ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీలో గిరిజనుల కోసం పాడేరు, సీతంపేట, పార్వతీపురం, చింతూరు, రంపచోడవరం, అలాగే సముద్ర తీరంలో యానాదుల అభివృద్ధి కోసం నెల్లూరు, నల్లమల అడవుల్లో చెంచుల అభివృద్ధి కోసం శ్రీశైలంలలో ఐటీడీఏ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో పాడేరు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం వంటి ఐటీడీఏలకు తప్పకుండా ఐఏఎస్‌లను నియమిస్తారు. చింతూరు, శ్రీశైలం, నెల్లూరు వంటి ఐటీడీఏలకు ఐఏఎస్‌లు కాకపోయినా గ్రూప్–1 అధికారులను నియమిస్తారు. వీరు స్వతహాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. ఆ గిరిజన సమాజం నుంచి ఎవరినైనా ఉద్యోగాల్లోకి తీసుకునే అధికారం కూడా వారికి ఉంటుంది. కానీ ఇప్పుడవేవీ అక్కడ కనిపించడం లేదు. శ్రీశైలం ఐటీడీఏ ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కింద ఆదిమ గిరిజనులైన చెంచులు జీవిస్తున్నారు. అడవులే ఆధారంగా బతుకుతున్నారు. అడవుల నుంచి వారిని అటవీ సమీప గ్రామాలకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు నేటికీ ఫలించలేదు. ఎప్పటికి ఫలిస్తాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఐటీడీఏకు డిప్యుటేషన్‌పై వస్తున్న గ్రూప్–1 అధికారులను నియమిస్తూ పాలకులు వారి పాలన చూసుకుంటున్నారు. ఇంతటి దారుణం మరెక్కడా ఉండదు. డిపార్టుమెంట్‌లో డీడీ, జేడీ స్థాయి అధికారులు ఎంతో మంది ఉన్నారు. వారిని కాకుండా వేరే వారిని నియమించే పద్ధతులు మారాలనే వాదన ట్రైబల్స్‌లో ఉంది. నిజానికి చెంచులు 25 ఏళ్ల క్రితం మగవారైతే గోచీ, ఆడవారైతే నార చీరలు కట్టుకునే వారు. ఇప్పుడు మగవారు నిక్కర్లు వేసుకుంటున్నారు. ఆడవారు చీరలు కట్టుకుంటున్నారు. పాత తరం వారు రవికలు ఇప్పటికీ వేసుకోరు. ఈ పరిస్థితులన్నీ డిపార్ట్‌మెంట్ వారికి పూర్తిగా తెలుసు. బయటి నుంచి వచ్చిన వారు అవగాహన చేసుకునేలోపే వారికి బదిలీ బహుమతిగా అందుతుంది. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది.
శనివారం రాత్రి జరిగిన ఐఏఎస్‌ల బదిలీలు ఐటీడీఏలను నీరు గార్చేవిగా ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న ఐఏఎస్‌లను మార్చి వేరే ప్రాంతాలకు అధికారులుగా నియమించారు. ఏజెన్సీలోని మూడు ఐటీడీఏలకు సబ్ కలెక్టర్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సబ్‌కలెక్టర్‌లు అంటే జూనియర్ ఐఏఎస్‌లు వారు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మొదట ఐఏఎస్‌లను డీఆర్‌డీఏ పీడీలుగా, ఐటీడీఏ పీవోలుగా నియమిస్తారు. ఎందుకంటే సంక్షేమ రంగం ఎలా ఉంటుంది. పేదరిక నిర్మూలన, సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకునేందుకు వీరికి ఈ పదవులు ఉపయోగ పడతాయని ప్రభుత్వం ఇలా చేస్తుంది. ప్రస్తుతం సబ్ కలెక్టర్‌లుగా ఉన్న వీరికి రెవెన్యూ వ్యవహారాలు చక్కబెట్టేందుకే సరిపోతుంది. నిత్యం భూ వివాదాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రోజూ ఆ అంశాలే వారికి సరిపోతాయి. అలాంటప్పుడు ఐటీడీఏలపై ప్రత్యేకించి దృష్టిపెట్టడం సాద్యం కాదు. ఈ విషయం పాలకులకు తెలియదా అంటే.. తెలిసి కూడా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. పాడేరు సబ్ కలెక్టర్‌గా నియమితులైన ప్రఖర్ జైన్‌కు పాడేరు ఐటీడీఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా నియమితులైన అశుతోష్ శ్రీవాత్సవకు పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏటిపాక సబ్ కలెక్టర్‌గా నియమితులైన అపూర్వ భరత్‌కు చింతూరు ఐటీడీఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీడీఏలకు అదనపు బాధ్యతలు అనేవి బాధ్యత మరిచే విధంగా చేస్తాయి. అధికారులు మొదట తను విధులు నిర్వహిస్తున్న కార్యాలయ కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ తరువాత మాత్రమే ఐటీడీఏల గురించి ఆలోచిస్తారు. ఇంత ప్రాధాన్యత గలిగిన ఐటీడీఏలను నిర్లక్ష్యం చేయడం తగదని గిరిజనులు అంటున్నారు. చెంచు గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు కుడుముల మూగెన్న మాట్లాడుతూ ఐటీడీఏలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిమినెంట్ అధికారులను నియమించి గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.