కుప్పం పై ఇచ్చిన జీవో ఎందుకు రద్దు చేశారు..

రాష్ట్ర ప్రభుత్వం కుప్పం నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం మధ్యహ్నం ఇచ్చిన ఉత్తర్వులు రాత్రికి ఎందుకు వెనక్కి తీసుకుంది?;

Update: 2024-12-21 11:58 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అర్ధరాత్రి నిలిపి వేసింది. కారణం తెలియక అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు నిలుపుదల చేశారనే విషయం ప్రభుత్వ కార్యదర్శికి, ముఖ్యమంత్రికి తప్ప వేరే వారికి తెలియదని పలువురు అధికారులు మాట్లాడుకోవడం విశేషం. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు మంజూరు జీవో ఇచ్చారు. అయితే అదే రోజు రాత్రికి జీవో నిలిపి వేస్తూ మరొక జీవో జారీ కావడం వెనుక రాజకీయాలు ఉన్నాయా? లేక ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాల సంగతేమిటనే అంశాన్ని లేవనెత్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించినప్పుడు రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని నిధులు మంజూరు చేసేందుకు స్థానిక నేతలకు హామీ ఇచ్చారు.

భువనేశ్వరి శంకుస్థాపనలు చేస్తే ప్రొటోకాల్ సమస్య వస్తుందని...

భువనేశ్వరి కోసమే ఆగమేఘాలపై జీవో ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆమె కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ పనులు ప్రారంభించారు. చారిటీ ద్వారా పనులు కుప్పంలో చేపడుతున్నారు. ప్రస్తుతం కుప్పంలో భువనేశ్వరి ప్రజలతో మమేకమవుతున్నందున ఆమె ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయించాలని ప్రభుత్వం రూ. 456 కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారం మధ్యహ్నం జీవో జారీ చేసింది. నిధులు మంజూరు చేసినందున శంకుస్థాపనలు చేపడితే బాగుంటుందని భావించారు. అయితే ఇక్కడ ప్రొటోకాల్ సమస్య తలెత్తినట్లు సమాచారం. అధికారికంగా ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ప్రభుత్వ పనులకు శంకుస్థాపనలు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఈ నిధులు 11 అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. పైగా ప్రభుత్వంలో ఏ పదవీ లేకుండా ప్రభుత్వ పనులకు శంకుస్థాపనలు చేయడం మంచిది కాదని సీఎం కూడా అధికారులకు చెప్పినట్లు సమాచారం.

Delete Edit

మరిన్ని నిధులతో సీఎంతోనే పనులు మొదలు పెట్టాలని...

ప్రభుత్వం కేవలం రోడ్ల పనులే కాకుండా ఇతర అభివృద్ధి పనులు కూడా కలుపుకుని మొదలు పెడితే బాగుంటుందని స్థానిక నాయకులు సీఎం చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం. భువనేశ్వరి పనులకు శంకుస్థాపనలు చేసి సమస్యను తెచ్చుకోవడం కంటే ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే ప్రస్తుతానికి జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని స్థానిక నాయకులకు సీఎం సూచించారు. ఆ మేరకు జీవోను ఉపసంహరించుకున్నారు. రోడ్లే కాకుండా మంచినీరు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, స్కూళ్ల మరమ్మతులు, సామాజిక భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు కలిపి నిధులు మంజూరు చేస్తూ కొత్త జీవో ఇవ్వనున్నారు.

ఇతర నియోజకవర్గాలకు నిధుల మాటేమిటి...

రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రోడ్లు, సామాజిక భవనాలు, మంచినీటి ట్యాంకులు, మురుగు కాలువల నిర్మాణాలు వంటి కనీస వసతుల కోసం నిధులు మంజూరు చేయాల్సి ఉందని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల వద్ద పైసా లేకుండా అభివృద్ధి పనులు జరిపించడం సాధ్యమయ్యే పని కాదని, వారు అడిగిన పనులకు నిధులు ఇస్తే జిల్లా కలెక్టర్ ల పర్యవేక్షణలో పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయిస్తూ పార్టీపై ప్రజల్లో సానుభూతిని పెంచేలా చేయొచ్చనే ఆలోచనలోనూ ప్రభుత్వం ఉంది. అయితే నిధుల కొరత ఉన్నందున ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే ఆలోచన కూడా సీఎం చేస్తున్నట్లు సమాచారం. కేవలం కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని, మిగిలిన నియోజకవర్గాల విషయం పట్టించుకోవడం లేదనే అంశం ఎమ్మెల్యేల నుంచి రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. నియోజక వర్గాల్లో పలు శాఖల ద్వారా ఇప్పటికే చాలా వరకు రోడ్లు, కాలువలు, మంచి నీటి కోసం నిధులు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే కేవలం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇచ్చే నిధులు ఏమూలకు సరిపోతాయని ఎమ్మెల్యేలు అంటున్నారు.

Tags:    

Similar News