Chandrababu|అరవిందబాబు గెలుస్తాడా...? అనుకున్నా...

చాలా ఎన్నికలు చూశా. ఈ ఎన్నికలు వినూత్నమైనవి. కొత్తవారికి సీట్లు ఇచ్చా. మనిషిని చూడలేదు. పార్టీని చూసి ఓట్లు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.;

Update: 2024-12-31 11:30 GMT

పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఎన్నికల్లో గెలుస్తాడా.. అంటే అనుమానంగానే ఉన్నా. కానీ రాష్ట్రమంతా ఎప్పుడూ లేనంతగా ప్రజలు తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపించారు. గత ప్రభుత్వ అరాచకాలు భరించలేక తరిమేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజిక పెన్షన్ ల పంపిణీ సందర్భంగా పల్నాడు జిల్లా యల్లమంద గ్రాంలో జరిగిన సభలో మాట్లాడారు. ముందుగా సారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఆమె కుమారునితో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణం ఇప్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తుందని చెప్పారు. ఆమె కుమార్తె మెడిసిన్ చదువుతానంటే నీట్ కోచింగ్ ఇప్పించాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ బాలిక చదువు వ్యవహారం జిల్లా యంత్రాంగం చూసుకోవాలని ఆదేశించారు. ఇంటిపై సోలార్ సిష్టం వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మరో ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఆ ఇంటి యజమాని ఏడుకొండలుతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యాస్ పొయ్యిపై పాలు కాచి కాఫీ పెట్టి ఇంట్లోని భార్యా భర్తలతో పాటు కొండలు తండ్రికి కూడా కాపీ గ్లాసు ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. పాలు కాచి కాఫీ గ్లాసులు ఇచ్చి వారితో పాటు ముఖ్యమంత్రి కూడా కాఫీ తాగటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొండలు తండ్రిని ఒకవైపు, ఇద్దరు పిల్లలను మరో వైపు మంచంపై కూర్చోబెట్టుకుని వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బీసీ కుటుంబం అయినందున ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తుందని, మరో రెండున్నర లక్షలు పార్టీ ఇస్తుందని వారికి చెప్పారు. వెంటనే ఇంటినిర్మాణం పూర్తి చేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం చాకలి నాగరాజు ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తోడుగా ఉంటుందని చెప్పారు. షేక్ రేణుక తన భర్తను కోల్పోయింది. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

ప్రజావేదిక పై పేదల సేవలో అన్న కార్యక్రమంలో చంద్రబాబు పలువురితో మాట్లాడారు. జూన్ లో జరిగిన ఎన్నికలు మార్పుకు నాంది పలికాయన్నారు. తన జీవితంలో ఎప్పుడూ ఇటువంటి మార్పును చూడలేదన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వ్యవస్థలను సర్వనాశనం చేశారు. దోపిడీ చేశారు. తెచ్చిన డబ్బులు దుర్వినియోగం చేశారు. కేంద్రంలో 94 సెంట్రల్లీ స్పన్సర్డ్ స్కీమ్స్ డబ్బులు వేరే వాటికి వాడారు. 45 శాతం కేంద్రం ఇస్తుంది. ఆ పథకం కింద మంచినీటికి డబ్బులు తెచ్చారు. మంచినీరు ఇవ్వలేదు. పంచాయతీలకు వచ్చే డబ్బులు దుర్వినియోగం చేశారు. 75 పథకాలను గాడిలో పెట్టానన్నారు.

Delete Edit

రోడ్డులేకపోతే రవాణా సౌకర్యాలు ఉండవు. నేను రాగానే గోతులు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మాది. మేము రాగానే చెత్తపన్ను ఎత్తివేశాము. అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు, గీత పనివారల జీవితాలు బాగు చేశాము. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాము. 48 గంటల్లో ధాన్యం రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. టెక్నాలజీ ఉపయోగించి పాలన చేస్తున్నాం. డ్రిప్, మైక్రో ఇరిగేషన్, ఆధునిక పనిముట్లు ఇస్తాం. డ్రోన్స్ సహకారంతో వ్యవసాయం చేయిస్తాం. హార్డవర్క్ కాదు, స్మార్ట్ వర్కు చేస్తుంది. వ్యవసాయంలో ఖర్చు తగ్గి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.

అమరావతి మనందరి రాజధాని, పట్టాలెక్కిస్తున్నాం. మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ అనాథను చేసింది. ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం. పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం. రూ. 12,151లు పోలవరానికి డబ్బులు తీసుకొచ్చాం. గోదావరి పెన్నా అనుసంధానం చేస్తాం. కృష్టా నీటిని బనకచర్ల కు, పోలవరం నుంచి వంశధారకు నీరిస్తాం. అన్నీ మనకు ఇస్తున్న భూమి తాపంతో ఉంది. అందుకే జలహారతి ద్వారా నదుల అనుసంధానం చేపట్టామన్నారు.

వెలిగొండ నుంచి బనకచర్లకు నీటిని తీసుకు పోతాం. గోదావరి నుంచి మూడు వేల టీసెంసీ నీరు సముద్రంలో కలిసింది. కృష్టా నుంచి 800 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. ఈ నీరు వాడుకోవాలి. కరువు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. నా జీవితాశయం జలహారతి. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తా మన్నారు.

రూ. 2245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్ వస్తోంది. పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగాలు వచ్చేలా చేస్తా. మిరాకిల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు నేనే ఫౌండేషన్ వేశా. డ్రోన్ ఉపయోగాలను అన్వేషిస్తున్నాం. డ్రోన్స్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రెండు లక్షల కోట్లు పెట్టేందుకు గ్రీన్ ఎనర్జీ ముందు కొచ్చింది. మాపై నమ్మకంతో వస్తున్నారు. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎలా వస్తుందని అడుగుతున్నా.. అన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. త్వరలోనే మెగా డీఎస్సీ పెడుతున్నం. స్కూళ్లు తెరిచేలోపుల పోస్టింగ్స్ ఇస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. చదువుకునేందుకు సమయం కావాలని అడిగినందునే డీఎస్సీకి సమయం పెంచామన్నారు.

Tags:    

Similar News