‘అమరావతికి ప్రాధాన్యత’.. ఆర్థిక మంత్రుల సమావేశంలో ఏపీ మంత్రి

కేంద్రం నిర్వహించిన ఆర్థిక మంత్రుల సమావేశంలో ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ పలు కీలక డిమాండ్లు చేశారు. విభజన హామీల అమలుకు నిధులు కేటాయించాలని కోరారు.

Update: 2024-06-22 07:42 GMT

దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌కు ముందు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, వారికి కావాల్సిన నిధులు, వేటికి ఎంత నిధులు కావాలని అన్న అంశాలపై చర్చించడానికి కేంద్ర మంత్రి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఏపీ పయ్యావుల కేశవ్, తెలంగాణ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. అమరావతికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

‘కేంద్రం భారీగా సాయం చేయాలి’

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 54శాతం ఓట్లతో 164 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ కూటమి. రాష్ట్ర అభివృద్ధి తమతోనే సాధ్యమని నమ్మ ఎనలేని నమ్మకంతో రాష్ట్ర ప్రజలు మాకు అధికారం అప్పగించారు. కాబట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఎంతో ఉంది. తూతూ మంత్రంగా ఏ పనులను చేసే యోచన కూడా లేదు. అన్ని రంగాల అభివృద్ధి దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం మాకు పెద్దయెత్తున సహాయ సహకారాలు అందించాలి’’ అని కోరారు.

అమరావతికే ప్రాధాన్యత

‘‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో అధఃపాతాళానికి వెళ్లింది. దానిని తిరిగి గాడిలో పెట్టడానికి, రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగు పరచడానికి కేంద్ర సహకారం ఎంతో అవసరం. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కావున ఆర్థిక సంవత్సరం 2024-2025 బడ్జెట్‌లో అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించాలి. దాంతో పాటుగా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని నిశ్చయించుకున్నాం. ఇందుకు కూడా కేంద్రం సహకరించి నిధులు కేటాయించాలి’’ అని వివరించారు.

పారిశ్రామిక ప్రగతి సాధించాలి

‘‘ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం ఉందా అన్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రంగాన్ని తిరిగి ప్రగతి బాటలో నడిపించాలి. అందుకు కేంద్రం తోడ్పాటు అందించాలి. విశాఖ-చెన్నై కారిడార్ సహా పారిశ్రామిక నోడ్స్‌ను అభివృద్ధి చేయాలి. మెటా టెక్స్‌టైల్స్ పార్క్, మెగా ఆక్వా పార్క్ అభివృద్ధికి సహాయం అందించాలి. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా విభజన చట్టంలోని హామీల అమలు కేంద్రం చొరవ తీసుకుని సహకారం అందించాలి’’ అని కోరారు పయ్యావుల కేశవ్.

Tags:    

Similar News