జగన్‌పై దాడికి కడపలో నిరసన వ్యక్తం కాలేదు, ఎందుకు?

సీఎం వైఎస్. జగన్‌పై దాడి ఘటనతో కడప జిల్లా మినహా, రాయలసీమలో నిరసనలు వెల్లువెత్తాయి..

Update: 2024-04-14 12:50 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి కుట్ర పన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. కడప మినహా రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నగరంలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. నగరంతో పాటు జిల్లా ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మాత్రం నిరసన కార్యక్రమాలు జరిగాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో కలిసి నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు..

 

విజయవాడలో నిన్న రాత్రి జరిగిన రాళ్ల దాడి ద్వారా రెక్కీ నిర్వహించారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా ఆరోపించారు. విజయవాడ ఘటన నిరసిస్తూ... తిరుపతిలో ఆదివారం ఉదయం నుంచి నల్ల బ్యాడ్జీలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కలిసి నిరసనగా దిగారు. తిరుపతి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో కలిసి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నల్ల కండువాతో, తిరుపతి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ నల్ల బ్యాడ్జి ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. "నిన్న రాత్రి విజయవాడలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన హత్యాయత్నమే" అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.టిడిపి అధ్యక్షుడు ఏం చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రచార వేదికలపై నుంచి తమ పార్టీ శ్రేణులను ప్రేరేపించే విధంగా చేసిన వ్యాఖ్యలే.. ఈ దాడికి ఉసిగొల్పాయని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తమ కార్యకర్తలను, గూండాలను రెచ్చగొట్టే మాటలు చెప్పడం వల్లనే ఈ దాడికి కారణం అన్నారు. "ఇది కచ్చితంగా సీఎం వైఎస్ . జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నమేనని ఆయన తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. టిడిపి నేత చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తంతో తడిసిందేనని, తాజాగా అందులో పవన్ కళ్యాణ్‌ను భాగస్వామిగా చేర్చుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. "జగన్ మోహన్ రెడ్డిని రాజకీయల్లో ఎదుర్కొనే శక్తి లేక, భౌతికంగా అంతమొందించే కుట్ర చేశారన్నారు. వారి కుట్రలో భాగంగానే రెక్కీ నిర్వహించారు" అని ఆరోపించారు. అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద వైఎస్ఆర్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి, శంకర నారాయణతో కలిసి భారీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి.

ఇందులో కుట్ర ఉంది..

సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి దాడి వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. టిడిపి కార్యదర్శి లోకేష్ చేసిన ట్వీట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. అదే పాఠశాల వద్ద నిలబడి ఆ రాయితోనే.. కొట్టించుకుని చూడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్సార్సీపీకి ఇటీవల కాలంలో పెరిగిన మరింత ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఖండించిన చంద్రబాబు

ఇదిలా ఉండగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వేదికగా ఖండించారు. భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని చంద్రబాబు తన ట్వీట్ ద్వారా అభ్యర్థించారు. తద్వారా దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదంతా డ్రామా..

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన డ్రామా అని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలో ఆయన టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరికి లేనంతటి విధంగా 350 మంది రక్షణ సిబ్బంది ఉంటే అజ్ఞాత వ్యక్తులు ఎలా దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా కోడి కత్తి డ్రామాతో లబ్ధి పొందారని, ఇప్పుడు మరో కొత్త నాటకానికి జగన్ మోహన్ రెడ్డి జర తీశారని ఆయన వ్యాఖ్యానించారు.

 

కడపకు ఏమైంది..!?

సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఎలాంటి నిరసనలు కనిపించకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై దాడి ఘటన అనంతరం మిగతా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే కడప జిల్లాలో ఎలాంటి నిరసనలు వినిపించకపోవడం వెనక ఓ కారణం ఉందని భావిస్తున్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో.. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రధానంగా ప్రస్తావిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

వివేక హత్య కేసులో నిందితులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారంటూ ప్రచార అస్త్రంగా మార్చేశారు. దీంతో, గత్యంతరం లేని స్థితిలో ఎదురుదాడికి దిగుతున్నాయి. వైఎస్ జగన్‌పై దాడి ఘటన తర్వాత కడపలో ఎలాంటి నిరసనలు కనిపించలేదు. ఇందుకు ప్రధానంగా అనవసరంగా, సమస్య తెచ్చుకున్నట్లు ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ నాయకులు భావించారా? అని అనుకుంటున్నారు. తాజా ఘటన తర్వాత కూడా వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిల, వైఎస్ వివేకా కుమార్తెకు అనవసరంగా అస్త్రం అందించినట్లు ఉంటుందని భావించారని తెలిసింది.

అందువల్లే కడప నగరంతో పాటు జిల్లాలో ఎక్కడా నిరసన కార్యక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. నగరంలో సీఎం వైఎస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సిపిలో కీలక నాయకులందరూ కడప నగరంలోనే ఉంటారు. వీరి నుంచి కూడా ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకపోవడం వెనక బలమైన కారణమే ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తమ్మీద చెల్లెళ్ళ నుంచి రాజకీయ ఎదురు దాడి నుంచి తప్పించుకోవడం కోసమే నిరసనలకు ఆస్కారం ఇవ్వలేదని భావిస్తున్నారు.

Tags:    

Similar News