ఎచ్చెర్ల సీటును 'బాబు' కావాలనే వదులుకున్నారా?

మిత్ర ధర్మం బెడిసి కొడుతుందా...? గెలవాల్సిన స్థానాన్ని టీడీపీ ఎందుకు చేజార్చుకుంది...? సిక్కోలులో వేడెక్కుతున్న రాజకీయం.

Update: 2024-04-01 09:11 GMT
చంద్రబాబు

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: తనకు మాలిన ధర్మం పనికిరాదన్నది నానుడి... టీడీపీ బలమున్న చోట పోటీ చేయకుండా ఆ స్థానాన్ని జట్టు పార్టీకి కేటాయించింది. గెలిచే స్థానాన్ని చంద్రబాబు ఎందుకు వదులుకున్నారు? బీజేపీకి ఆ స్థానాన్ని ఎందుకు కట్టబెట్టారు? అనేది సిక్కోలు రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. సిక్కోలు రాజకీయాలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంపై జిల్లా టీడీపీలో రచ్చ సాగుతోంది...మెజారిటీ ఓటర్లైన తూర్పు కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎచ్చెర్ల నుంచి కిమిడి కళా వెంకట్రావును పక్క జిల్లాకు తరలించడంపై కూడా తెలుగు తమ్ముళ్లు గుర్రు మంటున్నారు.

కూటమిలో ఎచ్చెర్ల చిచ్చు...

తెలిసి చేశారో.. తెలియక చేశారో.. తప్పని తెలిసినా తప్పక చేశారో... తెలియదు కానీ కొన్ని నియోజకవర్గాల విషయంలో మిత్ర ధర్మం బెడిసి కొడుతోంది. సిక్కోలు జిల్లాలో సీట్ల సర్దుబాటు టీడీపీ స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయం ఆయా పార్టీల నేతల్లో చిచ్చు రేపింది. టీడీపీకి పూర్తి బలమున్న ఎచ్చెర్లను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో టీడీపీ క్యాడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 'టీడీపీ అధినేత చంద్రబాబు రాంగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్ షేర్ కూడా లేని బీజేపీకి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని కేటాయించడం ఒక వ్యూహాత్మక తప్పిదం' అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఓట్ల బదిలీ జరుగుతుందా...

ఎచ్చెర్ల నియోజకవర్గం ఆది నుంచి టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి సీనియర్ నేత కళా వెంకట్రావు పలుమార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో తూర్పు కాపులు ఎక్కువని తెలిసినా..కమ్మ సామాజికవర్గానికి...అందునా బీజేపీకి టిక్కెట్టు కేటాయించడం పట్ల కూటమి స్ట్రాటజీ ఏంటో అర్థం కావడం లేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1,75,513 మంది ఓటర్లు ఉండగా... తూర్పు కాపు 35 వేల మంది, రెండో స్థానంలో ఎస్సీ కులాలు 15 వేల మంది... మూడో స్థానంలో కాళింగ సామాజిక వర్గ ఓటర్లు 13 వేల మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లైన తూర్పు కాపును కాదని కేవలం రెండు శాతం ఓట్లు కలిగిన కమ్మ సామాజిక వర్గానికి ఆ సీటు కేటాయించడం పట్ల తూర్పు కాపులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

'తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న ఎచ్చర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరరావు చేత పోటీ చేయిస్తుండటం ఒక మైనస్ అయితే.. అది కూడా బీజేపీ నుంచి కావడం మరో మైనస్' అని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే చెబుతున్నారు. బీజేపీకి సీటు కేటాయించడంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన నుంచి ఓటు ట్రాన్స్‌ఫర్ అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

నియోజకవర్గం హిస్టరీ...

ఎచ్చెర్ల నియోజకవర్గం ఉణుగూరు నియోజకవర్గంలో ఉండేది. 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1983, 1985, 1989, 2004 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా… 2014లో కిమిడి కళా వెంకట్రావు... గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తూర్పు కాపుకు చెందిన కిరణ్ కుమార్ పోటీ చేస్తుండగా... కూటమి తరపున బీజేపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎన్ ఈశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నారు.

అసంతృప్తిలో 'కిమిడి' ...

ఎచ్చెర్ల తన సొంత నియోజకవర్గం నుంచి టికెట్ దక్కక పోవడంతో కిమిడి కళా వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఆదేశించిన మేరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేస్తున్న కారణంగా ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తమ్ముడు కొడుకు నాగార్జునకు అన్యాయం జరిగిందని మధన పడుతూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుపడవలసి వస్తుందని వాపోతున్నారు. దీనికంతటికీ కారణం అచ్చెన్నాయుడు అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

లోకల్... నాన్ లోకల్....

ఎచ్చెర్ల నియోజకవర్గంలో లోకల్-నాన్ లోకల్ పోరు సాగుతోంది. వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ స్థానికులు కాగా.... బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు నాన్ లోకల్. వలస నేతను తెచ్చి ఎచ్చెర్ల జనాలపై రుద్దితే టీడీపీ కంచుకోటకు బీటలు తప్పవని పార్టీ నేతలే చెబుతున్నారు. టీడీపీ అధిష్టానం చేసిన పనికి రాజాం నియోజకవర్గం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ అభ్యర్థి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఆయనకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News