ఇంతకీ ఆ చెట్టు నుంచి నీరెందుకోస్తుందో తెలుసా?

అదేమైనా మంచినీళ్ల ట్యాపా...తిప్పగానే నీరు రావడానికి... ఓ చెట్టు.... అయినా దాని నుంచి ధారలుగా నీరు ప్రవహిస్తుంది.. ఇంతకీ ఆ చెట్టు నుంచి నీరెందుకు వస్తుంది...?;

Update: 2024-04-03 08:40 GMT
చెట్టు నుంచి ధారగా వస్తున్న నీటిని పరిశీలిస్తున్న అధికారులు

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: ఆ చెట్టు నుంచి ధారగా నీరు వస్తుంది... ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వృక్షాన్ని కనిపెట్టిన అటవీ శాఖ అధికారులు దీనికి 'అరుదైన జల ధార వృక్షం' అంటూ నామకరణం కూడా చేసేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాపికొండల సమీపంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు ఈ చెట్టును గుర్తించారు. తక్షణం ఈ చెట్టు నుంచి వస్తున్న నీటి ధారను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.' ఏ‌ఎస్‌ఆర్ జిల్లా అటవీ ప్రాంత గిరిజనులు ఈ చెట్టు నీటిని దివ్య ఔషధంగా వాడేవారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన ఆదివాసీలు ఈ చెట్టును చూపించారు' అని రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి నరేన్ తిరణ్.. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలియజేశారు.

దివ్య ఔషధంగా చెట్టు నీరు....

చెట్ల నుంచి నీరు సేకరించి తాగడం ఆదివాసీలకు కొత్త కాదు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు ఈ చెట్ల నీటిని తమ అవసరాలకు వాడుతూ ఉంటారు. ఈ నీటిని సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. ప్రస్తుతం చూసిన నల్లమద్ది చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని గిరిజన తండావాసులు తెలిపారు. ఈ చెట్టు నీరుపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఋషులు, మునులు అటవీ ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఈ చెట్టు నీరునే సేవించే వారిని ప్రచారంలో ఉంది.


ఇది సహజ గుణం....

'ప్రకృతిలో ప్రతి చెట్టు భూమి నుంచి నీటిని గ్రహిస్తుంది. ఇది చెట్లకు ఉండే సహజ గుణం. ఈ లక్షణాన్ని చెట్ల జీవన సారం అని పిలుస్తారు' అని ప్రముఖ పర్యావరణ వేత్త జేవీ రత్నం.. ది ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు. అరటి బోదె నుంచి వచ్చే నీరు కిడ్నీలో రాళ్లు కరగడానికి ఉపయోగిస్తారు. తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి సేకరించిన పానీయాన్ని 'కల్లు' గా సేవిస్తారు. ఇలా పలు రకాల చెట్ల నుంచి పానీయాలు రావడం కొత్తేమీ కాదని ఆయన చెప్పారు.



Tags:    

Similar News