార్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1, 2వ తేదీల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, 3, 4వ తేదీల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, 5, 6వ తేదీల్లో విశాఖ దక్షణం ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్, 7, 8వ తేదీల్లో అనకాపల్లి ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ, 9, 10తేదీల్లో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, 11, 12 తేదీల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, 13, 14వ తేదీల్లో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, 16, 17వ తేదీల్లో పిగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, 18, 19వ తేదీల్లో రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, 20, 21 వ తేదీల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, 22వ తేదీ మంత్రి కందుల దుర్గేష్, 23, 24వ తేదీల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, 25, 26వ తేదీల్లో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, 27, 28 వ తేదీల్లో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, 29, 30 తేదీల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆగస్టు 31, సెప్టెంబరు 1న ∙ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అర్జిలను స్వీకరిస్తారు. సెప్టెంబరు 2, 3 తేదీల్లో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్, 4, 5వ తేదీల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, 6, 7వ తేదీల్లో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, 8, 9వ తేదీల్లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, 10, 11వ తేదీల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అర్జీలు స్వీకరిస్తారు.