ఈ ముగ్గురు చేతిలోనే లిక్కర్ స్కాం నడిచిందా!
సిట్ ప్రశ్నలతో ఐఎఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి;
By : The Federal
Update: 2025-05-14 11:19 GMT
ఏపీ లిక్కర్ స్కాం మలుపులు తిరుగుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికార, అనధికార ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ కేసులో ఇరుక్కుంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో 24 గంటల కిందట భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయగా ఇవాళ (మే 14)న మరో ఇద్దరు ప్రముఖులు ఐఎఎస్ అధికారి కె. ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. వీరిద్దర్నీ విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు.
వైసీపీ హయాంలో జరిగినట్టు చెబుతున్న 3,370 కోట్ల రూపాయల స్కాంలో.. నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్ట్ చేసింది.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయినప్పటికీ మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ లిక్కర్ స్కాంలో 'మీ ముగ్గురే (ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ) కీలకమంటున్నారు, నిజమేనా' అని సిట్ అధికారులు పదేపదే అడిగినట్టు తెలిసింది. తమకేమీ తెలియదని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చెప్పారని, తమకూ మద్యానికి అసలు సంబంధమే లేదని వారు తేల్చి చెప్పారని సమాచారం.
ఏపీ లిక్కర్ కేసులో (AP Liquor Case) గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ 33వ నిందితునిగా ఉన్నారు. మద్యం ఆర్థర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించాడని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరందరూ పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే గోవిందప్పను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పొందుపర్చారు. గతంలో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న బ్రాండ్‌లు మాత్రమే అమలులో ఉండేవి. అయితే ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అటువంటి డిమాండ్‌లు ఉన్న బ్రాండ్లను పూర్తిగా నిలిపివేసి సొంత తయారీతో, సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మద్యం తయారీకి సంబంధించి వైసీపీ నాయకులను బ్రాండ్లకు సంబంధించిన తయారీ కేంద్రాలకు యజమానులుగా మార్చిన వైనం తేటతెల్లమైంది.
ఏయే కంపెనీలకు ఎంత వరకు అనుమతులు ఇవ్వాలి, నెలవారీగా ఒక కంపెనీకి ఒక నెలలో ఎక్కువగా ఇస్తే... మరో కంపెనీకి మరోనెలలో ఎక్కువగా తయారు చేసే అవకాశం ఇస్తూ తద్వారా అధికంగా ముడుపులు తీసుకోవడంతో పాటు వాటిని వివిధ రూపాల్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి ముఖ్య నాయకులకు చేరినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఏపీ లిక్కర్ స్కాంలో కొన్ని వేల కోట్లు చేతులు మారినట్లు తేల్చారు.
లిక్కర్ స్కాంలో గోవిందప్ప బాలాజీని మంగళవారం మైసూర్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇవాళ విచారణకు పిలిచారు. ఈకేసులో ఇప్పటికే ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.