తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎందుకు వివాదాస్పదుడయ్యాడు?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఆయనపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకూ ఏమి జరుగుతోంది?;

Update: 2025-03-29 07:20 GMT

ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగుర వేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కొలికపూడి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆకర్షించింది. అందుకే ఆయనకు 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చి గెలిపించింది. ఆయన ఎన్నికైన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. దీనివల్ల పార్టీలోనూ, ప్రజల్లోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కొలికపూడి పై నమోదైన కేసులు ఏమిటి?

కొలికపూడి శ్రీనివాసరావుపై పలు సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. కొన్ని ముఖ్యమైన ఆరోపణలు వచ్చాయి.

2024 జులైలో ఇంటి కూల్చివేత ఘటన

ఎ కొండూరు మండలం కంభంపాడులో వైఎస్ఆర్‌సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు ఇంటిని కొలికపూడి ఆధ్వర్యంలో ఒక పార్ట్ కూల్చివేశారు. ఆయనే స్వయంగా ప్రొక్లయిన్ తెప్పించి దగ్గర నిలబడి కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పట్లో స్థానిక ప్రజలు, వైఎస్సార్ సీపీ వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొలికపూడితో పాటు 60 మంది టీడీపీ, జనసేన నాయకులపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఘటనలో అక్రమ నిర్మాణం ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి.

వేధింపుల ఆరోపణలు

ఎస్టీ కుటుంబంపై దాడి, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. 2025 జనవరిలో ఒక ఎస్టీ మహిళ భర్తను కొట్టారని, దీనితో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అదే విధంగా టీడీపీ కార్యకర్త డేవిడ్ కూడా కొలికపూడి వేధింపుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వారి బంధువులు ఆందోళన చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.

క్రమశిక్షణా సంఘం ఎదుట రెండుసార్లు హాజరు ఎందుకు?

కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు రెండుసార్లు హాజరయ్యారు. దీనికి కారణాలు ఉన్నాయి. మొదటి సారి జనవరి 20, 2025 లో ఎస్టీ కుటుంబంపై దాడి ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసారు. కొలికపూడి శ్రీనివాసరావు నుంచి క్రమశిక్షణా సంఘం వివరణ తీసుకోవాలని ఆదేశించారు. కమిటీ సభ్యులు ఎంఏ షరీఫ్, కొనకళ్ల నారాయణ, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పంచుమర్తి అనురాధ, వర్ల రామయ్య ఆయనను విచారించారు. అయితే, ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మరింత అసంతృప్తి పెరిగింది.

రెండవ సారి: ఆ తర్వాత కూడా ఆయన వ్యవహారశైలిలో మార్పు రాకపోవడం, కొత్త వివాదాలు (మహిళలపై వేధింపులు, పార్టీ కార్యకర్తలతో గొడవలు) తలెత్తడంతో మళ్లీ కమిటీ ముందు హాజరయ్యేలా పిలిచారు. ఈ వివాదాలు పార్టీ పరువును దెబ్బతీస్తున్నాయని అధిష్టానం భావించింది.

రాజీనామా హెచ్చరిక ఎందుకు?

మార్చి 27, 2025న కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ అధిష్టానానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసి, రాజీనామా హెచ్చరిక చేశారు. టీడీపీ నాయకుడు ఏఎంసీ మాజీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి ఎ కొండూరుకు చెందిన ఒక గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో బయటకు రావడం. ఈ విషయంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొలికపూడి డిమాండ్ చేశారు. 10 రోజులు గడిచినా పార్టీ స్పందించకపోవడంతో, ఈ హెచ్చరిక జారీ చేశారు. ఆయన దీన్ని నీతి, న్యాయం కోసం చేస్తున్న పోరాటంగా చెప్పుకున్నారు.

విచారణ కమిటీ ఏర్పాటు

కొలికపూడి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురామ్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని, టీడీపీ ప్రాంతీయ సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు లు ఈ కమిటీలో ఉన్నారు. వీరి ముగ్గురికి ఇప్పటికే గిరిజన మహిళను అలవాల రమేశ్ రెడ్డి లైంగికంగా వేధిస్తూ మాట్లాడిన వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పది రోజులైనా వారు స్పందించలేదని చెప్పారు. పైగా ఎంపీ కార్యాలయంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు రమేశ్ రెడ్డి ఉంటున్నారని ఎమ్మెల్యే చెప్పటం విశేషం. వీరు ముగ్గురూ కలిసి గత 10 నెలల ఘటనలపై నివేదిక సమర్పించాలని పార్టీ ఆదేశించింది. దీనికి కారణం ఆయన వివాదాస్పద చర్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని జిల్లా నాయకులు ఇప్పటికే నివేదికలు తయారు చేసి ఇవ్వటం.

కొలికపూడి ఎందుకు ఇలా చేస్తున్నారు?

కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయ నేపథ్యం, వ్యక్తిగత స్వభావం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయన అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేసి, 2024లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో తన స్వంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని, న్యాయం కోసం పోరాడే నాయకుడిగా కనిపించాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన తీరు దూకుడుగా సమన్వయం లేకుండా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. పార్టీ నాయకులతో కలిసి పనిచేయడంలో విఫలమవడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన వివాదాల్లో చిక్కుకోవడానికి కారణమైంది.

పార్టీలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది?

ఆయన చర్యలు (ఇళ్ల కూల్చివేత, వేధింపులు, కుల గొడవలు) పార్టీ పరువును దెబ్బతీస్తున్నాయని జిల్లా నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. సీనియర్ నాయకులను కలుపుకోకుండా, సొంత వర్గంతో మాత్రమే పనిచేయడం వల్ల పార్టీలో అసంతృప్తి పెరిగింది. కొందరు ఆయనను ‘జగన్ కోవర్ట్’ అని కూడా విమర్శించారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు, ఆయన వివాదాలు దాన్ని మసకబారుస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అధిష్టానం ఆగ్రహం ఎందుకు?

కొలికపూడి వివాదాలు టీడీపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉండగా, ఆయన చర్యలు ప్రతికూలత తెస్తున్నాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ హెచ్చరించినా ఆయన తీరు మార్చుకోకపోవడం, బహిరంగంగా అధిష్టానాన్ని సవాలు చేయడం అధిష్టానాన్ని కోప్పడేలా చేసింది. పార్టీని ఒత్తిడిలో పెట్టేలా రాజీనామా హెచ్చరికలు చేయడం కూడా అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది.

కొలికపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ, ఆయన వ్యవహార శైలి, సమన్వయ లోపం వల్ల వివాదాల్లో చిక్కుకుంటున్నారని చెప్పొచ్చు. ఆయన రాజీనామా హెచ్చరికలు, పార్టీలోని ఒక వ్యక్తిపై చర్యల డిమాండ్ న్యాయం కోసం పోరాటంగా చెప్పుకుంటున్నప్పటికీ, పార్టీ నాయకత్వం దీన్ని క్రమశిక్షణ లోపంగా భావిస్తోంది. ఈ పరిస్థితి ఆయన రాజకీయ భవిష్యత్తును, టీడీపీలో ఆయన స్థానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News