మాజీ మంత్రి విడదల రజిని ని అరెస్ట్ చేస్తారా?
మాజీ మంత్రి విడదల రజిని పై కేసు నమోదు చేసేందుకు పది నెలల తరువాత ప్రభుత్వ కల సాకారమైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టోన్ క్రషర్ వ్యవహారం నడుస్తూనే ఉంది.;
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన విడదల రజిని పై పది నెలల తరువాత ఏసీబీ కేసు నమోదు చేసింది. అన్ని ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలు ఈరోజుకీరోజు వచ్చినవి కావు. ఎన్డీఏ అధికారం చేపట్టిన రోజు నుంచి ఉన్నవే. ఈ ఆరోపణలపై ప్రభుత్వం మొదట విజిలెన్స్ విభాగాన్ని విచారించాల్సిందిగా ఆదేశించింది. విజిలెన్స్ వారికి విచారించేందుకు పది నెలలు పట్టింది. ఇద్దరు ఆరుగురు వ్యక్తులను విచారించేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందనే చర్చ కూడా నడిచింది. ప్రతి నెలా ఈ ఆరోపణలపై పత్రికల్లో వార్తలు రావడం సాధారణ విషయమైంది. వార్త వచ్చినప్పుడల్లా విడదల రజిని, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజిని పీఏ రామకృష్ణ పేర్లు తెరమీదకు వస్తాయి. అనేక సార్లు ఈ విషయంలో రజిని స్పందించారు.
ఏమిటి కేసు
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాధుని కండ్రిక గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఉంది. ఈ స్టోన్ క్రషర్ నిబంధనలు పాటించడం లేదని, నడుపుకోవాలంటే లంచం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2020 సెప్టెంబరు 4న రజిని పిఏ దొడ్డా రామకృష్ణ వెళ్లి క్రషర్ వారిని బెదిరించారని, ఆ తరువాత విజిలెన్స్ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా పిలిపించి క్రషర్ వారిని పిలిపించి 2021 ఏప్రిల్ 4న రజిని మరిది విడదల గోపీ కి రూ. 2కోట్లు ఇప్పించారని, తాను రూ. 10 లక్షలు తీసుకుని, రామకృష్ణకు రూ. 10 లక్షలు ఇప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇప్పించారు. నివేదిక అనుసరించి ఏసీబీ వారు కేసు నమోదు చేశారు.
రజిని ఏమంటున్నారు..
తన మనోధైర్యాన్ని దెబ్బతీసి, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. అక్రమ కేసులే మీ లక్ష్యమైతే వంద కేసులు ఎదుర్కుంటా. విష ప్రచారాలే లక్ష్యమైతే వేయి ప్రచారాలు ఎదుర్కుంటా.. నా నిజాయితీ, సత్యం, ధర్మమే నాధైర్యం. నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూట్టానికి నేను ఎదురు చూస్తూ ఉంటానని ట్విటర్ వేదికగా స్పందించారు విడదల రజిని. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. కేసులో ఫిర్యాదు దారుడు టీడీపీ వ్యక్తి. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు డైరెక్షన్ లో కేసు పెట్టారని అన్నారు.
రజినీని అరెస్ట్ చేస్తారా?
ఎలాగైనా విడదల రజిని ని అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు. ఎన్ని కేసులు వెతికినా ఆధారాలు దొరకలేదని, ఈ ఒక్క కేసులో ఆధారాలు ఉన్నట్లు ఏసీబీ వారు చెప్పినందున కేసు నమోదు చేశారు. అవినీతి కేసు కావడం వల్ల రజిని ని అరెస్ట్ చేస్తారా? అనేది చర్చగా మారింది. ఆమెను వ్యతిరేకించే మర్రి రాజశేఖర్ ఇటీవల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతా కలిసి తనపై కుట్రపన్ని నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారని, దేనినైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రజిని అంటున్నారంటే అరెస్ట్ కు కూడా ఆమె సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.