RRR Case | ఆయన వంటిపై గాయాల్లేవని ఎందుకు నివేదిక ఇచ్చారు?

కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన గుంటూరు ప్రభుత్వాస్పత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతికి అధికారులు ఓ షాక్ ఇచ్చారు.;

Update: 2025-04-08 02:45 GMT
Raghuramakrishna Raju
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు (RRR Case) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన గుంటూరు ప్రభుత్వాస్పత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతికి అధికారులు ఓ షాక్ ఇచ్చారు. RRR Caseలో రఘురామ కృష్ణ రాజు వంటిపై గాయాలు లేవంటూ ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదికపై వివాదం రాజుకుంది. ఇప్పుడా వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె ఏప్రిల్ 7న ఒంగోలులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందని సీఐడీ అధికారులు- ఆమెను అన్నీ గుర్తు చేసుకుని తిరిగి ఏప్రిల్ 8న అంటే మంగళవారం విచారణకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ప్రభావతి ముందస్తు బెయిల్‌ పిటిషన్ పెట్టుకున్నా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆమె విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ సాగింది. ఆమెను అడిగిన ఏ ప్రశ్నకూ పోలీసులకు సరైన సమాధానం రాలేదు.
‘ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు.. అంతా మరిచిపోయా.. రికార్డులు చూస్తేనే ఏ విషయమైనా చెప్పగలను. అంతకుమించి నేనేం చెప్పలేను..’ అని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.
ప్రభావతి తన కుటుంబీకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం ఎస్పీ దామోదర్‌ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ఎదుట ఆమె మళ్లీ హాజరయ్యారు. రఘురామకృష్ణరాజుకు సీఐడీ కస్టడీలో గాయాలపై వైద్య నివేదిక కోసం హైకోర్టు సూచనల మేరకు కమిటీలో సీనియర్‌ వైద్యులను నియమించాల్సి ఉండగా.. "మీరెందుకు జూనియర్‌ డాక్టర్లకు స్థానం కల్పించారు? రఘురామను పరీక్షించడానికి కార్డియాలజిస్టును పంపించింది ఎవరు? ఏదైనా కేసులో ఎవరికైనా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలంటే మీరు పాటించాల్సిన మార్గదర్శకాలు ఏంటి? ఈ కేసులో అవన్నీ పాటించారా?" అని ఆమెను విచారణ అధికారి ప్రశ్నించారు. దానికి ఆమె నుంచి ఎటువంటి జవాబు రాలేదు. గుర్తు లేదు అని మాత్రమే చెప్పారు.
రఘురామపై గాయాలు ఉన్నప్పటికీ ఆయన్ను కస్టడీలో సీఐడీ అధికారులు హింసించలేదని నివేదిక ఎలా ఇచ్చారు? మీరు ఆ నివేదికను పూర్తిగా పరిశీలించారా, ఆ తర్వాతే జారీ చేశారా? అటువంటి నివేదిక ఇవ్వాలని మీపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? తదితర 20 ప్రశ్నలను దర్యాప్తు అధికారులు ఆమెను అడిగారు. వాటికి ముక్తసరిగా స్పందించిన ప్రభావతి.. తనకు ఏమీ గుర్తులేవని, రికార్డులు చూస్తేనే చెప్పగలనని సమాధానం ఇచ్చారు. రాత్రి 8.45 గంటల సమయంలో విచారణ ముగిసింది.
దీంతో విచారణ అధికారులు ఆమెను అన్నీ గుర్తు చేసుకుని మంగళవారం విచారణకు హాజరుకావాలని చెప్పారు. ప్రభావతి ఎవరి ప్రభావంతోనో తప్పుడు నివేదిక ఇచ్చారని రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. కోర్టుకు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఆమెను విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయన్నారు. దీంతో ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం కింది నుంచి పైకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టి వేస్తూ ఏప్రిల్ 7, 8 తేదీలలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Tags:    

Similar News