విశాఖ డ్రగ్స్ కేసు.. సీబీఐ ఎఫ్‌ఐ‌ఆర్‌లో నిందితుల పేర్లు ఎక్కడ?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ డ్రగ్ కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. కంటైనర్ లో వచ్చింది డ్రగ్గేనని సిబిఐ అధికారుల దర్యాప్తులో తేలింది.

Update: 2024-03-24 11:16 GMT
Source: Twitter

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఢిల్లీ.. సీబీఐ కార్యాలయం.. ఇంటర్పోల్ నుంచి కాన్ఫిడెన్షియల్ నోట్.. బ్రెజిల్ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు దాని సారాంశం. ఈ ఒక్క చిన్న టిప్ ఓ అంతర్జాతీయ డ్రగ్ డీలింగ్ గుట్టురట్టు చేసింది. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు విశాఖపట్నం బయలుదేరారు. 'ఆపరేషన్ గరుడ' పేరుతో దాడులు నిర్వహించారు. విశాఖ పోర్టుకు చేరిన మాదకద్రవ్యాలతో నిండిన ఓ కంటైనర్‌ను సీజ్ చేశారు. కంటైనర్‌ను ఓపెన్ చేయగా...అందులో 25 వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ పౌడర్ (dried yeast power) బయటపడింది. ఈ బస్తాల నుంచి నమూనాలను సేకరించిన సీబీఐ అధికారులు నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్(ఎన్సీబీ) ద్వారా పరీక్షలు నిర్వహించగా డ్రైడ్ ఈస్ట్ పౌడర్‌లో మాదకద్రవ్యాలు కలిసి ఉన్నాయని ప్రాథమికంగా తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు సేకరించిన 49 నమూనాలను పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.


ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది..

సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణ వివరాలు.. ఈ కంటైనర్‌ను బుక్ చేసిన సంధ్య ఆక్వా పై ఎఫ్‌ఐఆర్ (Fir no. RC.2202024E0004....20.3.2024.. న్యూఢిల్లీ పీఎస్) నమోదు చేసి సంస్థ ప్రతినిధులను ప్రశ్నించడంతో పాటు పలుచోట్ల దాడులు, తనిఖీలు నిర్వహించారు. బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో వచ్చిన డ్రై ఈస్ట్ బస్తాల్లో 49 నమూనాలను సేకరించి నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షలు నిర్వహించారు. ఎన్‌సి‌బి ద్వారా టెస్ట్ ఏ,బీ,ఇ లను చేయగా... కోకైన్, హెరాయిన్, ఓపియం, మార్ఫిన్ వంటి డ్రగ్స్ నమూనాలు దొరికాయని సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అనంతరం ఈ నమూనాలలో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సీబీఐ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో కంటైనర్‌లో వచ్చిన 25 వేల కేజీల డ్రై ఈస్ట్ పౌడర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్టు తేలిపోయింది. అయితే ఇవి ఎంత మొత్తంలో ఉన్నాయి. వీటి విలువ ఎంత అనేది తేలాల్సి ఉంది. బ్రెజిల్ నుంచి ఏ కంపెనీ వీటిని పంపిందో ఆరా తీస్తున్నారు. ఎఫ్ఐఆర్‌లో సంధ్య ఆక్వా కంపెనీ అండ్ సమ్ అదర్స్ (మరికొందరు) అని రాశారే తప్ప కంపెనీ యజమానుల పేర్లు ఏవీ రాయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

సినీ పక్కిలో డ్రగ్స్ సరఫరా…

విశాఖపట్నం పోర్టులో భారీ మొత్తంలో దొరికిన డ్రగ్స్ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. తనిఖీ అధికారుల కళ్ళు కప్పేందుకు డ్రగ్ ముఠా వాడిన ప్రక్రియ సినీ పక్కిలో ఉంది. డ్రైడ్ ఈస్ట్ పౌడర్‌లో ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను డ్రగ్ మాఫియా సరఫరా చేస్తుంది. ఇంటర్పోల్ సమాచారంతో ఇండియాలో ఈ రాకెట్ బట్టబయలు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఇలాంటి వ్యవహారం కొనసాగుతుందనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇండియాలో వెలుగు చూసిన వ్యవహారంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. డ్రై ఈస్ట్‌లో మిక్స్ చేసి సరఫరా చేసే ఈ మాదకద్రవ్యాలను గమ్యస్థానానికి చేరిన తర్వాత కెమికల్ ప్రాసెస్ ద్వారా వేరు చేసి సరఫరా చేస్తారు. ఈ డ్రగ్ సరఫరా వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా హస్తం ఉన్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణను ముమ్మరం చేసింది.

అసలు ఎఫ్ఐఆర్‌లో ఏముంది..

సీబీఐ ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి ఇంటర్పోల్ నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ వచ్చింది. విశాఖ పోర్టులో అన్లోడ్ చేసిన నెంబర్..SEKU4375380 కంటైనర్‌ను సీజ్ చేశారు. అందులో ఉన్న 25 వేల కేజీల డ్రై ఈస్ట్ పౌడర్‌ను తనిఖీ చేశారు. కంటైనర్‌ను బుక్ చేసిన సంధ్య ఆక్వా ఫామ్ ప్రతినిధులు, పోర్ట్ ట్రస్ట్ అధికారులు, కస్టమ్స్ అధికారుల సమక్షంలో డ్రై ఈస్ట్ బస్తాలను బయటకు తీసి తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత nyxu _0823944 నెంబర్ గల మరో కంటైనర్‌లో తనిఖీ చేసి డ్రై ఈస్ట్ బస్తాలను మార్చారు. నార్కోటిక్ డిటెక్షన్ కిట్ (ncb) ద్వారా ఏబీఈ పరీక్షలను నిర్వహించి డ్రై ఈస్ట్ పౌడర్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 29 డెడ్ విత్ 8,23,38 ల ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పైన, మరికొందరి పైనా కేసు నమోదు చేశారు. (నిందితుల పేర్లు మాత్రం ఎఫ్ఐఆర్‌లో లేవు) సీబీఐ అధికారులు ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచారు.

Tags:    

Similar News