Police file | ప్రియుడి మోజులో భర్తను కడతేర్చి.. కటాకటాల వెనక్కి..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసింది. పోలీసులు 48 గంటల్లో ఈ కేసు ఛేదించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-27 11:44 GMT
ప్రియుడి మోజులో ఓ మహిళ భర్తను అంతం చేసింది. ఎవరో చంపేశారని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. మృతుడి తమ్ముడు వినోద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును 48 గంటల్లో ఛేదించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో జరిగింది. పిచ్చాటూరు సీఐ రవీంద్ర సోమవారం ఆ సంఘటన వివరాలు వెల్లడించారు.
పిచ్చాటూరు మండలం గజసింగరాజపురానికి చెందిన సుగంథి, ఆంటోనీ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తులు (ఒకరికి 12, మరొకరికి 8 ఏళ్లు), పదేళ్ల కొడుకు ఉన్నారు. వారి దాంపత్యం సవ్యంగానే సాగేదని చెబుతున్నారు. కాగా, గ్రామానికి చెందిన అరుళ్ రాజ్ తో సుగంధికి వివాహేతర సంబంధం ఏర్పడింది. "దర్యాప్తులో వారికి 12 సంవత్సరాలుగా పరిచయం ఉందనే విషయం తెలిసింది" అని సీఐ రవీంద్ర మీడియాకు చెప్పారు. ఆయన కథనం మేరకు
మద్యం తాపించి... తాడుతో బిగించి
గజసింగరాజపురానికి చెందిన సుగంథికి గ్రామానికి చెందిన అరుల్ రాజ్ తో సాన్నిహిత్యం ఉండేది. తన కలాపాలకు భర్త ఆంటోనీ అడ్డంకిగా ఉందని భార్య సుగంధి భావించింది. దీంతో ప్రియుడు అరుల్ రాజ్ తో ముందస్తుగా పథకం సిద్దం చేసింది. అందులో భాగంగా, గురువారం రాత్రి అరుల్ రాజ్, ఆంటోనీ ఇద్దరు కలిసి పూటుగా మద్యం సేవించారు. అరుల్ రాజ్ స్వయంగా ఆంటోనీని తన బైక్ లో ఇంటికి తీసుకుని వచ్చి వదిలాడు. ముందుగా వేసుకున్న పథకం మేరకు ప్రియుడు అరుల్ రాజ్ తో కలిసి సుగంధి తాడు మెడకు బిగించి ఆంటోనీని అంతం చేశారు. ఇంతవరకు వారి కుట్ర ఫలించింది. ఆ తరువాత ఆంటోనీ మృతదేహాన్ని ఏమి చేయాలనేది పాలుపోని స్థితికి గురయ్యారు. దూరంగా తీసుకుని వెళ్లి, ఉరి వేసుకున్నాడని నమ్మించాలని ప్రయత్నించారు. అయితే, గ్రామంలో జనం అలికిడి కావడంతో అరుల్ రాజ్ గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి పారిపోయాడు.
ఉదయం సుగంథి పరారీ
ఆంటోనీ ఉరివేసుకుని చనిపోయాడని బంధువులకు భార్య సుగంధి బంధువులను నమ్మించడానికి యత్నించింది. అప్పటికే ఆంటోనీ కుటుంబీకులకు సందేహాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసిందని ఎస్ఐ వెంకటేష్ ఫెడరల్ 'ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'కి చెప్పారు. తమకు ప్రాథమికంగా కూడా అదే సమాచారం అందిందని ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి సుగంథి కూడా పరారీ అయిందని ఆయన తెలిపారు. సీఐ రవీంద్ర ఆదేశాలతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులు సుగంథి, ఆమె ప్రియుడు అరుల్ రాజ్ కైలాసకోన వద్ద ఉన్న ఓ ఆలయంలో ఉన్నట్లు సమాచారం అందడంతో అరెస్టు చేశామని ఎస్ఐ వెంకటేష్ వివరించారు. నిందితులను రిమాండ్ కు పంపనున్నట్లు సీఐ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.