కృష్ణ తేజ IAS, ఏమిటాయన విశేషం

కృష్ణ తేజ ఎవరు? పవన్‌ కళ్యాణ్‌ వద్ద ఓఎస్‌డీగా ఎందుకు పనిచేయాలనుకున్నారు? ఐఏఎస్‌ అయి ఉండీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-06-21 12:54 GMT

సివిల్స్‌లో ర్యాంకు సాధించి కేరళ రాష్ట్ర క్యాడర్‌కు ఎంపికైన మైలవరపు కృష్ణ తేజ ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై రావాలనుకున్నారు. అందులోనూ డిప్యూటీ సీఎం కె పవన్‌ కళ్యాణ్‌ వద్ద ఓఎస్‌డీగా ఎందుకు పనిచేయాలనుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌కు కృష్ణ తేజ ఎలా తెలుసు. ఈయన ఇంజనీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌ వైపుకు ఎందుకు వెళ్లారు. సర్వీస్‌ చేయాలనే ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కృష్ణ తేజ సొంత గడ్డపై కొన్ని ఏళ్లయినా సేవ చేయాలనే ఆలోచనకు వచ్చారు. అందులోనూ పవర్‌ఫుల్‌ సినీ హీరో, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వద్ద పనిచేయడం ఎంతో అదృష్ణంగా కృష్ణ తేజ భావిస్తున్నట్లు సమాచారం.

