మేం ముగ్గురం ఎక్కువయ్యామా, జగనన్నా..
టిక్కెట్లు వచ్చిన వాళ్లు ప్రచారానికి నడుంకడుతుంటే టికెట్ రాని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వత్తడిని ఎదుర్కొంటున్నారు. ఏవైపు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు;
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇంకా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. టిక్కెట్లు వచ్చిన వాళ్లు ప్రచారానికి నడుంకడుతుంటే టికెట్ రాని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర వత్తడిని ఎదుర్కొంటున్నారు. ఏవైపు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. వారి రాజకీయ భవితవ్యంపై ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 12. 2019 ఎన్నికల్లో 8 చోట్ల వైసీపీ, నాలుగు చోట్ల టీడీపీ గెలిచాయి. టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఒకరు వైసీపీ వైపు మొగ్గు చూపారు.
ప్రకాశం జిల్లా చరిత్ర ఇలా...
1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. ప్రకాశం ఉమ్మడి జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే. స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల-పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాలు బాపట్ల జిల్లాలో చేర్చబడ్డాయి. కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలిశాయి.
8 మందిలో ముగ్గురికి నో టికెట్స్...
ప్రకాశం జిల్లాలో వైసీపీకి చెందిన 8మంది ఎమ్మెల్యేలలో ముగ్గురికి మినహా మిగతా వారందరికీ ఎక్కడో చోట టికెట్లు దొరికాయి. దర్శి, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు శాసనసభ్యులకు మాత్రమే ఆపార్టీ టికెట్ నిరాకరించింది. గెలిచిన అనంతరం ఆపార్టీలో చేరిన చీరాల ఎమ్మెల్యే బలరాంకు బదులు కుమారుడికి సీటు ఇచ్చింది. దీంతో టికెట్ రాని ముగ్గురు ఎమ్మెల్యేల పయనమెటు అన్నది ఆసక్తిగా మారింది. టికెట్ రాని ముగ్గురు చివర్లోనైనా అధినేత వైఎస్ జగన్ అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఎదురుచూశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నుంచి మళ్లీ జగన్ అవకాశం ఇవ్వరని ముందుగానే గ్రహించి ఆపార్టీ నుంచే ఎంపీ టికెట్ ఆశించి విఫలమయ్యారు. సంతలనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కూడా ఇక్కడ కాకపోయినా మరో చోటైనా చాన్స్ ఇస్తారని ఎదురుచూశారు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి మాత్రం అధిష్ఠానంలోని ఒకరిద్దరు నాయకులే చివరి దాకా వేచి చూడండని సలహా ఇచ్చినా అదీ పని జరిగిన సూచనలు కనిపించలేదు. సీఎం జగన్ మొత్తం నియోజకవర్గాల అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించటంతో ఆ ముగ్గురికి ఇక వైసీపీ నుంచి పోటీచేసే అవకాశం లేనట్లే.
మహీదర్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూపులు...
కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సీనియర్. ఆయన పార్టీ వీడతారని గట్టిగా వార్తలు వస్తున్నా తాను తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించే విషయంలో ఒత్తిడికి గురవుతున్నారు. ముందుగానే పరిస్థితిని గ్రహించిన మహీధర్‌రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాలపై కూడా కొంతకాలం దృష్టి సారించారు. ఒకదశలో ఆయన్ను టీడీపీలోకి తీసుకునేందుకు ఆపార్టీ సిద్ధమైంది. కాని ఏమి జరిగిందో తెలియదు గాని చేరలేదు. చివరకు టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించింది.
ప్రస్తుతానికి ఎన్నికల హాలిడేనా...
ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సాయిరెడ్డితో కూడా మహీధర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఆయన్ను వేర్వేరుగా కలిశారు. అయినా మహిదర్ రెడ్డి మనసులో మాటేమిటో తెలియలేదు. ఈసారికి ఎన్నికల సమరానికి దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రా యానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. మహిదర్ రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండడం ఇదే కొత్తకాదు. 2014లో కూడా ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. పూర్తిగా సైలెంట్ కావద్దని అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. మండలాల వారీగా ఆయన అనుచరులు సమావేశమై ఏం చేయాలో చెప్పమని కోరుతున్నారు. ఆయన పోటీలో లేకపోతే కొందరు టీడీపీలోకి వెళ్లిపోనుండగా, మరికొందరు వైసీపీలోనే ఉండే అవకాశం ఉంది.
మద్దిశెట్టి దారెటు
దర్శి కాకపోతే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని సిటింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. దర్శి సీటు బూచేపల్లికి ఇచ్చారు. నియోజకవర్గంలోని పరిస్థితి దృష్ట్యా వైసీపీ అభ్యర్థి బూచేపల్లికి సహకరించకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబసభ్యులు, అనుచరుల నుంచి కూడా పూర్తిస్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఆయన సోదరులు కూడా పోటీకి దూరమైతే రాజకీయంగా నియోజకవర్గంలో గ్యాప్ వస్తుందని, ఏదో పార్టీ నుంచి పోటీలో ఉండాలని ఆయనపై ఒత్తిడి చేశారు.
చిరంజీవిని కలిసిన మద్దిశెట్టి..
2009 నాటి సంబంధాలతో ఆయన అప్పటి పీఆర్పీ వ్యవస్థాపకులు చిరంజీవిని కలిసినట్లు సమాచారం. ఆయన సిఫార్సుతో జనసేన నేత పవన్‌కల్యాణ్‌ను కూడా కలిసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకోవైపు వ్యాపారపరంగా టీడీపీకి చెందిన ఒక మాజీ ఎంపీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆపార్టీలో చేరేందుకు కూడా ప్రతిపాదన పంపినట్లు తెలిసింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ద్వారా మద్దిశెట్టి పార్టీలో చేరే విషయం అధిష్ఠానానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఆ రెండు పార్టీల నుంచి ప్రారంభంలో సానుకూల స్పందన రాలేదని తెలిసింది. ఈ దశలో విదేశాలకు వెళ్లిన వేణుగోపాల్ బెంగళూరు చేరారు. టీడీపీ, జనసేన నేతలతో మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న ఆయన తమ్ముడు మాత్రం తన అన్న టీడీపీ నుంచి పోటీచేసే అవకాశం ఉందంటున్నారు.
సుధాకర్ బాబుతో సయోధ్య సాధ్యమా...
సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబును బుజ్జగించేందుకు వైసీపీ ఒంగోలు లోక్‌సభ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవి ఇచ్చింది. ఈ పదవి నాలుక గీచుకోవడానికి పనికి రాదని సుధాకర్ బాబు అనుచరులు ఇప్పటికే పెదవి విరిచారు. సంతనూతలపాటు బాపట్ల లోక్‌సభ పరిధిలో ఉన్నందున ఆయన్ను ఒంగోలు లోక్‌సభ పరిధిలో ఉపయోగించుకుంటూ, ఎస్‌ఎన్‌పాడులో పార్టీ అభ్యర్థికి సహకరించే విధంగా చేయాలని ఆ పార్టీ భావించింది. అయితే వేరే జిల్లాలో అయినా చివర్లో అవకాశం ఇస్తారని భావించిన సుధాకర్‌బాబు జాబితా అనంతరం డీలాపడ్డారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన చేసినా అది వర్కవుట్ అయినట్టు కనిపించలేదు. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఇంతవరకు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించ లేదు. ఆయన్ను వైసీపీ అభ్యర్థి నాగార్జున కూడా వెంటేసుకుని తిరిగేందుకు సిద్ధంగా లేరు. దీంతో కాంగ్రెస్ వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.