ఆధిపత్యం ఎవరిది? అదృశ్యమయ్యే నేత ఎవరు

ఆ రెండు కుటుంబాలు సపక్షంలోనే విపక్షం. ఇప్పుడూ రాజకీయ ప్రత్యర్థులే. ఈ ఎన్నికల తర్వాత ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఎవరు? రాజకీయంగా తెరమరుగయ్యే కుటుంబం ఏది!?

Update: 2024-04-13 03:00 GMT
పోటీకి సిద్ధమవుతున్న పెద్దిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఆధిపత్య పోరుకు ప్రస్తుత ఎన్నికలు అన్నమయ్య జిల్లాలో ( చిత్తూరు- కడప) రెండు కుటుంబాల మధ్య పోటీకి సాక్షి సంతకం చేశాయి. గతంలో ఆ ఇద్దరు నేతలు స్వపక్షంలోనే విపక్షంగా కత్తులు దూసుకున్నారు. వారిద్దరి కుటుంబాల నుంచి ఈ ఎన్నికల్లో ముఖాముఖి పోరాటానికి దిగుతున్నారు. అధికార పార్టీ నుంచి మంత్రి ఆయన సోదరుడు, కుమారుడు... కూటమిలోని వేరువేరు పార్టీల నుంచి అన్నదమ్ములు ఇద్దరు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఏదో ఒక కుటుంబానికి విశ్రాంతి ఇచ్చే అవకాశం లేకపోలేదు అనేది ఎన్నికల పరిశీలకుల అంచనా. చిత్తూరు - కడప ఉమ్మడి జిల్లాల నుంచి వేరుచేసి, ఏర్పడిన అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు స్థానం పరిధిలో ఈ పరిస్థితి ఏర్పడింది.

 

గతాన్ని ఒకసారి పరిశీలిస్తే... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు తో ఎంత దూరమో.. మాజీ సీఎం రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే కూడా అంతే వైరం ఉంటుంది. రాజకీయంగా వారిద్దరితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ మాత్రం పొసగదు. మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం, బిజెపి జాతీయ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ బడిలోనే ఓనమాలు దిద్దుకున్నారు. చిత్తూరు జిల్లాలో తన ఆధిపత్యం చాటుకోవడంలో సమక్షంలోనే ఉన్న నేతలను ఎదిరించడంలో, కట్టడి చేయడంలో దిట్ట అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జిల్లాలోని నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపిలో కూడా అదే పరిస్థితి. ప్రస్తుత వార్తలకు వస్తే...

ఉమ్మడి జిల్లాల విభజన..

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, మదనపల్లి, తంబళ్ళపల్లె, పీలేరు నియోజకవర్గాలను విడదీశారు. కడప జిల్లాలో రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గం వేరు చేశారు. వీటన్నిటినీ కలుపుతూ రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ రాజంపేట పార్లమెంటు కేంద్రాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ జిల్లా పైన కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆధిపత్యం కొనసాగిస్తోంది.. ఎలా అంటే..

పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

కొత్తగా ఏర్పాటుచేసిన అన్నమయ్య జిల్లా పరిధిలోని నియోజకవర్గాలపై కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై చేయి సాధించారు. ఆ గుప్తాధిపత్యం సాధించే దిశగా.. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం చేస్తున్నారు. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ముగ్గురు 2024 ఎన్నికలకు కూడా అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరికి మదనపల్లి, రాయచోటి, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదరణ లభిస్తుంది. రాయచోటి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థులే సిట్టింగ్‌లుగా ఉన్నారు. దీనికి తోడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో అంతర్గతంగా వైరుధ్యం ఉన్నప్పటికీ, పెద్దిరెడ్డి అత్తగారి ప్రాంతం రాయచోటి. ఈ ఎన్నికల్లో వీరి పరిస్థితి ఇలా ఉంటే..

 

వేర్వేరు పార్టీల నుంచి..

నల్లారి సోదరుల పోటీ

చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా) పరిధిలోని వాల్మీకిపురం (ప్రస్తుతం పీలేరు) నియోజకవర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం రాజకీయంగా నాలుగు దశాబ్దాలకు పైగానే చక్రం తిప్పుతోంది. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్సిపి ఏర్పాటు తర్వాత రాజకీయంగా నల్లారి కుటుంబానికి మబ్బులు అడ్డం వచ్చాయి. నల్లారి సోదరులు కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి దారులు పార్టీలు కూడా వేరయ్యాయి. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి జాతీయ కార్యదర్శిగా రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి అదృష్ట పరీక్షకు సిద్ధమయ్యారు.

అప్పుడు స్వపక్షంలో ప్రతిపక్షంగా మెలిగిన పెద్దిరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాలు ఈ ఎన్నికల్లో వేరువేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి, టిడిపి- బిజెపి - జనసేన కూటమి అభ్యర్థుల తీరును ఒకసారి పరిశీలిస్తే..

కూటమికి టిడిపి ఓట్లే కీలకం

కూటమి మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు నేపథ్యంలో బిజెపి అభ్యర్థి రెండోసారి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసి ఓటమి చెందారు. 2024 ఎన్నికలకు సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై బిజెపి కార్యదర్శి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి టిడిపి నుంచి దక్కే ఓట్లే కీలకమని భావిస్తున్నారు. బిజెపి క్యాడర్, అనుబంధ సంఘాల నాయకులు బహిరంగంగా తక్కువే అయినప్పటికీ.. వ్యూహం అమలులో కీలకంగా ఉంటారు. టిడిపి, జనసేన ఓటర్లే ప్రధాన ఆదరువు.

