ఆంధ్రప్రదేశ్‌లో హింస ఎందుకు పెరుగుతోంది?

ఏపీలో హింస పెరుగుతోంది. ఎన్నికల ముందు మొదలైన హింస నేటికీ కొనసాగుతూనే ఉంది. అత్యాచారాలు, హత్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటికి ఎవరు కారణం?

Byline :  The Federal
Update: 2024-07-21 07:36 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మొదలైన హింస.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 40రోజులు గడిచినా కొనసాగుతోంది. దీనికి కారకులెవరు? రౌడీ మూకలా? దౌర్జన్య కారులా? రాజకీయ నాయకులా? పోలీసులా? అనేది ఇప్పుడు దేశ వ్యాప్త చర్చనీయాంశంగా మారింది. ఈ వర్గాలను ఇప్పుడెందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, హింస ఎక్కడ జరిగినా అణచివేయడంలో ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించాలి. హింసను తుదముట్టించి సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు ముందుకు అడుగులు వేయాలి. ఇప్పుడు రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొనడంతో అందుకు ప్రభుత్వ వైఫల్యమా? పోలీసుల నిర్లక్ష్యమా అనేది చర్చగా మారింది. జడలు విప్పిన హింస రోజుకో అడుగు ముందుకు వేస్తుందే తప్ప ఆగడం లేదు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని రాజకీయంగా జరిగిన ఘటనలూ ఉన్నాయి. మరి కొన్ని దురహంకారంతో చేసిన ఘటనలు ఉన్నాయి. మహిళలపై అమానవీయంగా జరిగిన దాడులు ఉన్నాయి. హత్యలు జరిగాయి. ఇవన్నీ కేవలం 40 రోజులు వ్యవధిలోనే జరగటం రాష్ట్ర ప్రజలను కలవర పెడుతోంది.

హత్యను హత్యగానే చూడాలని అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్‌ అన్నారు. మృతులంతా మనుషులే. ఏ పార్టీకి చెందిన వారైనా, సామాన్య ప్రజలైన మొదట మానవులే. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా శాంతి భద్రతలను చూడాలి. ఎన్నికలకు ముందు నుంచి అల్లర్లు జరుగుతున్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అరకట్టడంలోను, మాన, ప్రాణ రక్షణను ప్రాధాన్యతగా తీసుకొని సమీక్షలు నిర్వహించడంలోను, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోను, హింసను నివారించడంలోను ఉదాసీనంగానే వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్వేత పత్రాలపై కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు శాంతి యుతంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.
మాటల దాడితో సరి..
రాజకీయంగా హత్యలు, అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలాలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఒకరికొకరు రెచ్చగొట్టే విమర్శలు సైతం చేస్తున్నారు. ఎన్నికల సమయంలోను ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటివంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రెడ్‌ బుక్‌ పేరుతో అధికారులనే కాకుండా పార్టీ పరంగా కష్టపడి పని చేస్తున్న నాయకులను కూడా అడ్డు తొలగించుకొనే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వినుకొండలో జరిగిన ఘోరమైన హత్యపై జగన్‌ మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన తర్వాత గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు, 300లకుపైగా హత్యాయత్నాలు, టీడీపీ శ్రేణుల వేదింపులకు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా జగన్‌ ప్రభుత్వంలో సుమారు 1300 మంది టీడీపీ కార్యకర్తలు వివిధ సంఘటనల్లో బలయ్యారని విమర్శిస్తున్నారు. 121 మంది ముస్లింలను నరికి చంపారని, 240 మంది దళితుల పీకలు కోయించారని, 82వేల అత్యాచారాలు జరిగాయని వీరిని ఎప్పుడు పరామర్శిస్తారని ట్వీట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇలా ఎవరి లెక్కలు వారు చెబుతూ మా పార్టీ వారిని ఆ పార్టీ వారు చంపారని, ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు చంపారని పరస్పర మాటల దాడితో కాలం గడుపుతున్నారు. నిజానికి ఇంట్లో తమ వాళ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలు మాత్రం తీరని వేదనతో కుమిలి పోతున్నారు.

