షర్మిల టార్గెట్ ఎవరు?

షర్మిల అన్న జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా? ఉప ఎన్నిక వస్తే షర్మిల పోటీచేసి జగన్ ను చిత్తుగా ఓడిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు అన్నారు?

Update: 2024-07-13 05:03 GMT

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల టార్గెట్ ఎవరనే చర్చ సాగుతోంది. గతంలో అధికార పార్టీగా వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయినా అన్న జగన్ ను మాత్రం వదిలి పెట్టడం లేదు. జగన్ ను విమర్శిస్తూనే ఎన్డీఏ కూటమిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపిగా పోటీ చేయబోతున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు, స్టోరీలు హల్చల్ చేశాయి.

వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. జగన్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తామనే సంకేతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చారు. జగన్ పోటీ చేసిన చోటే షర్మిల పోటీచేసి గెలుస్తుందని, అందుకోసం నేను పనిచేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షోషల్ మీడియాలో రౌండ్స్ వేస్తున్నాయి. ఈ మాట రేవంత్ ఎందుకు అనాల్సి వచ్చిందనేది పరిశీలిస్తే షర్మిల అసలు టార్గెట్ వైఎస్ జగన్ అనేది స్పష్టమవుతోంది. పదవి లేకప్పుడు ఒక విధంగా, పదవి వచ్చినాక ఒక విధంగా జగన్ ఉన్నారని, జగన్ మారిపోయాడంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు ఆస్కారమిచ్చాయి. ఎన్డీఏ కూటమిపై షర్మిల విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యులను కలుపుకుని అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలకు కూడా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు హాజరయ్యారు. వైఎస్ జగన్ వ్యవహార శైలిని మొదటి నుంచీ తప్పు పడుతున్న కాంగ్రెస్ నేతలు షర్మిల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ బలాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

అమ్మకు వందనం పథకాన్ని ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వర్తింప చేస్తామని ఇప్పుడు ఎందుకు పథకం సక్రమంగా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే పత్రికలను అడ్డం పెట్టకుకు ఇప్పుడు సాక్షి, అప్పుడు ఈనాడు ఈ విధంగా రాస్తున్నాయని చెప్పేందుకు ఉదాహరణగా షర్మిల చూపించారు. ప్రత్యక్షంగా పత్రికల గురించి ప్రస్తావించకపోయినా దానర్థం అదేనని చెప్పాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఓట్ల శాతం పెరిగింది. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు. పార్టీ నిర్మాణ పరంగా ముందడుగు వేయలేదు కాబట్టి ఎక్కువ కాలం పార్టీ నిలదొక్కుకునే అవకాశం లేదని, గతంలో కాంగ్రెస్ వాదులుగా ఉన్న వారే వైఎస్సార్సీపీలో ఎక్కువ మంది ఉన్నారని, వారంతా తిరిగి కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వారు భావిస్తున్నారు. ఎప్పటికైనా వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందేనని, అప్పటికి షర్మిల ఏపీ నుంచి నాయకత్వంపై పూర్తి పట్టు సాధిస్తారని, ఒకవేళ జగన్ కాంగ్రెస్ లో పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా నాయకత్వ పగ్గాలు షర్మిల చేతుల్లోనే ఉంటాయని కాంగ్రెస్ వారు అంటున్నారు.

ఎంపీలతో ఎన్డీఏకు ఎందుకు ఊడిగం చేయిస్తున్నారు

వైఎస్సార్సీపీ తరపున నలుగురు ఎంపీలు గెలిచారు. వీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా జగన్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని షర్మిల విమర్శిస్తున్నారు. అందులో నిజం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకుండా ఉంటే తమ పాత్ర ఏమిటో చూపిస్తామని, ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి సాధిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సింది పోగొట్టి బీజేపీ పెద్దల వల్ల మోకరిల్లాడంటే దాని అర్థం ఏమిటని షర్మిల ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులందరూ రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని షర్మిల అంటున్నారంటే అందులో కొంతవరకు వాస్తవం కూడా ఉందని ప్రజలు నమ్ముతున్నారు.

రాజకీయంగా అన్నను టార్గెట్ చేస్తేనే కాంగ్రెస్ లో కేంద్ర నాయకత్వం నుంచి షర్మిలకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే జగన్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News