స్టార్ హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజుల భారీ తగ్గింపు ఎవరి కోసం?
త్రీ స్టార్, ఆపై స్టార్ హోటల్స్ లో బార్ లైసెన్స్ ఫీజులు భారీగా ప్రభుత్వం తగ్గించింది. ఎందుకు, ఎవరి కోసం తగ్గించింది?;
ప్రస్తుతం స్టార్ హోటల్స్ లో ఉన్న బార్ లైసెన్స్ ఫీజులు 50 శాతం ప్రభుత్వం ఒక్కసారిగా తగ్గించింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన పది నెలల తరువాత తగ్గించడం చర్చనియాంశంగా మారింది. ప్రధాన మైన స్టార్ హోటల్స్ అన్నీ దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఫీజులు ఒక్కసారిగా సగానికి సగం తగ్గించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తొమ్మది త్రీ స్టార్ హోటల్స్, ఫోర్ స్టార్ హోటల్స్ నాలుగు, ఫైవ్ స్టార్ హోటల్స్ నాలుగింటిలో బార్స్ ఉన్నాయి. విజయవాడలో 3 స్టార్ లైసెన్స్ ఉన్న హోటల్స్ సుమారు 30 వరకు ఉన్నాయని సమాచారం.
విజయవాడలో స్టార్ హోటల్స్ వివరాలు..
విజయవాడలో ప్రముఖ త్రీ స్టార్ హోటల్స్ ఫాబ్‌హోటల్ కీర్తీస్ అనుపమీ, ఇట్సీ బై ట్రీబో - ఎన్ స్క్వేర్, ఫ్లాగ్‌షిప్ అక్షయ భీమాస్ ఇన్, పార్క్ ఐరిస్ హోటళ్లు.. భారతి నగర్, హోటల్ శ్రీ రామ్ గ్రాండ్, ట్రీబో ట్రెండ్ జెఎస్ఎన్ గ్రాండ్, ట్రీబో ట్రెండ్ సిద్ధార్థ గ్రాండ్, క్వాలిటీ హోటల్ డీవీ మానర్, హోటల్ ఐలాపురం లు ఉన్నాయి. 4 నక్షత్రాల హోటళ్లు లెమన్ ట్రీ ప్రీమియర్, ఫార్చ్యూన్ మురళి పార్క్, గ్రాండ్ విజయవాడ బై జీఆర్‌టీ హోటళ్లు, హోటల్ మనోరమ ఇవి కాకుండా 5 నక్షత్రాల నోవోటెల్ విజయవాడ వరుణ్, వివంతా విజయవాడ, హయత్ ప్లేస్ విజయవాడ, జేడ్ సూట్స్ - లగ్జరీ బోటిక్ హోటల్ ఉన్నాయి. ఇవి పట్టణంలో పేరున్న హోటల్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం ఈ హోటల్స్ లో బార్లు ఉన్నాయి.
నాన్ రీఫండబుల్ చార్జెస్ రూ. 50 నుంచి 20 లక్షలకు తగ్గింపు
ఇక గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లోనూ స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్స్ లో ఉన్న బార్ లైసెన్స్ ఫీజులు కూడా తగ్గుతాయి. రాష్ట్ర వ్యప్తంగా స్టార్ హోటల్స్ కు లైసెన్స్ ఫీజు తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3-స్టార్ లేదా అంతకంటే ఉన్నత హోటళ్లలో ఉన్న బార్‌ల కోసం లైసెన్స్ ఫీజు, నాన్-రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గించింది. 2022-25 కాలానికి బార్ విధానంలో భాగంగా, ఈ హోటళ్లలో బార్‌లకు ఏటా రూ.5 లక్షల లైసెన్స్ ఫీజు, ప్రతి సంవత్సరం లైసెన్స్ ఫీజులో 10 శాతం పెంపు, రూ.50 లక్షల నాన్-రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ నిర్ణయించారు. అయితే ఈ ఫీజులు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని, ఇది రూ. 66.55 లక్షల వరకు ఉందని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) పేర్కొంది.
హాస్పిటాలిటీ రంగం అభివృద్ధి పేరుతో తగ్గిన లైసెన్స్ ఫీజులు
హాస్పిటాలిటీ రంగం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకమని, తక్కువ బార్ లైసెన్స్ ఫీజులు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ హోటళ్లు, అంతర్జాతీయ సందర్శకులు, విదేశీ పెట్టుబడులు, జీఎస్టీ ఆదాయం పెరుగుతాయని APTDC తెలిపింది. దీనిపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ నివేదిక సమర్పిస్తూ, ఫీజుల తగ్గింపు హాస్పిటాలిటీ రంగ వృద్ధి (హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం, బార్‌లు వంటి సేవలతో కూడిన ఆతిథ్య పరిశ్రమలో పెరుగుదల), ఉపాధి అవకాశాలు, రెస్టారెంట్ అమ్మకాలు, కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
త్రీ స్టార్ నుంచి పరిమితులు లేకుండా లైసెన్స్ లు
ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 3-స్టార్ లేదా అంతకంటే ఉన్నత స్టార్ హోటళ్లలో బార్‌ల కోసం కొత్త ఫీజు పాలసీని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఏటా లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలు, నాన్-రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.20 లక్షలుగా నిర్ణయించారు. అంటే సగానికి పైగా ఫీజులు తగ్గాయి. ఈ ఫీజులు హోటల్ ఉన్న ప్రాంత జనాభాతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. అలాగే రాష్ట్రంలో 3-స్టార్ లేదా అంతకంటే ఉన్నత స్టార్ హోటళ్లలో బార్ లైసెన్స్‌ల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదు. ఈ నిర్ణయం రాష్ట్రంలో టూరిజం, హాస్పిటాలిటీ రంగాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఐదేళ్లు, అంతకు ముందు నుంచీ ఉన్న లైసెన్స్ ఫీజులు ఒక్కసారిగా సగానికి పైన తగ్గించడం వెనుక కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకేననే విమర్శలు ఉన్నాయి.