‘మీకు ఎందుకు సంఘీభావం తెలిపాలి’.. జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న..

ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాపై వెఎస్ షర్మిల ప్రశ్నలు గుప్పించారు. అందులో స్వలాభం తప్ప మరేమీ లేదన్నారు. ఐదేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

Update: 2024-07-27 06:31 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఢిల్లీలో చేసిన నిరసనకు ఇండి కూటమి నేతలు పలువురు సంఘీభావం తెలిపారు. తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ ఘాటు స్పందించారు. అసలు మీకు ఎందుకు సంఘీభావం తెలిపాలి జగన్ అంటూ నిదీశారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఘాటైన పోస్ట్ ఒకటి పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీకార దాడులను, హత్యారాజకీయాలకు పెంచి పోషిస్తుందంటూ జగన్.. ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారు. ఆంధ్రలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం రాష్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే షర్మిల స్పందించారు.

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా!

‘‘జగన్.. మీ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలి. ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకా? ఆ అక్రమ సంబంధం కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా?’’ అంటూ ప్రశ్నించారు. నిజంగా శాంతి భద్రతలపై ఇంతటి చింత ఉండి ఉంటే.. గతంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఎందుకు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయలేదని ప్రశ్నించారు. మణిపూర్ ఘటనపై ఇన్నాళ్లూ నోరెత్తని జగన్‌కు ఒక్కసారిగా ఇప్పటికిప్పుడు అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు.

అప్పుడు బీజేపీకే ఓటేశారుగా!

ఇప్పుడు బీజేపీని ప్రశ్నిస్తున్న జగన్, వైసీపీ.. ప్రధాని మోదీపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘అవిశ్వాసం తీర్మానంలో బీజేపీకి మద్దతుగానే ఓటేశారు కదా? వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? మణిపుర్ ఘటటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే.. మీ నుంచి సంఘీభావం లభించింది? కానీ ఇప్పుడు మీరు చేస్తున్న నిరసనకు ఎందుకు సంఘీభావం తెలిపాలి. అందులో రవ్వంతైనా వాస్తవం ఉందా’’ అని ప్రశ్నించారు.

అందుకే కాంగ్రెస్ దూరం

‘‘మీ నిరసనలో వాస్తవం లేదని తెలిసే కాంగ్రెస్ దూరం పాటించింది. ఢిల్లీ జంతర్ మంతర్‌లో తెలిపిన ధర్నాలో జగన్ స్వలాభం తప్పా మరేమీ లేదు. రాష్ట్ర ప్రయోజనం అసలే లేదు. రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం అనే అంశం శూన్యం. అందుకే కాంగ్రెస్ పార్టీ.. జగన్‌కు సంఘీభావం తెలపలేదు. అసలు ఆ అంశంపైనే స్పందించలేదు. దేనికైనా సిద్ధం అంటూ ప్రచారం చేసిన జగన్‌కు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి 11 మంది బలం సరిపోలేదా. ఇప్పుడు అంతా కలిసి పోరాడదాం అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరూ గుర్తుకు రాలేదా’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News