రాజంపేట అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఆయన అనుచర వర్గం టిడిపిలో చేరడం బిజెపికి లభించే అంశంగా భావిస్తున్నారు. రైల్వే కోడూరు శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీకి ఉపశమనం కలిగించిందని భావిస్తున్నారు. ఇక్కడ కూడా కూటమి ఓట్లు బిజెపికి కాస్త ఊరట. రాయచోటిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహిత మిత్రుడే. దీనికి తోడు టిడిపిలో బలిజ సామాజిక వర్గం, టిడిపి క్యాడర్ సహకారం ఏమాత్రం ఉంటుందనేది అంచనా వేస్తున్నారు.

 

పీలేరు నియోజకవర్గంలో స్వయానా తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తుండడం, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే, సీఎంగా ప్రాతినిధ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డికి కలిసివచ్చే లాభంతో పాటు పదేళ్ల ఎడబాటు తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఏకం కావడం, సంగీతం ఆ ప్రాంతంలో బలంగా వెళ్లడం కూడా కాస్త పరిస్థితి చక్కనిది కోవడానికి మార్గం ఏర్పడింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు టిడిపి టికెట్ నిరాకరించి, దాసర్ల పల్లె జయచంద్రారెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇక్కడ తిరుగుబాటు ధోరణలో ఉన్న జయశంకర్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డికి క్రాస్ ఓటింగ్‌తో మేలు జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆయనే పోటీలో ఉన్నారు. దీనివల్ల పెద్దిరెడ్డి కుటుంబానికి తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానం కూడా ప్రతిష్టాత్మకమైనదే.

మదనపల్లి శాసనసభ స్థానంలో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషాకు టిడిపి టికెట్ దక్కింది. ఇక్కడి నుంచి అభ్యర్థిత్వం ఆశించి భంగపడిన టిడిపి మాజీ ఎమ్మెల్యే దోమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ గంగారపు రామదాసు చౌదరిగా ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సహకారం అందించమని చెబుతున్న వారిద్దరూ.. బిజెపికి మద్దతుగా నిలుస్తామని ఈ పార్టీకే ప్రకటించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి శరాఖాతమైనా, ఎంపీ అభ్యర్థికి సహకారం అందే పరిస్థితి ఉంది. అత్యంత కీలకమైన పుంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కూడా పోటీలో ఉండబోతున్నారు. దీనివల్ల కూటమి నుంచి రంగంలో నిలిచే టిడిపి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు నమోదయ్యే ఓట్లు తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. " ఈ సీట్లో ఎంపీగా అధిక ఓట్లు సాధించి నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బహుమతిగా ఇస్తా" అని రాజంపేట వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గతంలోనే శపథం చేశారు.

విజయం ధీమా

రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మళ్ళీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రచారానికి రానని భీష్మించడం. వైఎస్ఆర్సిపి టిడిపికి తరలిపోవడం వల్ల నష్ట నివారణ చర్యలకు కూడా ఆస్కారం లేకుండా పోయింది.

 

ఆ సంఘటన ఇంకా మెదులుతోంది..!

రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీకి పెద్దిరెడ్డి ద్వారా కాంట్రాక్టుల ద్వార లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నప్పటికీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు తగిలిన ఎదురు దెబ్బను ఆయన వర్గీయులు ప్రధానంగా దళిత నాయకులు మరిచిపోలేదని సమాచారం. మళ్లీ విడత మంత్రివర్గ విస్తరణలో చివరి వరకు జాబితాలో పేరు ఉన్నప్పటికీ కొరముట్ల శ్రీనివాసులు స్థానంలో.. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామికి మంత్రి పదవి దక్కడం వెనుక పెద్దిరెడ్డి హస్తమే ఉందనేది అప్పట్లో బహిరంగంగా వినిపించిన ఆరోపణ. పెద్దిరెడ్డి వల్లే తనకు మంత్రి పదవి దక్కకుండా పోయిందని సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తన సన్నిహితుల వద్ద అనేకసార్లు కలత చెందారని చెబుతుంటారు.

రాయచోటిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి వైఎస్ఆర్సిపిలోకి తీసుకురావడంలో వీధిన్ రెడ్డి చక్రం తిప్పారు. తంబళ్లపల్లెలో బాబాయ్ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తుండడం, అభిమాన విధేయులు ఎక్కువగానే ఉండడం, టిడిపి అసంతృప్తి వర్గం సహకారం మరింత లభిస్తుందనేది అంచనా. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తన తండ్రి పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించడం, ఆ ప్రాంతంలో కూడా మంచి పట్టు ఉందనేది, సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నుంచి కూడా బలం లభిస్తుందని భావిస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రత్యేకంగా అనుచర వర్గం, గా ఉండడం కూడా పార్లమెంటు అభ్యర్థికి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక పుంగనూరు నియోజకవర్గంలో తమకు తిరుగు ఉండదనేది ధీమా. ఈ నియోజకవర్గంలో సూసైడ్ స్క్వాడ్ లాంటి అభిమానులు, నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తారనేది పరిశీలకుల అంచనా.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు, నల్లారి కుటుంబం నుంచి సోదరులు ఇద్దరు ఎమ్మెల్యే, అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘంగా ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎవరి వ్యూహాలు, ఎత్తుగడల్లో వారు సమీకరణలకు సమాయత్తమయ్యారు. ఎన్నికల తర్వాత ఈ కుటుంబంలో ఈ రెండు కుటుంబాల్లో ఒక బ్యాచ్ అయితే రాజకీయంగా తెరమరుగు అయ్యే పరిస్థితి లేకపోలేదనేది.. అత్యంత సామీప్యంగా గమనించే రాజకీయ విశ్లేషకుల అంచనా. అనుకున్న గడువు సమీపిస్తోంది. వీరి రాజకీయ తలరాతకు ఓటర్లు ఎలాంటి ఆశీర్వాదం ల, ముగింపు ఇవ్వనున్నారు అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News