పేరు మారిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా?

స్పందన కార్యక్రమం పేరు మారి పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ హయాంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌గా పేరు ఉండేది. జగన్‌ దీనిని స్పందనగా మార్చారు. ఇప్పుడు మరో పేరు!

Update: 2024-06-15 12:09 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైఎస్‌ఆర్‌ పింఛన్‌ పథకానికి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ స్కీమ్‌గా పేరు మార్చింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు కాబట్టి ఆయన పేరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పింఛన్‌ పథకానికి పెట్టుకున్నారు. తాజాగా అదే పేరును తిరిగి ఖరారు చేశారు.

పబ్లిక్‌ గ్రీవెన్స్‌ పేరును మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్‌ ఏ విధంగా స్పందించాలని అనుకున్నారో తెలియదు కానీ గ్రీవెన్స్‌ను స్పందనగా మార్చడం వల్ల కొత్తదనం తీసుకొచ్చింది ఏమీ లేదు. పైగా స్పందనలో తీసుకున్న అర్జీలకు దిక్కులేకుండా పోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్పందనకు బదులుగా ఏకంగా ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రెసెల్‌’ పేరును ఖరారు చేశారు. గతంలో ఉన్న జీవో ఆర్టీ నెం: 1943, జీవో ఆర్టీ నెం: 69లో మార్పులు చేస్తూ 2024 జూన్‌ 14న మెమో నంబరు 2467722/Plg.VII/2024 జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ మెమో విడుదలైంది. పౌరుల ఫిర్యాదుల పరిష్కారం ప్రజా పరిపాలనలో Public Grievance Redressal కీలక పాత్ర పోషిస్తుందనేది ప్రభుత్వ భావన.
Delete Edit
ఇప్పటి వరకు జరిగిన స్పందన కార్యక్రమాన్ని, ఫిర్యాదుల పరిష్కార తీరును ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పరిష్కరించిందో పరిశీలించిన నూతన ప్రభుత్వం దీనికి కొన్ని సవరణలు అవసరమని గమనించినట్లు మెమోలో పేర్కొన్నారు. పరిష్కారంలో తీసుకోవలసిన చర్యలను ఏ విధంగా పునరుద్దరించాలో దీనికి కొత్త పేరును ఏది పెడితే బాగుంటుందో ఆలోచించి ఈ నామకరణం చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన మెమోలో చెప్పడం విశేషం.
ప్రస్తుతం జిల్లాల్లో కలెక్టర్లు ఉపయోగిస్తున్న స్పందన టైటిల్‌ను తొలగించి ఫిర్యాదుల రసీదు, పరిష్కార వ్యవస్థలను ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ సిస్టమ్‌’ అనే సాధారణ పేరుతో నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మెమోలో స్పష్టం చేశారు.
సిస్టం పనిచేయడం లేదనే ఆరోపణలు
ప్రజలు ఫిర్యాదులు చేసినప్పుడు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహశీల్దారులు వారి కార్యాలయాల్లో ఇతర శాఖల అధికారులను పిలిపించుకొని అక్కడిక్కడే పరిష్కరించదగినవి పరిష్కరించడం, మిగిలిన ఫిర్యాదులు ఏ స్థాయిలో పరిష్కారం అవుతాయో ఆ స్థాయి అధికారికి పంపించడం కింది స్థాయి అధికారులు చేస్తారు. గ్రీవెన్స్‌ అనేది ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ప్రభుత్వం మారినప్పుడల్లా పేర్లు మారుస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేరు మార్చినంత మాత్రాన కొత్త దనం ఏమి వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
ఫిర్యాదు నమోదుతోనే సరి..
