దర్శిలో దరి చేరేదెవరు?

దర్శి అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయాలు ఎవరిని దరి చేరుస్తాయో అంతు చిక్కని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి నాన్‌ లోకల్‌ అనే ఫీలింగ్‌ వచ్చింది.

Update: 2024-04-07 09:18 GMT
Gottipati Lakshmi, Dr. Buchepalli Sivaprasad Reddy

జి విజయ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజక వర్గం రాజకీయాలు తలపండిన పొలిటీషియన్స్‌కి కూడా అంతు చిక్కడం లేదు. ఈ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి?. ఎందుకు ఇప్పటి వరకు నియోజక వర్గ ఇన్‌చార్జిని పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందనేది పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు పూర్తి కాగానే ఓంగోలుకు చెందిన పమిడి రమేష్‌ అనే వ్యక్తిని ఇన్‌చార్జిగా చంద్రబాబు నియమించారు. ఆయనను స్థానికులు వ్యతిరేకించడంతో చేసేది లేక వెనుదిరిగారు. తర్వాత ఓంగోలులోని శ్రీహర్షిణి కాలేజీ కరస్పాండెంట్‌ గోరంట్ల రవికుమార్‌ను ఇన్‌చార్జిగా పెట్టాలనే ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ తర్వాత నాలుగేళ్లుగా నియోజక వర్గానికి టీడీపీ ఇన్‌చార్జీ లేకుండా పోయారు.

సొంత సంక్షేమానికే ..

సిట్టింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ 2019లో మొదటి సారిగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలుపొందారు. ఈయన ఓంగోలులో పేస్‌ విద్యా సంస్థల అధినేత. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కంటే తన సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే విమర్శలను ఎదుర్కొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్‌కు టికెట్‌ ఇవ్వలేదు. ఎంత ప్రయత్నించినా మాజీ డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. దీంతో కినుక వహించిన మద్దిశెట్టి వైఎస్‌ఆర్‌సీపీకి వీడ్కోలు పలికి టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయన వెనుక వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్‌ మాత్రం అనుకున్న స్థాయిలో ఆయనతో పాటు వెళ్లలేదు. అదే పార్టీలోనే.. అలాగే నిలచిపోయింది.

టీడీపీ అభ్యర్థిగా లక్ష్మి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ దర్శి నియోజక వర్గ అభ్యర్థిగా నియమించారు. ఆమె రెండు రోజుల క్రితం మందీ మార్బలంతో దర్శి కేంద్రంలో భారీ ర్యాలీ.. సభను ఏర్పాటు చేశారు. అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఓంగోలు సిట్టింగ్‌ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు నారపుశెట్టి పాపారావుల నేతృత్వంలో సభ జరగడం విశేషం. సభకు వచ్చిన ఓటర్లు దర్శి నియోజక వర్గం కంటే అద్దంకి.. నర్సరావుపే.. ఓంగోలు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువుగా ఉన్నారనే టాక్‌ స్థానికంగా వినిపిస్తోంది.

ఏకమైన టీడీపీ శ్రేణులు

దర్శి టీడీపీ అభ్యర్థి.. మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు కుమార్తె లక్ష్మికి అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బాబాయి అవుతారు. మార్టూరు అసెంబ్లీ నియోజక వర్గంగా ఉన్నప్పుడు లక్ష్మి తండ్రి గొట్టిపాటి నరసయ్య ముండ్లమూరు మండలం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారు. గొట్టిపాటి నరసయ్య చనిపోయినా ఆయనపై ఆ మండల ప్రజల్లో సానుభూతి ఉంది. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌కు కూడా ముండ్లమూరు మండలం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ముండల్లమూరు మండలం దర్శి నియోజక వర్గంలో ఉంది. ఇది టీడీపీ అభ్యర్థి లక్ష్మికి ప్లస్‌ పాయింట్‌గా చెబుతున్నారు. నియోజక వర్గంలో తండ్రి నరసయ్య సానుభూతిని ఉపయోగించుకొని.. దర్శిలో పార్టీ క్యేడర్‌తో పాటు ఇతర పార్టీ ఓటర్లును కూడా ఆకట్టుకునేందుకు లక్ష్మి ప్రయత్నిస్తున్నారు.

చెక్కు చెదరని టీడీపీ ఓటు బ్యాంకు

నాలుగేళ్ల పాటు దర్శి నియోజక వర్గానికి టీడీపీ ఇన్‌చార్జీ లేకపోయినా.. పార్టీ కార్యకర్తలను పలకరించేవారు లేకపోయినా.. కార్యకర్తలు, క్యేడర్‌ మాత్రం పట్టు వీడి పక్కకు పోకుండా టీడీపీలోనే కొనసాగడం విశేషం. నియోజక వర్గంలో సుమారు 2.23 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లలో సుమారు లక్ష ఓట్ల వరకు టీడీపీకి.. 1.10లక్షల ఓట్ల వరకు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే సుమారు 22వేలు బలిజలు, 26వేలు కమ్మ, 40వేలు రెడ్డి, 45వేలు ఎస్సీలు, 8వేలే ఆర్యవైశ్యులు, మిగిలిన కులాలతో కలిపి మొత్తం ఓటర్లున్నారు. కమ్మ.. రెడ్డి ఓట్లు ఎక్కువుగా ఉన్నందున ఏ కులం వారు ఆ కులం నాయకులకు ఓట్లు వేస్తారా అంటే అది జరిగే పని కాదని రాజకీయ పరిశీలకు వ్యాఖ్యానించడం విశేషం.

ప్యాకేజీలకు అలవాటు పడ్డారనే ఆరోపణలు

జనసేన నాయకుడు కానీ.. తెలుగుదేశంలోని కొందరు ముఖ్య నాయకులు కానీ అధికార.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వద్ద ప్యాకేజీలు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో నియోజక వర్గంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కూడా ఎన్టీఏలో భాగస్వామి కావడం.. అదే కూటమిలో టీడీపీ జనసేనలు జతకట్టడం వల్ల ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థి నుంచే నాయకులుగా చెప్పుకుంటున్న వారు ప్యాకేజీల రూపంలో భారీ మొత్తంలో లాగారనే ఆరోపణలు వచ్చాయి. మేము కష్టపడి ఐదేళ్లుగా జెండాను మోస్తుంటే మధ్యలో వచ్చిన వారు ప్యాకేజీలు తీసుకొని ఎవరి దారిన వారు పోతే మా బతుకుల్లో వెలుగులు వచ్చే దారి ఎటుందనే ఆవేదన కార్యకర్తల్లో బలంగా ఉంది.

Tags:    

Similar News