ఏపీకి డిప్యుటేషన్‌పై కృష్ణ తేజ
కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా విధుల్లో ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను రెండు రోజుల క్రితం సచివాలయంలో ఆయన కలిసారు. పవన్‌ కళ్యాణ్‌ కృష్ణ తేజ గురించి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యుటేషన్‌పై కృష్ణ తేజను ఏపీకి పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కృష్ణ తేజ ఏపీకి వచ్చే అవకాశం ఉంది.
కృష్ణ తేజ సొంత ఊరు ఎక్కడో తెలుసా..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరి పేట సొంత ఊరు. ఈయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. తల్లిదండ్రులు చిలకలూరిపేట వారే. తండ్రి మైలవరపు శివానందకుమార్‌ వ్యాపారం చేస్తారు. తల్లి భువనేశ్వరి గృహిణి. తేజ తాత రామానందం. ఆయన చిలకలూరిపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురి ప్రశంసలు పొందారు. ఆ కుటంబ వారసునిగా కృష్ణ తేజకు కూడా సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం. చదువులోనూ ఎప్పుడూ ముందుండే వారు. ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రధానమైన పట్టణాల్లో పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం జీతం డబ్బుల కోసమేనని, సేవలు చేసేందుకు పనికి రాదని గుర్తించారు.
ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌...
ఉద్యోగం వదిలేసి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కోచింగ్‌ పూర్తయింది. సివిల్స్‌ పరీక్షలు రాసి దేశంలో 66వ ర్యాంకు సాధించారు. 2015 బ్యాచ్‌కి చెందిన కృష్ణ తేజకు కేరళ క్యాడర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌పై అభిమానం ఉన్నా కేరళ వెళ్లక తప్పలేదు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్‌లో అలెప్పీ జిల్లా సబ్‌ కలెక్టర్‌ గా నియమితులయ్యారు. చాలా తక్కువ సర్వీస్‌ లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు.
విజయవాడ అల్లుడు..
విజయవాడలోని ప్రముఖ ఆడిటర్‌ పి సుబ్బరాయుడు కృష్ణ తేజ మామ. సుబ్బరాయుడు కుమార్తె రాగదీపను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు. ఒకరి పేరు రిషిక్‌ నంద, మరొకరి పేరు రామ్‌ నంద. ప్రస్తుతం వీరిద్దరూ చిన్న పిల్లలు. భార్య రాగదీప చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సుబ్బరాయుడు విజయవాడలో పేరున్న ఆడిటర్‌. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సుబ్బరాయుడు పాల్గొంటుంటారు.
పవన్‌ కళ్యాణ్‌ను ఎలా ఆకర్షించారు..
ఆయన కెరీర్‌లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన, పవన్‌ కళ్యాణ్‌ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం.
ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌. పవన్‌ కళ్యాణ్‌ ఏరికోరి కేరళ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకోవడం ఆసక్తిని రేపుతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ 2015 సివిల్స్‌ విజేత.
ఆపరేషన్‌ కుట్టునాడు
2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల భారిన పడిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణ తేజకు అదే ఫస్ట్‌ పోస్టింగ్‌. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాతయనే ముందస్తు సమాచారం సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణ తేజకు అందింది. అంతగా అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్‌ పైనో, ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి రాజకీయనాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు. కానీ కృష్ణ తేజ ఆపరేషన్‌ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను 48గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణ తేజ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసే లోపే స్థానిక యువతతో కలిసి 48గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్‌ కుట్టునాడు సూపర్‌ సక్సెస్‌. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కృష్ణ తేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్‌ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్యూ్క ఆపరేషన్స్‌లో ఒకటిగా కుట్టునాడు నిలిచింది.
ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ
ఆపరేషన్‌ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి సక్సెస్‌ చేసి కృష్ణ తేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలను సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్‌ నుంచి అందే సాయం కోసమే ఎదురుచూస్తూ కూర్చోకుండా ’ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్‌ బుక్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది. అలెప్పీకి తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు.
ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణ తేజకు రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీమ్‌ ద్వారా రాజమౌళి, యాంకర్‌ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తరలివచ్చేలా మాట్లాడి కృష్ణ తేజ ఒప్పించ గలిగారు. పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ ఓ ఫేస్‌ బుక్‌ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్‌ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్‌ ను మెయింటైన్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణ తేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌ ను తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళ వాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్‌ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ను బోట్‌ రేస్‌ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.
అలెప్పీ వాసులు తల్లడిల్లిన సంఘటన
అలెప్పీ సబ్‌ కలెక్టర్‌ పొజిషన్‌ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు అలెప్పీ వాసులు తెలుసుకుని తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు
కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్‌ చూపించారు. ‘మిషన్‌ ఫేస్‌ లిఫ్ట్‌’ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్‌ చేయించారు. రిసార్టులను అభివృద్ధి చేయటంతో పాటు మాయా పేరుతో ఓ చాట్‌ బోట్‌ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్‌ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో సక్సెస్‌ అయ్యారు. క్యారవాన్‌ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవాన్‌ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగిరండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.
కరోనా సమయంలో..
కరోనా విలయం కేరళను చుట్టేయటంతో ప్రజలకు మరింత సేవలను అందించేలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణ తేజకు కేరళ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతీ ఇంటికి ఫుడ్‌ కిట్, ఇంకా నిత్యావసరాల కిట్‌లను అందించేలా కృష్ణ తేజ రూపొందించి రూట్‌ మ్యాప్‌ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.
అలెప్పి జిల్లా కలెక్టర్‌గా..
అలెప్పీలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రిసార్టు మాఫియాను తరిమికొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 200 కోట్ల విలువైన కళ్లు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు... జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు. అన్నీ అక్రమంగా సరస్సును చెరచి కట్టుకున్నవి కావడం విశేషం.
కేరళలోని అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్‌ సరస్సు... వద్ద కపికో రిసార్టు పేరు తెలియని వాళ్లుండరు. అంత విలాసవంతమైన రిసార్టు అది. సామాన్యులకు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే రూ. 55 వేలు. మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగే వాడెవ్వడని దాన్ని పదెకరాల్లో కట్టారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్య్సకారులను తొక్కి పడేశారు. కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్లకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై ఆ కట్టడాలు తొలగించేందుకు న్యాయం స్థానం అనుమతులు తెచ్చుకున్నారు.
సమస్యంతా ఇక్కడే.. వాటిని అమలు చేసే అధికారి ఎవ్వరనేది. కానీ ఈసారి అలెప్పీ కలెక్టర్‌గా అక్కడకు వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్‌ ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి అన్నట్లు కృష్ణ తేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు. అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు.
కలెక్టర్‌ మామన్‌గా పేరు..
కొవిడ్‌ కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి, అక్కడి పిల్లలకు కలెక్టర్‌ మామన్‌ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్‌ చేశారో లెక్కనే లేదు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో. ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి.
వీఐపీ అంటూ ఓటర్‌ కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన త్రిసూర్‌లో ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది.
ఇవన్నీ పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి..
ఇవన్నీ గమనించిన పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్‌ కళ్యాణ్, కృష్ణ తేజ కలిశారు.
Tags:    

Similar News