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించగానే కంప్యూటర్‌లో తయారు చేసిన ఫార్మేట్‌ ప్రకారం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించాల్సిందై ఉండి అర్జీ తహశీల్దారుకు వచ్చినటై్టతే దానిని ఆన్‌లైన్‌ ద్వారానే కలెక్టర్‌ కార్యాలయానికి పంపుతారు. సమస్యను బట్టి అది ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాల్సి ఉంటుందో కూడా ఆన్‌లైన్‌ ఫార్మేట్‌లో నిర్థేశించబడుతుంది. ప్రతి రోజు గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను పరిశీలించి ఏ దశలో పెండింగ్‌లో ఉంది, ఎవరి వద్ద పరిష్కారం అయింది అనే వివరాలు అప్‌లోడ్‌ చేసిన వారు తెలుసుకొని ఎప్పటికప్పుడు రిమైండ్‌ చేస్తూ ఉండాలి. అర్జీ దారులు తిరిగి ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చి మరో అర్జీ ఇచ్చేంత వరకు దానిని అధికారులు పట్టించుకోవడం లేదు. పెండింగ్‌లో ఉంచిన అధికారిని ఎందుకు పరిష్కరించలేదని పై అధికారులు అడగడం లేదు. సమస్య పరిష్కారం కాలేదని ఫిర్యాదు దారు వచ్చి గ్రీవెన్స్‌లో మరో అర్జీ ఇచ్చాడంటే అధికారులు చిర్రెత్తి పోతున్నారు. పోయిన వారం అర్జీ ఇచ్చావు కదా, ఇప్పుడెందుకు వచ్చావంటూ గతంలో అర్జీ తీసుకున్న అధికారులు ఫిర్యాదుదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు.
రెండేళ్లుగా సమస్య పరిష్కరించని తహశీల్దార్‌
ఉదాహరణకు రెండేళ్ల క్రితం సాధారణ పాస్‌ పుస్తకంలో నుంచి డిజిటల్‌ పాస్‌ పుస్తకంలోకి వివరాలు నమోదు చేసేటప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లిలోని వెంకటేశ్వర్లు అనే రైతు పేరు తప్పుగా నమోదైంది. పేరు తప్పుగా వచ్చిందని తహశీల్దారుకు కనీసం పది సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదు. ఫిర్యాదు చేసిన ప్రతి సారీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను పిలిచి పేరును వెంటనే మార్చాలని ఆదేశిస్తారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఆ రైతుతో మాట్లాడుతూ మీరు ‘మీ సేవా సెంటర్‌లో కానీ గ్రామ సచివాలయానికి’ కానీ వెళ్లి ఓరిజినల్‌ పేరు, తప్పుగా నమోదైన పేరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయిస్తే మాకు వస్తుందని, దానిని మేము ఆథరైజ్‌ చేసి ఉన్నతాధికారులకు పంపుతామని, అప్పుడు మీకు ఒరిజినల్‌ పేరుతో పాస్‌ పుస్తకం మొకటి వస్తుందని చెప్పి తప్పించు కుంటున్నారు. నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దీనిపై ఆ రైతు ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఆ కాపీని చేత పట్టుకొని స్థానిక విఆర్వో రైతుకు నేరుగా ఫోన్‌ చేసి కలెక్టర్‌కు మీరు ఇచ్చిన ఫిర్యాదు కాపీ మాకు వచ్చింది.. మీరు సచివాలయంలో పేరు మార్పునకు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయించాలని సూచించారు. అక్కడకు వెళ్లి పేరు మార్పు విషయాన్ని తెలియజేస్తే దీనిపై తహశీల్దారు లాక్‌ విధించారని, వారు లాక్‌ ఓపెన్‌ చేస్తే తప్ప మేమేమీ చేయలేమని సచివాలయ ఉద్యోగులు చెప్పడం విశేషం. తన పొలానికి సంబంధించి లాక్‌ ఎందుకు పెట్టారో తెలుసుకునేందుకు ఎన్ని సార్లు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లినా తహశీల్దార్‌ క్యాంపులకు వెళ్లారని, రాత్రి ఎనిమిది గంటలకు వస్తే వుంటారని అక్కడి ఉంద్యోగుల నుంచి సమాధానం వస్తుంది.
ఇలా రెండేళ్లుగా ఒక రైతు తన పాస్‌ పుస్తకంలో తప్పుగా నమోదైన పేరును మార్చమని అధికారుల చుట్టూ తిరుగుతున్నా, మార్చేందుకు అవకాశం ఉన్నా.. పట్టించుకోని అధికార్లను ఏమనాలి? పైగా పాస్‌ పుస్తకంలో రైతు ఫోటో ఉంటుంది. కింది భాగంలో రైతు సంతకం ఉంటుంది. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్నా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇలాంటి గ్రీవెన్స్‌లకు ఎన్ని సార్లు పేర్లు మార్చినా ఏమి ఉపయోగం ఉంటుందనేది పలువురి మాట. ఇలాంటి అధికారులపై ఏ విధమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ మెమోలో స్పష్టం చేసి ఉంటే బాగుండేదని, కేవలం పేరు మార్చడం వల్ల బాధితులకు లాభమేమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌ ది ఫెడరల్‌ ప్రతినిధితో అన్నారు.
Tags:    

Similar News