పోర్టులోనే డ్రగ్ కంటైనర్ నిలిచిపోయిందేందుకు...?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్ కంటైనర్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ డ్రగ్స్‌తో నిండిన ఈ కంటైనర్ పోర్ట్ నుంచి కదల్లేదు ఎందుకు...?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: విశాఖ పోర్ట్‌లో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు ఆపరేషన్ గరుడ పేరుతో విశాఖపట్నం పోర్టుకు చేరిన డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ దిగుమతి చేస్తున్న కంటైనర్‌ను సీజ్ చేశారు. డ్రై ఈస్ట్ శాంపిళ్లను పరీక్షించిన సీబీఐ దీనిలో మాదకద్రవ్యాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఎంత మొత్తంలో డ్రగ్స్ కలిశాయో తెలుసుకునేందుకు నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(CFSL)కి పంపించింది.
సీజ్ చేసిన కంటైనర్ మాత్రం ప్రస్తుతం విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (PCTPL)ఎగ్జామినేషన్ పాయింట్‌లో ఉంది. అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునే ప్రదేశానికి కంటైనర్‌ను తరలించాలని తొలుత భావించిన సీబీఐ ప్రస్తుతం పోర్టులో ఉన్న బెర్తులో సౌకర్యాలు లేకపోవడంతో మరిన్ని రోజులపాటు ఈ కంటైనర్‌ను పీసీటీపీఎల్‌లో ఉంచాలని నిర్ణయించింది.ఈ మేరకు కస్టమ్స్ అధికారులకు లేఖ రాసింది. సీబీఐ అభ్యర్థన మేరకు ఈ కంటైనర్‌ను మరికొన్ని రోజులు విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో కస్టమ్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.
ముమ్మర దర్యాప్తు...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, రాజకీయ దుమారం రేపిన విశాఖ కంటైనర్ డ్రగ్ కేసును సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిందితులుగా భావిస్తున్న సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. సంస్థ యాజమాన్యంతో పాటు అందులో పనిచేసే సిబ్బందిని కూడా విచారించింది. సీబీఐ అధికారులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఓ సీబీఐ బృందం బ్రెజిల్‌కు కూడా వెళ్ళింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, బ్రెజిల్‌కు నగదు లావాదేవీలపై ఇప్పటికే ఆరా తీశారు. బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్‌లోడు కంటైనర్‌తో బయలుదేరిన నౌక ఏయే ఓడరేవుల్లో ఆగింది. అక్కడ ఎగుమతి దిగుమతులు ఏమైనా జరగయా అన్న కోణంలో కూడా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక జర్మనీలో రెండు రోజుల పాటు ఎందుకు ఆగింది అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. రొయ్యల ఆహార తయారీ యూనిట్ల యాజమాన్యాలతోనూ సంప్రదింపులు జరిపి సీ ఫుడ్ కంపెనీలు డ్రై ఈస్ట్ ఏ స్థాయిలో ఉపయోగిస్తారు, ఎగుమతి, దిగుమతులు ఎక్కడెక్కడ నుంచి అవుతాయి, మన దేశంలో ఎంత వరకు దిగుమతి చేసుకుంటారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించే దిశగా సీబీఐ అడుగులు వేస్తోంది. కేసు విచారణలో ఉన్నందున విశాఖను వదిలి ఎక్కడికి వెళ్లరాదని సంధ్య ఆక్వా ప్రతినిధులకు సీబీఐ ఆంక్షలు విధించింది.
నిర్ధారణకు మరిన్ని రోజులు...
విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో సీజ్ చేసిన కంటైనర్‌లో 25 వేల కేజీల డ్రై ఈస్ట్ పౌడర్‌లో మాదకద్రవ్యాలు కలిసినట్టు సీబీఐ ప్రాథమిక విచారణలో బయటపడింది. డ్రై ఈస్ట్ బస్తాల నుంచి సేకరించిన పౌడర్ శాంపిళ్లను నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్(NCB) ద్వారా పరీక్షించిన సీబీఐ అధికారులు మాదకద్రవ్యాలు ఉన్నట్టు నిర్ధారించారు. పూర్తిస్థాయిలో నిర్ధారణ, ఎంత మొత్తంలో ఏయే డ్రగ్స్ మిక్స్ అయ్యాయన్న దానిపై స్పష్టత కోసం సేకరించిన శాంపిళ్లను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నుంచి నివేదికలు అందే వరకు విశాఖలోని డ్రగ్ కంటైనర్ ఉంచేందుకు సీబీఐ నిర్ణయించింది.