నేరస్తుల చేతుల్లో బలైపోతున్నారు

నేరస్తుల చేతుల్లో ఏ పార్టీకి సంబంధం లేని యువతులు, బాలికలు అత్యాచారానికి గురై హత్య చేయబడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే బాపట్ల జిల్లా చీరాల మునిసిపాలిటీ పరిధిలోని ఈపూరుపాలెంలో తెల్లవారు ఝామున బహిర్భమికి వెళ్లిన యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు హోం మంత్రి అనితను సంఘటన స్థలానికి పంపించి 36 గంటల్లోనే హంతకులను పట్టుకోగలిగారు.
జూలై 17న తిరుపతి జిల్లాలో 8ఏళ్ల చిన్నారిపైన అత్యాచారానికి పాల్పడిన దుండగులు తర్వాత హత్యకు పాల్పడ్డారు. దొరవారిసత్రం మండలం నేలబల్లి అటవీ ప్రాంతంలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. బాధితురాలి కుటుంబం బీహార్‌ నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చింది. బాలిక తండ్రి రైస్‌మిల్లులో పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
జూలై 15న గుంటూరు జిల్లాలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం, కొత్తారెడ్డిపాలెంలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికపై గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అత్యాచారానికి ఒడిగట్టి తర్వాత హత్యకు పాల్పడ్డాడు. చివరికి నిందితుడి ఇంట్లోనే బాలిక శవమై తేలింది.
జూలై 6న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పిగొండపాలెం గ్రామంలో బి.సురేష్‌ అనే వ్యక్తి 13 ఏల్ల బాలికను ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు. తర్వాత నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జూలై 17న విశాఖపట్నంలో ఒక మైనర్‌ బాలికపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిని కూడా గాయపరిచాడు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎల్లాల గ్రామానికి చెందిన 8ఏళ్ల బాలికపై అత్యాచారానికి బలైంది. దుర్మార్గులు ఆ బాలికను క్రూరంగా హత్య చేసి రిజర్వాయర్‌లో పడేశారు. ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం లభించ లేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రామభద్రపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 5 నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు అఘాత్యానికి పాల్పడ్డాడు.
ఆగని రాజకీయ దాడులు, హత్యలు
టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ హత్యలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మాజీ ఎంపి రెడ్డప్ప ఇంటికి వెళ్లిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడటంతో పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మిథున్‌ కార్లను సైతం టీడీపీ శ్రేణులు తగులబెట్టారు. నేటికీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కాలు మోపలేని పరిస్థితులు నెలకొంది. నియోజకవర్గంలో పర్యటనకు వస్తే దాడులు తప్పవని టీడీపీ శ్రేణులు బహిరంగంగానే హెచ్చరించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటి నుంచి బయటకు కదలకుండా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఇలా ఒకరిపైనే కాకుండా పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. రాళ్ళు రువ్వారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ప్రతిఘటన మాత్రం కన్పించలేదు. హిందూపురం పరిధిలోని గోళపురం గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత సతీష్, విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్, శ్రీకాకుళం రెల్లి వీధికి చెందిన గౌరీశంకర్‌.. ఇలా పలు హత్యలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్పడినట్లు వైఎస్‌ఆర్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను వైఎస్‌ఆర్‌సీపీ హత్యలకు పాల్పడిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఇప్పటికే స్పందించారు. లా అండ్‌ ఆర్డర్‌ అదుపు తప్పిందని, దీనిని గాడిలో పెట్టడంలో కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకు సూచించారు.
ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ విధులు నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం బిజీబిజీగా గడిపింది. తర్వాత చెలరేగిన హింసను అరికట్టడంలోను నిమగ్నమైంది. ఫలితాలు రావడం, నూతనంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మార్పులు చేర్పులకు తెరలేపారు. డీజీపీ నుంచి ఏడీజీపీ, ఐజీ, డిఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల వరకు బదిలీలు చేపట్టింది. దాదాపు ఐదు విడతలుగా పోలీసు అధికారుల బదిలీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతుండటంతో పోస్టింగ్‌లు అంశం పోలీసు వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారుల దృష్టి అంతా ఏక్కడ పోస్టింగ్‌లు ఇస్తారో, ఎవరికి బదిలీలు చేపడతారో అనే అంశాలపైనే ఉండి పోయింది. కొత్త అధికారులు రావడంతో ఆ ప్రాంతంపై అవగాహన లేక పోవడం, దీంతో స్థానికంగా శాంతి భద్రతల అంశంపై దృష్టి పెట్టడం సాధ్యం కాలదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఇప్పుడే వారి పనితీరు బాగలేదని చెప్పలేం. వారికి కొంత సమయం ఇవ్వాలి. అయితే శాంతి భద్రతల విషయంలో మాత్రం అప్రమత్తంగానే వ్యవహరించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజకీయ, సామాజిక రంగాల నిపుణులు టి లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News